సరిహద్దులు దాటుతున్న సబ్సిడీ విత్తనాలు…

– బ్లాకులో పచ్చి రొట్ట విత్తనాల అమ్మకాలు
– నలుగురు అధికారుల సస్పెన్షన్‌
నవతెలంగాణ తొర్రూరు
రైతులకు సబ్సిడీపై అందించాల్సిన విత్తనాలు రాష్ట్ర సరిహద్దులు దాటి పక్క రాష్ట్రాలకు చేరుతున్నాయి. ఆ రాష్ట్రంలో జీలుగు విత్తనాలపై సబ్సిడీ లేకపోవడం, అక్కడ ఈ విత్తనాల కొరత ఉండడం దళారులకు వరంగా మారింది. వారితో కొంతమంది అధికారులు కుమ్మక్కె సబ్సిడీ విత్తనాలను తరలిస్తున్న వైనం ఆలస్యంగా వెలుగుచూసింది. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలంలో జీలుగా విత్తనాల అక్రమ వ్యాపారం శుక్రవారం వెలుగు చూసింది. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు విచారణ జరిపి ఇందుకు బాధ్యులైన నలుగురు అధికారులను సస్పెండ్‌ చేశారు. అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలానికి 2024-25 సంవత్సరానికి గాను 500 క్వింటాల జీలుగు విత్తనాలు ప్రభుత్వం సరఫరా చేసింది. ఈ విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందజేయాల్సి ఉంది. కానీ కొంతమంది వ్యవసాయ అధికారులు దళారులతో చేతులు కలిపి సబ్సిడీ విత్తనాలను అసలు రేట్లకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తరలించారు. దీంతో ఈ ప్రాంత రైతులకు విత్తనాల కొరత ఏర్పడింది. విత్తనాల కోసం రైతులు ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రం, పిఎసిఎస్‌ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. జీలుగా విత్తనాలు 30 కేజీల సంచి అసలు ధర రూ.2790 ఉంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ రూ.1116కే రైతులకు అందజేస్తోంది. ఆంధ్రాలో ఈ విత్తనాలు అందుబా టులో లేకపోవడం, సబ్సిడీ లేకపోవడంతో సదరు అధికారులు దళారులతో కుమ్మక్కై ఇక్కడి రైతుల పేరా తప్పుడు రికార్డులు రాసి విత్తనాలను అమ్మినట్టు విచారణలో తేలింది. మండలంలోని పలు గ్రామాల రైతులకు తెలియకుండానే వారి పేరా జిలుగ విత్తనాలు పంపిణీ చేసినట్టు రికార్డులు సృష్టించారు. అలాగే గ్రానైట్‌ భూములు మామిడి తోటలకు సైతం జీలుగ విత్తనాలు ఇచ్చినట్టు రికార్డుల్లో నమోదు చేసినట్టు ఉంది. అన్ని గ్రామాలలో విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉందని సమాచారం.
నలుగురు అధికారుల సస్పెన్షన్‌
తొర్రూరు మండలంలో జీలుగు విత్తనాల అక్రమ రవాణాపై సంబంధిత శాఖ అధికారులు విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. ఈ సంఘటనతో సంబంధం ఉన్న తొర్రూరు మండల వ్యవసాయ అధికారి కెఎస్‌ కుమార్‌ యాదవ్‌, తొర్రూరు క్లస్టర్‌ ఏఈఓ ఎం.జమున, అమ్మాపురం క్లస్టర్‌ ఏఈఓ దీపిక, హరిపిరాల ఏఈవో సిహెచ్‌.అరవింద్‌లను సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
విజిలెన్స్‌ విచారణ జరిపించాలి…
తొర్రూరు మండలంలో వెలుగు చూసిన జీలుగ విత్తనాల అక్రమ వ్యాపారంపై సమగ్ర విజిలెన్స్‌ విచారణ జరిపించాలని మహబూబాబాద్‌ జిల్లా జెడ్పీ ఫ్లోర్‌ లీడర్‌, స్థానిక జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అధికారులు తూతూ మంత్రంగా విచారణ జరపటం సమంజసం కాదని, పూర్తిస్థాయిలో విజిలెన్స్‌ విచారణ జరిపితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. పిఎసిఎస్‌, వ్యవసాయ శాఖ, ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రం భాగస్వాములై ఈ దందా నడిపిస్తున్నారని ఆరోపించారు.

Spread the love