నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవలే జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, విజయ్ నేతృత్వంలోని టీవీకే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజార్టీ మార్కును అందుకోలేకపోయింది. దీంతో కాంగ్రెస్, ఐయూఎంఎల్, వీసీకే, లెఫ్ట్ పార్టీల మద్దతుతో టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే మే 13 నాటి విశ్వాస పరీక్ష సమయంలో ఏఐఏడీఎంకే సీనియర్ నేతలు షణ్ముగం, ఎస్.పి. వేలుమణి నేతృత్వంలోని ఒక పెద్ద తిరుగుబాటు వర్గం విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసింది. దీంతో అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వ బలం 119 నుంచి ఒక్కసారిగా 144 కి చేరి, ఆయనకు తిరుగులేని మెజార్టీ లభించింది.
తాజాగా 21 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఈపీఎస్ క్యాంప్ దాఖలు చేసిన పిటిషన్‌ను తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జె.సి.డి. ప్రభాకర్ మంగళవారం తిరస్కరించారు. మే 13న అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్ష సందర్భంగా పార్టీ ఆదేశాలను ధిక్కరించి విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసిన ఈ ఎమ్మెల్యేలకు స్పీకర్ నిర్ణయంతో పెద్ద ఉపశమనం లభించింది.



