– జర్మనీ నుంచి కార్ల దిగుమతి భారత్‌లో విక్రయాలపైనే దృష్టి
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకొంటున్న మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి టెస్లా తూట్లు పెడుతోంది. ఆ కంపెనీ జపాన్‌లో తయారు చేసిన కార్లను రెడీమేడ్‌గా తెచ్చి భారత్‌లో విక్రయించడానికి ప్రణాళికలు సిద్దం చేసుకుందని రిపోర్టులు రావడమే ఇందుకు నిదర్శనం. ప్రపంచంలోని వివిధ దేశాల్లో కార్లు తయారు చేస్తున్న టెస్లా కంపెనీ ఇప్పట్లో భారత్‌లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్లు సమాచారం. దిగుమతి చేసిన కార్లనే ఇక్కడ విక్రయించాలని భావిస్తోంది. జర్మనీ రాజధాని బెర్లిన్‌లోని తమ అతిపెద్ద గిగా ఫ్యాక్టరీలో తయారయిన కార్లను భారత్‌కు ఎగుమతి చేయాలని యోచన. భారత ప్రభుత్వ కొత్త ఈవీ పాలసీ ప్రకారం విద్యుత్ కార్ల దిగుమతికి సంబంధించి రూ.4,150 కోట్ల పెట్టుబడులకు హామీ ఇస్తే 15 శాతం సుంకం మాత్రమే విధించనుంది. దీంతో ప్రతీ ఏడాది 8,000 వాహనాలను దిగుమతి చేసుకోవడానికి వీలుంది. దేశీయంగా తయారీలో స్థానికంగా ముడిసరకు సమకూర్చుకోవాలన్న నిబంధన కూడా ఉంది. కాగా.. బెర్లిన్‌లో టెస్లా వై మోడళ్లు తయారవుతున్నాయి. వీటిని తొలుత భారత్‌కు ఎగుమతి చేయాలని యోచిస్తోంది. టెస్లా ప్లాంట్‌ను ఎలాగైన తాము దక్కించుకోవాలని గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోటాపోటీగా ఉన్నాయి.
భారత్‌లో తయారీ ప్లాంట్ నెలకొల్పాలని టెస్లాకు ఓ దశలో యోచన ఉన్నప్పటికీ.. దానికి ట్రంప్ మోకాలడ్డు వేశారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుబట్టారు. ప్రపంచంలోని ప్రతీ దేశం తమను వాడుకోవాలని ప్రయత్నిస్తోందని ఎలన్‌మస్క్‌తో కలిసి పాల్గొన్న ఓ కార్యక్రమంలోనే ట్రంప్ వ్యాఖ్యానించారు. సుంకాలతో లబ్ధి పొందాలని చూస్తున్నాయని పేర్కొన్నారు. మస్క్ భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి సిద్దం అవుతున్నారని.. ఇది ఆయనకు మంచిదే కావచ్చూ కానీ.. అమెరికా పరంగా చూస్తే చాలా అన్యాయమేనని ట్రంప్ అనడం గమనార్హం. ఎలన్ మస్క్ ముందే ఈ వ్యాఖ్యలు చేయడంతో టెస్లా తయారీ యూనిట్‌ను భారత్‌లో నెలకొల్పడంపై నీలినీడలు కమ్ముకున్నాయని నిపుణులు భావిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయి నగరాల్లో రెండు షోరూమ్‌లు ఏర్పాటు చేసేందుకు టెస్లా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందుకోసం నియామకాల కోసం ప్రకటనలు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే.