Wednesday, September 9, 2026
E-PAPER
Homeఖమ్మంకష్టపడి చదివి.. పీహెచ్‌డీ సాధించి

కష్టపడి చదివి.. పీహెచ్‌డీ సాధించి

- Advertisement -

పుట్టిన ఊరికి గుర్తింపు తెచ్చిన ఆడపడుచు
నవతెలంగాణ – అశ్వారావుపేట

స్వయంకృషి, పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించారు అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామానికి చెందిన కొనకళ్ల బాబురావు –  నాగమణి దంపతుల కుమార్తె డాక్టర్‌ కొనకళ్ల వరలక్ష్మి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకుని పుట్టిన ఊరికి గుర్తింపు తెచ్చారు.

చిన్ననాటి నుంచే చదువుపై ఆసక్తి పెంచుకున్న వరలక్ష్మి చదువుకుంటూనే తోటి పిల్లలకు ట్యూషన్లు చెప్పేవారు. వివాహం అనంతరం కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే భర్త శ్రీనివాస్‌ ప్రోత్సాహంతో ఉన్నత విద్యను కొనసాగించారు. రాత్రింబవళ్లు శ్రమించి తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు.

ఉస్మానియా యూనివర్సిటీ 85 వ స్నాతకోత్సవంలో ప్రొఫెసర్‌ ఉపేందర్‌రెడ్డి మార్గదర్శకత్వంలో ‘ఎ స్టడీ ఆన్ ఫిక్స్డ్ పాయింట్ రిజల్ట్స్ ఇన్ వేరియస్ మెట్రిక్ స్పేసెస్’ అనే అంశంపై చేసిన పరిశోధనకు పీహెచ్‌డీ పట్టా పొందారు. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, భారత్‌ బయోటెక్‌ ఫౌండర్‌ డాక్టర్‌ కృష్ణ ఎం.ఎల్లా, ఓయూ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కుమార్‌ మొలుగారం ల చేతుల మీదుగా డాక్టరేట్‌ అందుకున్నారు.

తిరుమలకుంట ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి వరకు, వైరా రెసిడెన్షియల్‌ పాఠశాలలో పదో తరగతి వరకు చదివారు. అశ్వారావుపేట వీకేడీవీఎస్‌ రాజు కళాశాలలో ఇంటర్‌, డిగ్రీ, అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో బీఈడీ, పీజీ పూర్తి చేశారు. తన ప్రతిభతో తొలుత టీజీటీగా, ఆ తర్వాత జూనియర్‌ లెక్చరర్‌గా, అనంతరం డిగ్రీ లెక్చరర్‌గా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ప్రస్తుతం వరంగల్‌లోని ఎంజేపీటీబీసీ డబ్ల్యూఆర్‌డీసీ మహిళా డిగ్రీ కళాశాలలో గణిత అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.

తన విజయానికి సహకరించిన తల్లిదండ్రులు, భర్త, కుటుంబ సభ్యులకు వరలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. ఆమె విజయం గ్రామీణ ప్రాంత విద్యార్థినులకు స్ఫూర్తిదాయకమని తిరుమలకుంట గ్రామస్థులు, అశ్వారావుపేట ప్రజలు అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -