Friday, August 21, 2026
E-PAPER
Homeజాతీయంఢిల్లీలో విద్యార్థులపై దాడి విచారణకు సుప్రీం కమిటీ

ఢిల్లీలో విద్యార్థులపై దాడి విచారణకు సుప్రీం కమిటీ

- Advertisement -

ఐదుగురు సభ్యులతో స్వతంత్ర బృందం ఏర్పాటు
​నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీలోని సీజేపీ ఆధ్వర్యంలో గత నెల 20న జరిగిన పార్లమెంట్ మార్చ్ లో విద్యార్థులపై పోలీసులు, భద్రతా దళాలు జరిపిన దమన కాండపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై విచారించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాశ్‌ రెడ్డి అధ్యక్షత వహించగా, పంజాబ్-హర్యానా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవి శంకర్ ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షాలిందర్ కౌర్, సీబీఐ మాజీ డైరెక్టర్ రిషి కుమార్ శుక్లా, మేఘాలయ రిటైర్డ్ డీజీపీ ఎల్ఆర్‌ బిష్ణోయ్‌ సభ్యులుగా ఉంటారు. విద్యార్థుల నిరసన సందర్భంగా వారిపై జరిగిన లాఠీఛార్జి, ఎలక్ట్రిక్ బ్యాటన్ల ప్రయోగం, పెల్లెట్ల వినియోగం, టియర్ గ్యాస్ ప్రయోగం వంటి అంశాలపై ఈ కమిటీ విచారణ జరుపుతుంది. సరైన హెచ్చరికలు లేకుండానే విద్యార్థులపై వీటిని ప్రయోగించినట్టు ఆరోపణలున్నాయి. ఇదే సమయంలో నిఘా పేరుతో విద్యార్థుల గోప్యతకు భంగం కలిగిందా లేదా అనే విషయాన్ని కూడా కమిటీ పరిశీలిస్తుంది.

అలాగే, నిరసన సందర్భంగా జరిగిన హింస, దాడులు, వేధింపులు, లైంగికపరమైన దాడులపై కూడా కమిటీ విచారణ జరుపుతుంది. గాయపడిన వారికి సరైన వైద్యం అందించారా? ఆర్థిక సాయం ఏమైనా చేశారా? అనే అంశాలపై కూడా ఆరా తీస్తుంది. అదే సమయంలో పోలీసులు, ఇతర భద్రతా బలగాలపైకి నిరసనకారులు, అసాంఘిక శక్తులు జరిపిన దాడి అంశంపై కూడా కమిటీ విచారణ జరుపుతుంది. నిరసన సందర్భంగా జరిగిన హింస, ఘర్షణలో జరిగిన పబ్లిక్, ప్రయివేటు ఆస్తుల వివరాల సేకరణ, దాడుల్లో గాయపడ్డ భద్రతా సిబ్బందికి అందిన సాయంతోపాటు మహిళలపై జరిగిన దాడులు, లైంగిక దాడులపై కూడా విచారణ జరుపుతుంది. ఈ విచారణకు అవసరమైన సీసీటీవీ కెమెరా వీడియోల్ని కమిటీకి అందించాలని సుప్రీంకోర్టు… అధికారుల్ని ఆదేశించింది. బాధితుల నుంచి ఫిర్యాదుల్ని కూడా కమిటీ స్వీకరిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -