మైక్రాన్ ప్లాంట్‌కు ప్రభుత్వం అనుమతి
గాంధీనగర్ : కార్పొరేట్లు, పారిశ్రామికవేత్తల కోసం ప్రవేశపెట్టిన నూతన లేబర్ కోడ్‌లలో అత్యంత కీలకమైన 12 గంటల పని విధానాన్ని గుజరాత్ సర్కార్ తొలిసారిగా అమల్లోకి తెచ్చింది. సెమీకండక్టర్ తయారీ రంగంలో నిరంతర కార్యకలాపాల పేరుతో సానంద్‌లోని మైక్రాన్ సెమీకండక్టర్ టెక్నాలజీ ఇండియా ప్రయివేటు లిమిటెడ్ ప్లాంట్‌లో రోజుకు 12 గంటల పని షిఫ్టులకు ప్రభుత్వం అధికారికంగా అనుమతినిచ్చింది. గుజరాత్‌లో ఈ తరహా విధానం అమలు కావడం ఇదే మొదటిసారని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. కాగా.. ఇది కార్మికులపై అధిక పని భారాన్ని మోపే ప్రమాదం ఉందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం వారానికి గరిష్టంగా 48 గంటల పనివేళల పరిమితిని అలాగే ఉంచినట్టు ప్రభుత్వం పేర్కొంది. అయితే.. ఈ సుదీర్ఘ షిఫ్టుల్లో పనిచేయడానికి ఉద్యోగులు స్వచ్ఛందంగా రాతపూర్వక అంగీకారం తెలపాలని ప్రభుత్వం నిబంధన విధించినా, యాజమాన్యాల ఒత్తిడి నేపథ్యంలో ఇది ఎంతవరకు స్వచ్ఛంద
నిర్ణయంగా ఉంటుందన్నది ప్రశ్నార్థకం.
అయితే 12 గంటల సుదీర్ఘ షిఫ్టుల్లో పనిచేయడం వల్ల కార్మికులపై శారీరక, మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. సెమీకండక్టర్ల తయారీలో నిరంతర యంత్రాల నిర్వహణ అత్యంత కీలకం కాబట్టి 12 గంటల షిఫ్టుల వల్ల షిఫ్ట్ మార్పులు తగ్గి యంత్రాల వినియోగం పెరుగుతుందని ప్రభుత్వం సమర్థించుకుంటోంది. ఈ విధానం వల్ల వారంలో మిగిలిన రోజులను పెయిడ్ లీవ్‌లుగా వాడుకునే వెసులుబాటు ఉంటుందని చెబుతున్నప్పటికీ రోజుకు 12 గంటల పాటు నిరంతరం అత్యంత క్లిష్టమైన వాతావరణంలో పనిచేయడం కార్మికుల ఆరోగ్య భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిశ్రమల వృద్ధి, సులభతర వ్యాపార నిర్వహణ పేరిట తీసుకుంటున్న ఇటువంటి నిర్ణయాలు, కార్మికుల సంక్షేమానికి, వారి పని పరిస్థితులకు మధ్య సమతుల్యతను దెబ్బతీస్తాయనే ఆందోళనలు ఉన్నాయి. నూతన లేబర్ కోడ్స్ తో పరిశ్రమల ఏర్పాటు, మూసివేతను సులభతరం చేయడం పేరుతో యాజమాన్యాలకు విపరీతమైన వెసులుబాట్లు కల్పించారని, దీనివల్ల కార్మికులు తమ ఉద్యోగ భద్రతను కోల్పోయే ప్రమాదమున్న విషయం తెలిసిందే.
గుజరాత్‌లో 12 గంటల పని అమలు
- Advertisement -
- Advertisement -



