Tuesday, July 28, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఫ్లై ఓవర్ల కింద సబ్‌ ‌స్టేషన్లు

ఫ్లై ఓవర్ల కింద సబ్‌ ‌స్టేషన్లు

- Advertisement -

స్థలాభావాన్ని నివారించేందుకు ఎస్పీడీసీఎల్‌ ప్రణాళిక
మానవ రహిత నిర్వహణ, ఆర్టీయూ ఇంటిగ్రేషన్‌
పైలట్‌ ‌ప్రాజెక్ట్‌‌గా ముషీరాబాద్‌ ‌స్టీల్‌ ‌బ్రిడ్జ్‌
ఇండోర్‌ ‌సబ్‌‌స్టేషన్లు ‌ప్రమాదమంటున్న నిపుణులు
​నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

హైదరాబాద్‌ నగరంలో వేగంగా పెరుగుతున్న విద్యుత్ అవసరాలకనుగుణంగా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు, కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణానికి ఎదురవుతున్న స్థలాభావ సమస్యకు వినూత్న పరిష్కారం చూపే దిశగా టీజీఎస్పీడీసీఎల్ చర్యలు చేపట్టింది. నగరంలో సాంకేతికంగా అనువైన ఫ్లైఓవర్లు, స్టీల్ బ్రిడ్జిల కింద అందుబాటులో ఉన్న స్థలాలను వినియోగించి ఆధునిక కాంపాక్ట్ ఇండోర్ సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది.
విద్యుత్ వినియోగం నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో కొత్త సబ్‌స్టేషన్ల ఏర్పాటు అత్యవసరమవుతోంది. అయితే నగరంలోని కీలక ప్రాంతాల్లో అవసరమైన స్థలం అందుబాటులో లేకపోవడం, భూముల విలువ అధికంగా ఉండటం వంటి అంశాలు కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణంలో ప్రధాన సవాళ్లుగా మారాయి. ఈ నేపథ్యంలో కాంపాక్ట్‌ ఇండోర్‌ ‌సబ్‌‌స్టేషన్‌ విధానాన్ని అమలు చేసేందుకు ఎస్పీడీసీఎల్‌ ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. నిర్మాణ విధానం, నిర్వహణ, భద్రత, సాంకేతిక అనుకూలత తదితర అంశాలను అధ్యయనం చేసి‌న కమిటీ పలు సిఫారసులు చేసింది. నగరంలో సాంకేతికంగా అనుకూలమైన ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల కింద అందుబాటులో ఉన్న స్థలాలను ఇండోర్ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి వినియోగించవచ్చని ప్రతిపాదించింది.

పైలట్‌ ‌ప్రాజెక్టుగా ముషీరాబాద్‌ ‌స్టీల్‌ ‌బ్రిడ్జ్‌
పైలట్‌ ‌ప్రాజెక్టుగా ముషీరాబాద్‌లోని నాయని నర్సింహారెడ్డి ‌స్టీల్‌ ‌బ్రిడ్జ్‌ ‌కింద పిల్లర్ నం.63–64 మధ్య సబ్‌‌స్టేషన్‌ ఏర్పాటు చేయాలని ఎస్పీడీసీఎల్‌ ‌నిర్ణయించింది. 33/11 కేవీ ఇండోర్ సబ్‌స్టేషన్‌ను రెండు 8 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్లతో (2×8 ఎంవీఏ) ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. జవహర్‌నగర్, విద్యానగర్, బౌధ్‌నగర్–ఎల్‌ఎన్ నగర్, సిటీ సెంట్రల్ లైబ్రరీ తదితర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేస్తున్న ఫీడర్లలో అవసరమైన వాటిని బైఫర్‌‌గెట్‌ చేసి కొత్త సబ్‌స్టేషన్‌కు అనుసంధానించేలా ప్రతిపాదనలు రూపొందించారు. ప్రధాన విద్యుత్ సరఫరాను 132/33 కేవీ ఫీవర్ హాస్పిటల్ ఈహెచ్‌‌టీ సబ్‌స్టేషన్లో అందుబాటులో ఉన్న స్పేర్ బ్రేకర్ నుంచి 1.5 కిలోమీటర్లు, 33 కేవీ అండర్‌గ్రౌండ్ కేబుల్ ద్వారా తీసుకురావాలని ప్రతిపాదించారు. ప్రత్యామ్నాయ సరఫరాను చిలకలగూడ–నారాయణగూడ నుంచి 33/11 కేవీ ఇండస్ట్రియల్ ఏరియా సబ్‌స్టేషన్ ద్వారా అనుసంధానిస్తారు. దీనివల్ల ఒకవైపు సరఫరాలో సాంకేతిక సమస్య తలెత్తిన సందర్భంలో ప్రత్యామ్నాయ వ్యవస్థ ద్వారా విద్యుత్ సరఫరాను కొనసాగిస్తారు. ఈ మేరకు సోమవారం ఎస్పీడీసీఎల్‌ అధికారులు ముషీరాబాద్‌ ఇండోర్‌ ‌సబ్‌‌స్టేషన్‌ ‌ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు.

మానవ రహిత నిర్వహణ…
ఇండోర్ సబ్‌స్టేషన్‌ను భవిష్యత్ అవసరాలకనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మానవ రహిత సబ్‌స్టేషన్‌గా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఆర్‌‌టీయూ ఇంటిగ్రేషన్ ద్వారా సబ్‌స్టేషన్‌లోని కీలక విద్యుత్ వ్యవస్థలను రిమోట్‌గా పర్యవేక్షించేందుకు, అవసరమైన ఆపరేషన్లను నిర్వహించేందుకు అనువుగా స్విచ్‌గేర్ వ్యవస్థను రూపొందించాలని ప్రతిపాదించారు. 33/11 కేవీ ఇండోర్ స్విచ్‌గేర్, 2×8 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, 33 కేవీ–11 కేవీ ఎక్స్‌ఎల్‌పీఈ అండర్‌గ్రౌండ్ కేబుళ్లు, ఆర్‌ఎంయూలు, అవసరమైన రక్షణ, నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతిపాదిత ఇండోర్ సబ్‌స్టేషన్ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం అధిక లోడ్‌తో పనిచేస్తున్న ఐదు 33/11 కేవీ సబ్‌స్టేషన్లపై విద్యుత్ భారం తగ్గించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

​ప్రజా భద్రతకు ముప్పులేదు
ఎస్పీడీసీఎల్‌ ‌సీఎండీ జితేష్‌ ‌వి పాటిల్‌

హైదరాబాద్‌లో భూమి కొరత ఉన్న నేపథ్యంలో తక్కువ స్థలంలో ఇండోర్‌ ‌సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించాం. మొదటి దశలో ముషీరాబాద్ స్టీల్‌ ‌బ్రిడ్జ్‌ ‌కింద ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ప్రజా భద్రతకు ముప్పు లేకుండా సాంకేతిక ప్రమాణాలు, నిర్వహణ సౌలభ్యం, భవిష్యత్ లోడ్ అవసరాలకనుగుణంగా దీన్ని ఏర్పాటు చేస్తాం. సబ్‌స్టేషన్ నిర్మాణానికి ముందు ఎర్తింగ్, ప్రొటెక్షన్ సిస్టమ్ పరీక్షలు పూర్తి చేసిన తర్వాతే నిర్మాణ పనులు చేపడతాం. సబ్‌స్టేషన్ కార్యకలాపాల వల్ల స్థానిక నివాసితులు, పాదచారులు, వాహనదారులు, రవాణా వ్యవస్థకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం.ఈ విధానం విజయవంతమైతే స్థలాభావం ఉన్న ఇతర ప్రాంతాల్లోనూ సాంకేతిక సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఇటువంటి సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు చేస్తాం.

​ఇండోర్‌ ‌సబ్‌‌స్టేషన్లతో ప్రమాదం?
ఇండోర్‌ ‌సబ్‌‌స్టేషన్లు ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 1990వ దశకంలో దేశాన్ని కుదిపేసిన డిల్లీలోని శాలిమార్ సినిమా టాకీస్‌ ‌ఘటనను ఉటంకిస్తున్నారు. అండర్‌ ‌గ్రౌండ్‌‌లో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ పేలి దాదాపు 20మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఓపెన్ ఏరియాలోనే ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేయాలని విద్యుత్‌ ‌శాఖ నిర్ణయించింది. తాజాగా ఎస్పీడీసీఎల్ తీసుకున్న నిర్ణయం అనేక భద్రాతాంశాలను లేవనెత్తుతోంది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో విద్యుత్ పరికరాలు, ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేయడం చాలా ప్రమాదకరం. ఒక్క దగ్గర షాక్ కొడితే, బ్రిడ్జి మొత్తం కరెంట్ షాక్ వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -