Friday, May 15, 2026
E-PAPER
Homeజాతీయంయూపీలో ఈదురుగాలి బీభత్సం

యూపీలో ఈదురుగాలి బీభత్సం

- Advertisement -

ఒక్కరోజే 111 మంది మృతి
గాలిలో 300 మీటర్ల దూరం ఎగిరిపడిన వ్యక్తి…వీడియో వైరల్
దెబ్బతిన్న పలు ఇండ్లు, వాహనాలు

​లక్నో: యూపీలో మండు వేసవిలో తీవ్ర గాలి దుమారం, భారీ వర్షం పెనుబీభత్సం సృష్టించింది. ఈ క్రమంలోనే బరేలీ జిల్లాలో బలమైన ఈదురు గాలుల కారణంగా ఓ వ్యక్తి 300 మీటర్లు దూరం ఎగిరిపడ్డాడు. గాలిదుమారం రావడంతో ఆ వ్యక్తి ఓ షెడ్డును పట్టుకుని నిలబడ్డాడు. అయితే గాలి తీవ్రతకు షెడ్డుతో సహా 50 అడుగుల ఎత్తులోకి ఎగిరి పొలంలో పడ్డాడు. ఈ ప్రమాదంలో బాధితుడికి గాయాలు కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడిని బమియానా గ్రామానికి చెందిన నన్హే మియాన్‌‌గా గుర్తించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

‘‘గాలి చాలా బలంగా వీయడంతో రేకుల షెడ్డు పెద్ద శబ్దాలు చేయడం ప్రారంభించింది. నేను దానిని పట్టుకోకపోతే అది తుఫానుకు కొట్టుకుపోతుందని అనుకున్నాను. అందుకే వెంటనే షెడ్డుకు కట్టిన తాడును పట్టుకున్నాను. కానీ, అప్పుడు చాలా బలమైన గాలుల తాకిడికి షెడ్డుతో సహా నన్ను, మరో ఇద్దరినీ గాలిలోకి తీసుకెళ్లింది. ఆ తర్వాత గాలి తీవ్రత కాస్త తగ్గి కింద పడే ముందు నన్ను దాదాపు 50 అడుగుల ఎత్తుకు తీసుకువెళ్లింది’’ అని బాధితుడు నన్హె చెప్పాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటన వీడియోలోనూ ఆ వ్యక్తి రేకుల షెడ్డును పట్టుకుని గాలిలోకి ఎగిరిపోవడం కనిపిస్తుంది. మొదట్లో కొంతమంది నెటిజన్లు ఈ వీడియోపై అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి సృష్టించిందని అన్నారు.

​ఒక్క రోజులోనే 111 మంది మృతి
యూపీలోని పలు జిల్లాల్లో తలెత్తిన ప్రకృతి వైపరీత్యానికి బుధవారం ఒక్కరోజే 111 మంది మరణించారు. వందల మందికి గాయాలయ్యాయి. ప్రయాగ్‌రాజ్ జిల్లాలో అత్యధికంగా 21 మంది మృతి చెందారు. భదోహిలో 16 మంది మరణించారు. ఫతేపూర్, ప్రతాప్‌గఢ్, బదౌన్‌, కుశీనగర్‌, సోన్‌భద్ర ప్రాంతాల్లో మిగిలిన వారు బలయ్యారు. గాలివాన బీభత్సానికి ఆయా ప్రాంతాల్లో భారీ ఆస్తినష్టం సంభవించింది. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. పలు ఇండ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రకృత వైపరీత్యం సృష్టించిన విలయంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆరా తీశారు.

​పెనుగాలితో పాటు పిడుగులు
సాధారణంగా మే నెలలో ఉత్తర భారతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. చాలాచోట్ల సగటు ఉష్ణోగ్రత 40 డిగ్రీల పైనే ఉంటుంది. ఆ సమయంలో భూఉపరితలంపై ఉండే గాలి విపరీతంగా వేడెక్కుతుంది. అది వేగంగా కదులుతూ ఇతర దిశల నుంచి తడిగాలిని లాగేసుకుంటుంది. ఫలితంగా ఈ రెండు కలిసి ఆకాశంలో చాలా ఎత్తుకు చేరినప్పుడు క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. దట్టమైన నల్లటి మబ్బులు ఆకాశమంతా విస్తరిస్తాయి. ఆ తర్వాత తక్కువ సమయంలోనే భారీ వర్షం, వడగళ్లు, పిడుగులు బీభత్సం సృష్టిస్తాయి. తాజాగా యూపీలో కూడా ఇలాంటి పరిస్థితే ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -