కనుపర్తి వరలక్ష్మమ్మ… ప్రముఖ తెలుగు రచయిత్రి, స్వాతంత్ర పోరాట యోధురాలు, మహిళా అభ్యుదయానికి కృషి చేసిన సామాజిక సేవకురాలు. విద్యలో పాటు విషయ పరిజ్ఞానం ఉన్న మహిళలు తమ సమస్యలనే కాకుండా సమాజంలో తనలాంటి వారు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించగలుగుతారు. సమస్యలను చర్చిస్తూ పరిష్కారాలను సూచిస్తూ అవగాహన కల్పిస్తారు. ఈ ప్రయత్నమే చేసిన ఆ గొప్ప రచయిత్రి జయంతి ఈరోజు. ఈ సందర్భంగా ఆమె గురించి మరిన్ని విశేషాలు…
కనుపర్తి వరలక్ష్మమ్మ బాపట్లలో 1896, అక్టోబర్ 6న జన్మించారు. తల్లిదండ్రులు హనుమాయమ్మ, పాలపర్తి శేషయ్య. శేషయ్య మిక్కిలి సనాతన పరాయణుడు. ఆడపిల్లలకు చదువెందుకని భావించే వ్యక్తి. అలాంటి కుటుంబంలో పుట్టిన వరలక్ష్మికి చదువెలా సాధ్యమయిందనే ఆలోచన రాక మానదు. ఆమె ఐదుగురు అన్నలు చదువుపై చెల్లెలికున్న ఆసక్తిని గుర్తించి ప్రోత్సహించారు. అలా వరలక్ష్మి నాలుగవ తరగతి పూర్తి చేశారు. చిన్నతనంలోనే సాహిత్యంపై ఆసక్తితో ఎన్నో పుస్తకాలు చదివేవారు. పదమూడేండ్ల వయసులో హెల్త్ ఇనిస్పెక్టర్‌గా పనిచేసే కనుపర్తి హనుమంతరావుతో 1909లో వివాహం జరిగింది. పెండ్లి తర్వాత భర్త ప్రోత్సాహంతో ఎన్నో రచనలు, అనువాదాలు చేశారు. ఎన్నో పదవులు అలంకరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ నుంచి ఉత్తమ రచయితగా పురస్కారం అందుకున్నారు.
శారద పాత్ర ద్వారా…
వరలక్ష్మమ్మ మొదటి కథ సౌధామిని, 1919లో ఆంగ్లానువాదం చేశారు. ఆ తర్వాత ప్రముఖ మాస పత్రిక గృహలక్ష్మిలో 1929 నుంచి 1934 వరకు ధారావాహికంగా శారదలేఖలు పేరుతో ఒక శీర్షిక రాశారు. ఆ కాలంలో మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, వాటికి పరిష్కారాలు సూచిస్తూ సాగే ఆ శీర్షికకు పాఠకుల ఆదరణ ఎంతగానో ఉండేది. సమస్యలపై అవగాహన కల్పించిన రచయిత్రిగా ఆమె మహిళా పాఠకుల్లో అభిమానం సంపాదించుకున్నారు. ఆ తర్వాత వాటినే శారద లేఖలు పేరుతో పుస్తకంగా ప్రచురించారు. ఆధునిక భావాలు గల శారద పాత్ర ద్వారా స్త్రీలను చైతన్యవంతం చేయడానికి ఇవి దోహదం చేశాయి. ఒక రచయిత్రి ఒక పత్రికలో అంత కాలం ఒకే కాలమ్ నిర్వహించడం అదే మొదటిసారి. సాహిత్యంలోని అనేక ప్రక్రియల్లో ఆమె రచనలు చేశారు.
స్వర్ణకంకణం అందుకున్నారు
లేడీస్ క్లబ్, రాణి మల్లమ్మ, మహిళా మహోదయం, పున:ప్రతిష్ఠ వంటి నాటికలు, ద్రౌపది వస్త్ర సంరక్షణ అనే ద్విపద కావ్యం, సత్యా ద్రౌపది సంవాదం, నాదు మాట మొదలైన పద్య రచనలు చేశారు. గేయాలు రాశారు. గాంధీ మీద దండకం కూడా రచించారు. ఇవే కాకుండా పిల్లల కోసం అనేక పాటలు, నవలలు, కథలు రచించారు. ప్రముఖుల జీవిత చరిత్రలు రచించారు. అంతేకాదు ఆమె రచనలు కొన్ని తమిళ, కన్నడ, హిందీ భాషల్లోకి అనువదించారు. తన రచనలకుగాను గృహలక్ష్మి స్వర్ణకంకణాన్ని అందుకున్న మొదటి మహిళ ఈమె. మద్రాస్, విజయవాడ ఆకాశవాణి కార్యక్రమాలలో పాల్గొన్న మొదటి మహిళ. అంతేకాదు ప్రపంచ తెలుగు మహాసభలో సన్మానం పొందిన రచయిత్రి కూడా కావడం విశేషం.
స్త్రీ హితైషిణి మండలి
సామాజిక సేవా రంగంలోనూ ఆమె విశేష కృషి చేశారు. బాపట్లలో స్త్రీల కొరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి, మహిళా చైతన్యానికి మార్గదర్శిగా నిలిచారు. సమాజం స్త్రీల పట్ల అనాదిగా చూపుతున్న వివక్షతను ఖండిస్తూ వారి అభ్యుదయానికై 1931లో స్త్రీ హితైషిణి మండలిని స్థాపించారు. అంతేకాకుండా మండలికి అనుసంధానంగా సీతా పుస్తక సదనాన్ని ఏర్పాటు చేశారు. 1952 నాటికి మండలికి సొంత భవనాన్ని ఏర్పాటు చేశారు. దానికి గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. కుల, మత విచక్షణ లేకుండా మహిళలకు కుట్లు, సంగీతం, హిందీ తరగతులు నిర్వహించారు. మహిళలను సమాజం పట్ల జాగృతం చేసేందుకు సమావేశాలు ఏర్పాటు చేశారు.
కవితా ప్రవీణ
గుంటూరు జిల్లా బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఆ సమయంలో జిల్లా బోర్డు హైస్కూల్‌కి సరియైన భవనం లేక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడేవారు. కమిటీ సభ్యులతో మాట్లాడి హైస్కూల్‌కి అన్ని వసతులతో చక్కని భవనం నిర్మించడంలో ఆమె ఎంతో కృషి చేసారు. గుడివాడ ప్రజలు ఆమెను ప్రేమగా కవితా ప్రవీణ అని పిలుచుకునేవారు. ఎన్నో కట్టు బాట్లు, ఆంక్షలు ఉన్న రోజుల్లో సమాజం కొరకు, మహిళల్లో చైతన్యం నిపడం కొరకు ఆమె చేసిన కృషి, పట్టుదల మాటల్లో వివరించలేనివి. అటువంటి గొప్ప వ్యక్తి 1978 ఆగస్టు 13న మరణించారు. భౌతికంగా దూరమైనా తన ఆలోచనలతో మనలో స్ఫూర్తి నింపారు. కనుపర్తి వరలక్మ్షమ్మ ఎందరికో ఆదర్శం. ఆమె చూపిన మార్గంలో నడవటమే మనం ఆమెకిచ్చే నిజమైన నివాలి.
జాతీయోద్యమంలో…
రచయితగానే కాదు స్వాతంత్ర సమరంలోను ఆమె పాల్గొన్నారు. 1921లో విజయవాడ వచ్చిన మహాత్మా గాంధీని కలిసి జాతీయోద్యమంలో భాగస్వామి అయ్యారు. ఆ సమయంలో తాను స్వయంగా వడికిన నూలును, ఒక ఉంగరాన్ని బాపూజీకి సమర్పించారు. అది స్వీకరించిన బాపూజీ ఆమెతో ‘రోజూ నూలు పడుతున్నావా’ అని అడిగారు. ఆమె అవునని చెప్పారు. అయితే ఈరోజు ఖద్దరు కట్టుకుంటావా అని ఆమెను తిరిగి ప్రశ్నించారు. దానికి ఆమె కట్టుకుంటాను అని సమాధానం చెప్పారు. ఆ నాటి నుంచి ఆమె ఆఖరి క్షణం వరకు బాపూజీకి ఇచ్చిన మాటకు కట్టుబడి ఖద్దరు వస్త్రాలనే ధరించేవారు. ‘నా జీవము ధర్మము, నా మతము నీతి, నా లక్ష్యము సతీ శ్రేయము. ఈ మూడింటినీ సమర్ధించుటకే నేను కలము బూనితిని’ అని చెప్పుకున్న రచయిత్రి ఆమె. తన రచనల ద్వారా మహిళల్లో పోరాట పటిమను పెంచారు.
– పాలపర్తి సంధ్యారాణి