పరిశ్రమ వర్గాల ఆందోళన..25 నుంచి పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో
నవతెలంగాణ - హైదరాబాద్
కోళ్ల దాణా కొరత, ముడిసరుకుల ధరల పెరుగుదలతో దేశంలో పౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. గతేడాది కిలో రూ.18గా ఉన్న మొక్కజొన్న ధర ప్రస్తుతం రూ.34కు చేరడంతో కోళ్ల పెంపకందారులు ఆందోళనలో ఉన్నారని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. గురువారం హైదరాబాద్‌లో ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చ రర్స్ అసోసియేషన్ (ఐపీఈఎంఏ) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకటేశ్వర్ హచరీస్ మేనేజింగ్ డైరెక్టర్ కెజి ఆనంద్ మాట్లాడుతూ.. ఖరీఫ్ దిగుబడులు తగ్గడం వల్ల మొక్కజొన్న, సోయ లభ్యత క్షీణించిందన్నారు. ఈ పరిస్థితుల నుంచి పరిశ్రమను గట్టెక్కించేందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) వద్ద ఉన్న పనికి రాని ఆహార నిల్వలను కేటాయించడంతో పాటు, ప్రస్తుతం ఉన్న 15 శాతం దిగుమతి సుంకాలను తొలగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో పరిశ్రమ ఎదుర్కొంటున్న డీటీసీపీ అనుమతులు, పన్నులకు సంబంధించిన సమస్యలను కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరిం చాలని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం దేశంలో రోజుకు 36 నుంచి 37 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరుగుతోందని.. ప్రపంచంలోనే భారత్ రెండో అతిపెద్ద గుడ్ల ఉత్పత్తిదారుగా నిలిచిందని తెలిపారు. నెలకు సుమారు 60 కోట్ల బ్రాయిలర్ కోళ్ల పెంపకం జరుగుతోందని, చికెన్ ఉత్పత్తిలో భారత్ నాలుగో స్థానంలో ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రస్తుతం దేశంలోనే మూడో స్థానంలో ఉందని, వచ్చే ఏడాది నాటికి ప్రథమ స్థానానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. ప్రపంచ పౌల్ట్రీ పరిశ్రమకు హైదరాబాద్ వేదిక కానుందని ఐపీఈఎంఏ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ తెలిపారు. ఈ18వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో-2026 నవంబర్ 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరగనుందన్నారు. 120 దేశాల నుంచి 51 వేల మందికి పైగా ప్రతినిధులు, 550కి పైగా ప్రముఖ సంస్థలు ఈ ప్రదర్శనలో పాల్గొననున్నాయని చెప్పారు. ఈ ఎక్స్‌పోకు ముందు నవంబర్ 24న ‘పౌల్ట్రీ నాలెడ్జ్ డే-2026’ నిర్వహించనున్నామని తెలిపారు.
దేశంలో సుమారు 50 నుంచి 60 లక్షల మంది ఆధారపడి ఉన్న పౌల్ట్రీ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ఈ ఎక్స్‌పో ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐపీఈఎంఏ కార్యదర్శి నటరాజన్ రామసామి, కోశాధికారి ఎం.శ్రీకాంత్, తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ రవీందర్ రెడ్డి, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు మోహన్ రెడ్డి, ప్రతినిధులు వుప్పల నరసింహారెడ్డి, వంగేటి అభిషేక్ రెడ్డి, మొముల సుధాకర్ రెడ్డి, శ్రీనివాస ఫార్మ్స్ సిఎండి చిత్తూరి సురేష్ రాయుడు, ఎన్‌ఇసిసి ప్రతినిధులు గుర్రం చంద్రశేఖర్ రెడ్డి, ఎం.పి.సతీష్ బాబు, పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ డాక్టర్ వి.లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)