అమెరికా రాయబారితో అమిత్ షా భేటీ
న్యూఢిల్లీ : భారత్, అమెరికా మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్‌తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం చర్చించారు. భద్రతా రంగం ముఖ్యంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడం, మాదకద్రవ్యాల రవాణాను అడ్డుకోవడం వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు అమిత్ షా చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఇరు దేశాల మధ్య సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం నిబద్ధతతో వుందని అమిత్ షా చెప్పారు. ఈ ద్వైపాక్షిక సంబంధాల నుండి ఇరు దేశాల ప్రజలు లబ్ది పొందాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. జి-7 దేశాల సదస్సు సందర్భంగా ట్రంప్‌తో ఇటీవల భేటీ అయిన మోడీ, భారత్ – అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పునరుద్ఘాటించారు. అమెరికాతో వాణిజ్య చర్చలను ముందుకు తీసుకెళ్ళేందుకు గానూ వచ్చే వారం అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమ్సన్ గ్రీర్ భారత్ రానున్నారు. అమెరికా రాయబారి గోర్ మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలో, మాదకద్రవ్యాల నుండి ప్రజలను కాపాడేందుకు పరస్పరం సహకరించుకోవాలని భావించినట్లు తెలిపారు. దేశాల సరిహద్దుల వద్ద భద్రతను పటిష్టపరచడం, ఇరు దేశాల్లో నేరస్తులను ఉమ్మడిగా చట్టం ముందు నిలబెట్టడం వంటి విషయాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
భారత్, అమెరికా మధ్య సహకారం బలోపేతం
- Advertisement -
- Advertisement -



