బహుభాషా పండితుడు, మన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు. తెలుగు, ఇంగ్లీషు, సంస్కృతం, జర్మన్, ఫ్రెంచ్, రష్యన్ భాషలను కూడా అవపోసన పట్టిన ఘనుడు. ఆయా భాషల్లో తన అభ్యుదయ వాదానికి అనుకూలంగా దగ్గరగా ఉన్న కవితలను తెలుగులోనికి అనువదించి తెలుగు పాఠకు లకు కూడా వాటి వాడి, వేడి, రుచి చూపిం చాడు. ఈ అనువాద కవితలు ముఖ్యంగా మహాప్రస్థానం, ఖడ్గసృష్టి, మరో ప్రస్థానం లాంటి ముఖ్య సంకలనాలలో కనిపిస్తాయి. మహా ప్రస్థానం గీతాలన్నీ 30వ దశకంలోనే రాశాడు ఒకటి రెండు తప్ప. 1940 నాటికి ప్రెస్ కాపీ సిద్ధమైంది కానీ 1950లో అంటే శ్రీశ్రీ 40వ యేటా అది ప్రచురణకు నోచుకుంది. ఆర్థిక మాంద్యం, రెండో ప్రపంచయుద్ధం ఒకపక్క ప్రపంచాన్ని అతలాకు తలం చేస్తుండగా మార్క్సిస్టు స్ఫూర్తి, సామాజిక స్పృహగల మహాప్రస్థాన గీతాలు తెలుగు నాట మారుమోగుతున్న పరిస్థితి. శ్రీశ్రీ జన్మత: కమ్యూనిస్టులాగా కనపడతాడు. అందుకే జాతీయ దురహంకారాన్ని అభ్యుదయ నిరోధకంగా భావించి అంతర్జాతీయ దృక్పథాన్ని ఆశ్రయిస్తాడు. ”చైనాలో రిక్షావాలా, చెక్ దేశపు గని పనిమనిషి, ఐర్లాండ్ ఓడ కళాసిని” స్పృశిస్తాడు.
స్విన్ బర్న్ కవి గొప్పతనాన్ని ”షెల్లి కవనపు హల్లిసకము, ఫ్రెంచి గీతుల మంచి రీతులు, మోహినీ గంధర్వగానం, కవీ నీ పాటల్” అంటూ వర్ణిస్తూ ఆయన రాసిన ఎ మ్యాచ్ గీతం లాగానే మహాప్రస్థానంలో ‘అద్వైతం” గీతం రాశాడు. ”అంతేలే పేదల గుండెలు, అశ్రువులే నిండిన కుండ”లంటూ వారి బతుకులు ”తిరిపెమునకు పిడికెడు మెతుకులు” అనే పేదల గీతం కూడా రాసిన లెస్ ప్రావెస్ కవితకు అనువాదం. ”గర్జించు రష్యా! గాండ్రించు రష్యా!” అంటూ సోవియట్ రష్యాను ప్రపంచం ఆహ్వానిస్తున్న ట్టు రాసిన కవిత నాటి ప్రపంచంలో సామ్యవాద ధోరణులకు ఉన్న మద్దతును తెలియజేస్తుంది. ”మరో ప్రపంచం పిలిచింది” అనే గీతంలో సామ్యవాద ప్రపంచం దిశగా మన ప్రస్థానం జరగాలనేదే శ్రీశ్రీ ఆశయం. ”ప్రపంచం మొత్తం మీద భయం పెత్తనం చేస్తోంది, ఇరుగువాడు పొరుగువాడిని చూసి ఎందుకో భయ పడిపోతున్నాడు”. ఇది గత దశాబ్దం యాభైలలో రాసిందైనా వంద సంవత్స రాల తరువాత నేడు కూడా అక్షర సత్యం.
ఇక ఖడ్గసృష్టిలోని ”మున్నుడి”లో అమెరికన్ అధ్య క్షుడు జాన్ కెనేడీని హెచ్చరిస్తాడు. ”ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు?” అంటూ గత వైభవం ఇక గతమేనా అని ప్రశ్నించే ” ఏవి తల్లి” గీతం రాసిన ఎఫ్ విలాన్ రాసిన ‘The Snows of Yester’ గీతానికి అనుసరణము. ఈ పుస్తకం మధ్య నుండి దాదాపు ఇరవై అనువాదాలు ఉంటాయి. అవి గురజాడ మొదలు మయకొవ్‌స్కీ వరకు రకరకాల సందర్భాల్లో రాసిన కవితలకు శ్రీశ్రీ అనువాదాలు. పాల్ ఎలార్డ్ రాసిన కవితకు అనువాదం ”ద్వేషగీతం”లోనూ బూర్జువా, పోలీసు, పూజారి రాజ్యాలను ఆయన ఏ విధంగా ద్వేషిస్తాడో చెప్తూ వారిని ద్వేషించని వాడిని తాను మరీ తీవ్రంగా ద్వేషిస్తానంటాడు. అధివాస్తవి కోద్యమ నాయకుడు ఆండ్రీ బ్రిటన్ రాసిన ”తెల్ల వెంట్రుకల రివాల్వర్” నుండి ఛాయా భంగిమలు, దిగుమతి చేసిన వచన గీతాలు, వికారి క్రిస్టఫర్ లోగ్ రాసిన ”ప్రొఫెసర్ గారి రిపోర్టు” గీతాల అనువాదాలు ఆసక్తికరంగా ఆలోచింప జేసే విధంగా ఉంటాయి. రష్యన్ విప్ల వోద్యమ నాయకుడు, మొదటి అధ్యక్షుడు లెనిన్‌పై ఒక గొప్ప అనువాదం ”ఇదే అదను లెనిన్ కథను రచించెదను నేను, లెనిన్ బతుకు జనం కోసం ధ్వనించెదను నేను” అంటూ సాగే ఈ గీతంలో లెనిన్ గొప్పతనాన్ని కొలవడానికి కొలతలు కొలమానాలు లేవని చెప్తాడు. ఇది అనువాద కవితల్లో ఒక గొప్ప ఒరవడి.
1933లో తెలుగు కవిత్వానికి పోరాటభాషను నేర్పడం మొదలుపెట్టాడు శ్రీశ్రీ. సామ్రాజ్యవాద వ్యతిరేకతను తన కవితల్లో వినిపించాడు. మన దేశంలో కమ్యూనిజం వస్తుందంటారా? అని అడిగితే గంభీరంగా కమ్యూనిజం ప్రపంచమంతట వస్తుంది అని ఎంతో ఆశావహమైన విశ్వాసంతో కూడిన సమాధానం ఇస్తాడు. మరో ప్రస్థానంలో పద్నాలుగు అనువాద గీతాలున్నాయి. పెరూ దేశపు మహాకవి వల్లేజో గీతం అనువాదం ”ఎక్కడ సత్యం” విసిగిన వలయాలు, అంతేగాక చేగువేరా కవితకు అనువాదం ”ఫిడెల్ కోసం పాట” టర్కిష్ కవి నజీమ్ హక్మిత్ చిలి కవి పాబ్లో నెరుడా, ఫ్రెంచ్ కవి పాల్ ఎలార్డ్, అంగోలా కవి అగస్టీనో నెటో, చైనీస్, జపనీస్, గ్వాటేమల కవుల రచనలను శ్రీశ్రీ అనువదించి తెలుగుజాతికి అందించాడు. అందులో కొన్ని అద్భుతమైన వాక్యాలు చూద్దాం. ”నేను ఆకలితో ఉన్నాను, నువ్వు చంద్రుడి వద్దకు వెళ్లావు; నాకు కోపం వచ్చింది, కారణం కమ్యూనిస్టుల మీదకు నెట్టావు”. ఈ గేయం మార్టిన్ నిమోలర్ రాసిన ”First They Came” కవితను గుర్తుచేస్తుంది. ”నూరు పువ్వుల్ని వేయి కత్తులుగా మార్చే ఆగ్రహం; లక్ష చుక్కల్ని ఒక్క పాటగా పేర్చే ఆగ్రహం” అదే పేదవాళ్ల ఆగ్రహం. ”నికృష్టపు లొంగుబాటుతో కొనుక్కున్న బతుకుఎన్నడూ బతుకే కాదు” అంటూ ఉద్బోధించాడు తన అనువాద కవితల్లో.
ఇక తెలుగులో భైరవయ్య రాసిన ”చెరచబడ్డ గీతాన్ని” ఇంగ్లీషులోనికి I am a Ravished Poem’అని, చెరబండ రాజు రాసిన ”వందేమాతరం” కవితను కూడా ఇంగ్లీషులోనికి అనువదించాడు. అంటే ఇతర భాషల నుండి తెలుగులోనికి, తెలుగు నుండి ఇంగ్లీషులోనికి అనువదించ గలిగిన దిట్ట మహాకవి శ్రీశ్రీ.ఆయన కవిత్వం చదువుతుంటే ఆ పదాల వేగానికి ఆ గీతాల ఒరవడికి పాఠకుడు కొట్టుకు పోతాడు. కానీ ఆయన కవితలు కొన్ని చదవాలన్నా, అర్థం చేసుకోవాలన్నా చాలా కష్టం. వాటిలో అనేకమంది అంతర్జాతీయ కవులు, రాజకీయ నేతలు వస్తారు. ఫుట్‌నోట్స్ లేకుండా వాటిని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. అందుకే కావచ్చు శ్రీశ్రీ పుస్తకాలు అన్నింటిలోనూ ఆ మహాకవుల ప్రపంచ నేతల వివరాలు కూడా సందర్భాలతో సహా పేజీ అడుగున లేదా కవిత చివరన ఉంటాయి. వాటిని అన్వయించుకుని అర్థం చేసుకొని చదవాలి. మానవజాతిని ఉద్ధరించడానికి కొత్త మతాన్ని కనిపెట్టిన కవి ప్రవక్త అతడు. హిమాలయాల అంతటి ఎత్తుననున్న అతడి వీపు తట్టే ప్రయత్నం చేయవద్దు. మన బాధనే కాదు ప్రపంచపు బాధనంతా తన కవితల్లోను, అనువా దాల్లోనూ వినిపించాడు. అవి నినాదాలుగా అనునా దాలుగా జనాల్లో మారుమోగా యి, ఇంకా మోగు తూనే ఉన్నాయి.
శ్రీశ్రీ కుమార్
9440354092



