– ఓటములు ఎదురైనా ఫ్యాన్స్ అపూర్వ మద్దతు
– ప్రతి మ్యాచ్‌కు నిండుకుండలా ఉప్పల్ స్టేడియం
– 30 వేల టికెట్లకు లక్ష మందికి పైగా పోటీ
ఐపీఎల్‌లో అభిమానుల ఫాలోయింగ్ అనగానే చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ గుర్తొస్తాయి. ఐదుసార్లు టైటిల్ సాధించటంతో పాటు ఆ జట్లకు భారత సూపర్‌స్టార్స్ ప్రాతినిథ్యం వహించటం అందుకు కారణం. టైటిల్ లేకపోయినా విరాట్ కోహ్లి మేనియాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ సైతం దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. తొలి నుంచి చెప్పుకోదగిన భారత క్రికెట్ స్టార్ లేని సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువే. కానీ 2024 ఐపీఎల్ నుంచి సమీకరణాలు మారాయి. టీ20 ఫార్మాట్‌లో నయా విధ్వంసం సృష్టిస్తూ, పరుగుల వరదలో కొత్త పుంతలు తొక్కుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ సైతం విశేష అభిమాన ఆదరణ పొందుతుంది. ఇటీవల ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచులకు స్టేడియం నిండుకుండలా కనిపించటం ఇందుకు ఓ నిదర్శనం!.
నవతెలంగాణ క్రీడావిభాగం
టీ20 క్రికెట్‌లో బ్యాటింగ్‌కు సరికొత్త ప్రమాణాలు నెలకొల్పింది సన్‌రైజర్స్ హైదరాబాద్. 2016లో సన్‌రైజర్స్ ఐపీఎల్ విజేతగా నిలిచినా.. అభిమానుల ఫాలోయింగ్‌లో ఆరెంజ్ ఆర్మీ ఎప్పుడూ వెనుకంజలోనే నిలిచింది!. కానీ 2024 ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను అమాంతం పెంచేసింది. విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టించిన సన్‌రైజర్స్ తాజా సీజన్‌లో వరుసగా 4 ఓటములు చవిచూసినా.. అభిమానుల నుంచి అపూర్వ మద్దతు అందుకుంది. సొంత గడ్డ ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్18లో ఇప్పటికే నాలుగు మ్యాచులు ఆడేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానుల నుంచి విశేష స్పందన చవిచూసింది. రాజస్థాన్ రాయల్స్‌తో తొలి మ్యాచ్ నుంచి ఇటీవల పంజాబ్ కింగ్స్‌తో పోరు వరకు స్టేడియంకు వచ్చే అభిమానుల సంఖ్య గణనీయంగా పెరుగుతూనే వచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచిన సీజన్‌లో సైతం అభిమానులు ఇటువంటి ఆదరణ చూపించకపోవటం గమనార్హం.
నిండుకుండలా ఉప్పల్ స్టేడియం
ఐపీఎల్ మ్యాచులకు ఉప్పల్ స్టేడియం నిండుకుండను తలపిస్తోంది. ప్రతి మ్యాచ్‌కు స్టేడియం పూర్తి సామర్థ్యంతో కళకళ లాడుతోంది. సహజంగా గతంలో జరిగిన ఐపీఎల్ మధ్యాహ్నం మ్యాచులకు అభిమానుల నుంచి పెద్దగా స్పందన ఉండదు. స్టేడియంలో 20 వేల మంది అభిమానులు ఉంటే అదే గొప్ప. మార్చి 23న రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌కు 32,611 మంది అభిమానులు స్టేడియానికి వచ్చారు. మధ్యాహ్నం మ్యాచ్‌కు ఇదో రికార్డు అని చెప్పవచ్చు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు 35,525 మంది, గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌కు 36036 మంది, ఇటీవల పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు 36222 మంది హాజరయ్యారు.
ఓడినా.. అదే క్రేజ్
రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ ఘన విజయం సాధించింది. కానీ ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో తేలిపోయింది. లక్నో సూపర్‌జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కత నైట్‌రైడర్స్, గుజరాత్ టైటాన్స్ చేతిలో దారుణ ఓటములు చవిచూసింది. అయినా, తర్వాతి మ్యాచ్‌లకు సన్‌రైజర్స్ క్రేజ్‌లో ఎటువంటి మార్పు లేదు. ఇంకా చెప్పాలంటే, పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కే అత్యధికంగా 36222 మంది అభిమానులు స్టేడియానికి తరలి వచ్చారు.
లక్ష మందికి పైనే వెయిటింగ్!
సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ మ్యాచ్ ఈ నెల 23న జరుగనుంది. ఐపీఎల్18లో ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనున్న ఐదో మ్యాచ్ ఇది. సన్‌రైజర్స్ ధనాధన్ హిట్టింగ్ మేనియాకు ముంబయి ఇండియన్స్‌లో భారత క్రికెటర్ల స్టార్‌డమ్ తోడైంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జశ్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, తిలక్ వర్మ వంటి స్టార్ క్రికెటర్లు హైదరాబాద్‌కు రానున్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో టికెట్ కోసం అభిమానులు ఎగబడుతున్నారు. ఆన్‌లైన్‌లో ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్ టికెట్లను విడుదల చేయగా.. ఏకంగా లక్ష మందికి పైనే వెయిటింగ్‌లో ఉండటం గమనార్హం. ఆ టికెట్లు సైతం గంటల వ్యవధిలోనే అమ్ముడుపోయాయి. కార్పోరేట్ బాక్స్ టికెట్లు సైతం స్వల్ప సమయంలోనే హాట్ కేక్‌ల తరహాలో అమ్ముడయ్యాయి. ఉప్పల్ స్టేడియం సామర్థ్యం 39000 కాగా.. హెచ్‌సీఏ పది శాతం పాస్‌లు సహా ఐపీఎల్, సన్‌రైజర్స్ తమ స్పాన్సర్ల కోసం కొన్ని టికెట్లను అట్టిపెట్టుకుంటాయి. దీంతో ఓ 30,000 టికెట్లు మాత్రమే ప్రతి మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. అంటే, 30 వేల టికెట్ల కోసం లక్ష మందికి పైగా పోటీపడటం క్రికెట్, మార్కెట్ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది.