వాస్తవాన్ని తెలిపిన కథలు

Stories that tell the truthజీవితాలను మరింత సునిశితంగా పరిశీలించడానికి స్ఫూర్తినిచ్చిన కథల పుస్తకం జమిలిపోగు. 2024 లో వచ్చిన ఈ కథా సంపుటిని రచయిత్రి రుబీనా పర్వీన్‌ రాశారు. సాధారణంగా స్త్రీల కథలు అనగానే వారి దుఃఖాలు కష్టాల కలపోతలే ఎక్కువగా ఉంటాయని అనుకుంటాం. కానీ జమిలి పోగు రకరకాల స్త్రీల ప్రయాణాన్ని ఏరి కూర్చి అల్లినది. గమ్యానికన్నా ప్రయాణం ముఖ్యమైనది అన్న వాస్తవాన్ని తెలిపిన కథలు ఇందులో ఉన్నాయి.
రుబీనా పర్వీన్‌ వత్తి రీత్యా ఎంతోమంది బడుగు వర్గాల స్త్రీల నుంచి ఆర్థికంగా అభివద్ధి చెందిన స్త్రీల వ్యాపార ఉద్యోగాల విషయాలలో పని చేసారు. వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఉపాధులు కల్పించారు. ఆ క్రమంలోనే కాక తను పెరిగిన ఖమ్మం జిల్లా వాతావరణాలు, జీవితాలు కూడా ఆమె కథల్లో కనిపిస్తాయి. తన గుండెకి ఉన్న తడి తన కథల్లో కనిపిస్తుంది.
ముస్లిం స్త్రీల జీవితాల్లో వారి స్వేచ్ఛకి వారి అస్తత్వానికి పరదా వేయడం, తెరదింపడం వంటి విషయాలను బయటివారు చాలా చర్చిస్తుంటారు. నిజానికి అలా మాట్లాడే వాళ్ళకి లోపలి విషయాలు బయట వారిగానే తెలుస్తుంటాయి. తెలియకపోయినా ఒక్కోసారి మాట్లాడుతుంటారు. ఎప్పుడైతే మనలో నుంచి ఒక గొంతు బయటకు వినిపిస్తుందో అప్పుడే దానికి ఒక నిజమైన ప్రామాణికత చేకూరుతుంది. అలాంటి కథ ఖులా. నిజానికి అంతకంటే ముందు రూబీ నా కొన్ని కథలు రాసినా ఖులా కథతో ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందారు. ఇస్లాం చట్టపరంగా స్త్రీలకున్న ఒక ముఖ్యమైన అవకాశం గురించిన కథ ఇది. చదివి తీరాల్సిన కథ.
అలాగే స్కిజోఫ్రీనియా అనే కథ కూడా ఆమెకు మరింత మంది పాఠకులను తెచ్చిపెట్టింది. సాధారణంగా సినిమాల్లో మనం చూస్తున్నప్పుడు మానసిక రోగం ఉన్న పురుషులు హీరోలుగా కనబడుతుంటారు కథ అంతా ఆ జబ్బు చుట్టూరు తిరుగుతూ ఉంటుంది. కానీ ఇంట్లో ఒక రోగి ఉన్నప్పుడు మిగతా కుటుంబ సభ్యులు ఎదుర్కొనే విషయాలను గురించి సినిమాలు తక్కువగా చర్చిస్తుంటాయి ఆ లోటుని తీర్చే కదే ఇది. రోగం ముదిరే కొద్దీ తన సహచరికి ఉండే ప్రేమ కూడా ముదరడం, పరిస్థితులను అంగీకరించడం, నిస్సహాయంగా ప్రేమించడం ఈ కథలో చూస్తాం ఈ కథ చదివిన తర్వాత ఏం జరగనట్టు మామూలుగా నిద్రపోవడం అసంభవం.
రూబీనా కథల్లో కథ ఒక ఎత్తు అయితే కథనం మరో ఎత్తు. ప్రతి కథా వస్తువు గురించి కథనం గురించి ఒకేసారి ఆలోచించడం మనకే తెలియకుండా జరుగుతూ ఉంటుంది. ఖమ్మం గ్రామీణ యాస నుంచి మెట్రోపాలిటన్‌ నగరాల్లో ఇంగ్లీష్‌ మాట్లాడే పాత్రల వరకు ఈ జమిలిపోగు అల్లుకొని ఉంది. మీకు ఎప్పుడైనా ఏం చదవాలి, ఏదో ఒకటి చదవాలి అని కథా రచనల మీద ఆసక్తి కలిగినప్పుడు ఈ జమిలిపోగు పుస్తకాన్ని తప్పకుండా అందుకోండి. ఒక గొప్ప అనుభూతిని పొందుతారు.

Spread the love