దీనావస్థలో తెలుగు భాష

Telugu language in declineఆగస్టు 29 మన మాతృభాషాదినోత్సవం. కాళ్లమీద పడ్డా సరే కడుపు చించుకోవాలనిపించే దినం. మాతృభాషను ఖూనీ చేసేవాళ్లు కళ్లు తెరవాల్సిన దినం. ఇదంతా చెవిటివానిముందు శంఖం ఊదినట్టు ఔతుందేమోననే భయం వెన్నాడినా వెరవకూడని సందర్భం!

తెలుగు భాష రోజురోజుకు ఎంతగా భ్రష్టుపట్టిపోతోంది! యాభై అరవయ్యేళ్ల క్రితం కొందరే రచనలు చేసేవారు. వారి రచనలలో భాష నిర్దిష్టంగా ఉండేది. నిజానికి, రచనలు చేయనివారిలో సైతం చాలా మందికి కొంత భాషాజ్ఞానం ఉండేది. ఇప్పుడు పరిస్థితి విరుద్ధంగా ఉందనే వాస్తవాన్ని కాదనగలమా? సరైన భాషను రాస నైపుణ్యాన్ని సొంతం చేసుకునేందుకు అంకితభావంతో కృషి చేయాలనే సంకల్పం, శ్రద్ధ, ఓపిక లేకపోవడం ఈ దయనీయ పరిస్థితికి ప్రధాన కారణం. అసలు, భాష సరిగ్గా ఉండవలసిన అవసరమే లేదని వాదించేవాళ్లూ ఉన్నారు. సరైన భాష అవసరాన్ని తెలిపేవాళ్లను వీళ్లు దబాయిస్తారు, ధిక్కరిస్తారు! కవులకు, రచయితలకు నిఘంటువులు అవసరం లేదు అనే మరో విడ్డూరమైన వాదం ప్రబలివుంది. పండితభాషలో రాసే అవసరం లేకపోయినా పదస్వరూపాల కచ్చితత్వాన్ని నిర్ధారించుకునేందుకు (ఆ పదాలు సరళమైనవే కావచ్చు) నిఘంటువులు ఉండొద్దా?
రచనలలో భాష బాగుండటం మాత్రమే ముఖ్యమని ఎవరూ అనరు, అనకూడదు కూడా. ఉదాహరణకు, కవిత్వం రాస్తే అందులో భావుకత, రసం, మనసును ఆకట్టుకునే గుణం, కదిలించే శక్తి… మొదలైన వాటికి ఎక్కువ ప్రాధాన్యమివ్వడం సబబే. అంత మాత్రాన భాష ఎలా ఉన్నా ఫరవాలేదనడం ఎంతవరకు సమంజసం? అర్థమైతే చాలు అనే అభిప్రాయమైతే మరీ దారుణం. ఇటువంటి అభిప్రాయాలకు లెజిటిమెసీ (న్యాయబద్ధత) లభిస్తే అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే, రచనలు చేసేవాళ్ల దృష్టిలో భాష అప్పుడు పూర్తిగా అప్రధానమైపోతుంది. మరికొందరిలో భాష సరిగ్గా రాకపోవడంకంటె నిర్లక్ష్యం, తొందర ఎక్కువగా ఉంటాయి. అందుకే భాషాదోషాలను చెక్‌ చేసుకోకుండా ఆదరాబాదరాగా రాసిపడేస్తారు. రాసినదాన్ని ప్రచురణకు పంపేముందు ఒకటికి పదిసార్లు సరిచూసుకోవడం చాలా అవసరం. నిజానికి, అచ్చైన తర్వాత కూడా చూసుకోవాలి (పుస్తకంగా తెచ్చేముందు). కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఐతే ఒక్క చుక్క/ బిందువు (full stop) కూడా లేకుండా వరుసగా నాలుగైదు వాక్యాలు కనిపిస్తున్న సందర్భాలు అనేకం! భాషకు విరామ చిహ్నాలతో సంబంధం లేదనుకోవడం సరైనది కాదు. ఈ విషయం గురించి కూడా కొందరు వెటకారంతో వ్యాఖ్యానించడం దురదృష్టకరం. కవిత్వంలో ఆధునికత ప్రవేశించడం మంచిదే కానీ, ఆధునిక కవిత్వంలో భాషానిర్దుష్టతకు విలువ లేకపోడం బాధను కలిగించే విషయం. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, మన మాతృభాషలో సవ్యత ఉండాలని మొత్తుకుంటున్నాం, ఇంగ్లీషులాంటి పరభాషలో కాదు!
ఎలాంటి వడపోత లేకుండా నేరుగా ప్రచురణకు ఆస్కారమిచ్చే సామాజిక మాధ్యమాలు ఈ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. ఐతే, వీటిలో కొన్ని అద్భుతమైన రచనలు చోటు చేసుకుంటున్నాయి. కానీ, వాటిలో కూడా భాషాదోషాలు కనిపించడం దురదృష్టం.
పెద్దపెద్ద తప్పులను వదిలిపెట్టి, కనీసం ప్రాథమిక భాషాదోషాలు లేకుండా రాసినా అది కొంతవరకు ఊరటనిస్తుంది కదా! ఉదాహరణకు ఊహాశక్తి, ప్రశ్నాపత్రం, దారాసుతులు మొదలైన పదబంధాలను అలా కాక నిర్దుష్టంగా రాయగలిగేది పండితులు, భాషావేత్తలు (linguists) మాత్రమే. అందరిలో ఇంత కచ్చితత్వాన్ని ఆశించడం లేదు. ఒక కవితా సంపుటిలో పదిచోట్ల శబ్దంకు బదులు శబ్ధం అనే పదం కనిపించిందంటే, అది అచ్చుతప్పు కాదని వెంటనే చెప్పవచ్చు. ఇటువంటి ప్రాథమిక భాషాదోషాలు ఎక్కువగా చోటు చేసుకున్నప్పుడు, కవిత్వస్పర్శ గాఢంగా ఉన్నా దాన్ని మంచి కవిత్వంగా అంగీకరించలేం. ఏ రచనకైనా భాష పునాదిలాంటిది. బలహీనమైన పునాదుల మీద కట్టిన భవనాలు పైకి అందంగా కనిపించినా వాటిలో దఢత్వం తక్కువ కనుక, అవి ఎక్కువ కాలం నిలువలేవు. అందుకే, ఎవరి రచనలకు వాళ్లు నిష్కర్ష గల ‘అక్షర పరీక్షకులు’గా మారాలి. మారకపోవడమే కాకుండా అలా మారినవాళ్లను గేలి చేసే సంప్రదాయమొకటి మొదలైంది. ఇదిగో, ఇటువంటి వ్యక్తుల మూలంగానే తెలుగు భాష ఈనాడు ఇంత ఘోరమైన స్థితిలో ఉంది. మళ్లీ వీళ్లే తెలుగు భాష ఘోరంగా భ్రష్టుపట్టిపోతోంది అని వ్యాఖ్యానిస్తారు, అవకాశం వచ్చినప్పుడు!
ప్రతి అక్షరాన్ని కరెక్ట్‌గా రాయాలనే స్పృ‌హ, తపన, సంకల్పం లేనివాడు, అలా రాసేందుకు ప్రయత్నించనివాడు ఉత్తమ సాహితీవేత్త కాలేడు. లోపాలతో కూడుకున్న భాష (defective language) వలన ఏర్పడే వైకల్యం (handicap) రచయితలు ఉన్నతస్థాయి పురస్కారాలను పొందటానికి అవరోధంగా మారే అవకాశముంది.
సలు, తెలుగును బోధించేవారికే తెలుగు సరిగ్గా రాని దీనమైన స్థితిలో ఉన్నాం. దీనికి గల కారణాలలో విశ్వవిద్యాలయాల అలసత్వాన్ని ముందుగా చెప్పుకోవాలి. ఇక్కడ పట్టా పొంది బయటికి వచ్చినవాళ్లు స్కూళ్లలో, కాలేజీలలో పిల్లలకు పాఠాలు చెబుతారు. కాబట్టి విశ్వవిద్యాలయాలలో బోధనా ప్రమాణాలు, పరీక్షా ప్రమాణాలు ఉన్నతస్థాయిలో ఉండాలి. నిజానికి, ఇక్కడ పరీక్షలు రాసేవాళ్లకు స్కూలుస్థాయిలోనే సరిపడా భాషాజ్ఞానం అందాలి. కానీ అందడం లేదు. అంటే పిచ్చి కుదిరితేనే పెళ్లవుతుంది, పెళ్లైతేనే పిచ్చి కుదురుతుంది అనే విషమ పరిస్థితి అన్నమాట!
ఈ పరిస్థితిని చక్కదిద్దడంలో పత్రికలకు ఉన్న బాధ్యత అంతా ఇంతా కాదు. పత్రికలు ఎంత శక్తిమంతమైనవంటే, అవి ఏ పదస్వరూపాలనైతే మళ్లీ మళ్లీ వాడుతాయో వాటిని పాఠకులు స్వీకరిస్తారు, అవి దోషాలతో కూడుకున్నవైనా! అంతే కాదు, కొన్ని దశాబ్దాల పాటు ప్రజల నాలుకలమీద నాట్యమాడింతర్వాత అవి ఒకవిధంగా ఒప్పులుగా మారిపోతాయి! అలా మారడంలో అన్యాయం ఏమీ లేదు కానీ, అవి అట్లా తప్పుగా స్థిరపడిపోకుండా ముందుగానే జాగ్రత్త వహించలేమా?
ప్రస్తుత దీన పరిస్థితికి కారణం ఒక్కరు కాదు, ఎందరో. అందరూ ఆత్మవిమర్శ చేసుకుని బాధ్యతతో ప్రవర్తిస్తే, తెలుగు భాష తీరులో మెరుగుదల కనిపించవచ్చు. అటువంటి మంచి సమయం తొందరగా రావాలి.
మాతృభాషా దినోత్సవం ఆగస్టు 29 సందర్భంగా…

– ఎలనాగ

Spread the love