నవతెలంగాణ – దుబ్బాక
ఈనెల 6 నుంచి నిర్వహించనున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పొరపాట్లకు తావివ్వకుండా పక్కాగా నిర్వహించాలని.. ఎన్యుమరేటర్లు పూర్తి వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని మండల తహసీల్దార్ ఈ.సంజీవ్ కుమార్ అన్నారు. ప్రజల సామాజిక,ఆర్థిక,విద్య,రాజకీయ,కుల వివరాలను క్షుణ్ణంగా సేకరించడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశం అని స్పష్టం చేశారు.సోమవారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ఐఓసీ భవనంలో కుటుంబ సర్వే నిర్వహించే ఎన్యుమరేటర్లకు ప్రధాన ఉపాధ్యాయుడు ఎండీ.సాదత్ అలీ చే శిక్షణ కల్పించారు.పలు అంశాల పై ఎన్యుమరేటర్లు అడిగిన ప్రశ్నలు,సందేహాలను నివృత్తి చేశారు.ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ,ఈ సర్వేలో మొదటి మూడ్రోజులైన 6 ,7 ,8 తేదీలే కీలకమన్నారు.మున్సిపల్ పరిధిలో -55 మంది,మండల వ్యాప్తంగా -79 మంది ఎన్యూమరేటర్లను నియమించడం జరిగిందన్నారు.ఇచ్చిన లిస్ట్ ప్రకారం సర్వే చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కళ్యాణం రమేష్ కుమార్,ఎంఈఓ జోగు ప్రభుదాస్,ఎంపీఓ నరేందర్ రెడ్డి,ఐసీడీఎస్ సీడీపీఓ ఎల్లయ్య,సూపర్వైజర్లు చంద్రకళ,ఆర్ఐలు నరసింహారెడ్డి,నరేందర్,పలు ప్రభుత్వ శాఖల సిబ్బంది,ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు.