యుద్ధప్రాతిపదికన
విద్యుత్ స్థంభాల పునరుద్ధరణ
24 గంటలూ క్షేత్రస్థాయిలోనే అధికారులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని అన్ని ఆపరేషన్ కేంద్రాల్లో విద్యుత్ వ్యవస్థల బలోపేతానికి సంస్థ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో కూడా వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించేందుకు ముందస్తు సన్నద్ధత చర్యలను వేగవంతం చేసింది. శిథిలావస్థకు చేరుకున్న విద్యుత్ స్థంభాల పునరుద్ధరణ పనులను వేగవంతం చేస్తున్నారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్త విద్యుత్ స్థంభాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. మాన్సూన్ నేపథ్యంలో విద్యుత్ స్థంభాలు, విద్యుత్ లైన్ల నిర్వహణపై ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. కొత్త విద్యుత్ స్థంభాల ఏర్పాటుతో పాటు లూజ్ లైన్ల సవరణ, వంగిపోయిన, దెబ్బతిన్న విద్యుత్ స్థంభాల మరమ్మతులు, పునరుద్ధరణ పనులను చేపడుతున్నారు. విద్యుత్ అంతరాయాలు, అత్యవసర పరిస్థితులను త్వరితగతిన పరిష్కరించేందుకు 189 ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం వాహనాలను సిద్ధంగా ఉంచారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఫ్యూజ్ ఆఫ్ కాల్ సేవల కోసం 213 ప్రత్యేక బృందాలను నియమించారు.
వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం 1912 టోల్-ఫ్రీ విద్యుత్ హెల్ప్‌లైన్‌ను 24 గంటలూ అందుబాటులో ఉంచారు. ఈ కాల్ సెంటర్ ద్వారా ఒకేసారి “400” కాల్స్ స్వీకరించే సౌకర్యం కల్పించారు. టీజీఎస్పీడీసీఎల్ సిటిజన్ షిప్ యాప్, వాట్సాప్ నెంబర్ 87124 41912 ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఈ సేవలన్నీ 24×7 పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. ప్రకృతి వైపరిత్యాలు, భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ తీగలు లేదా కేబుల్ వైర్లు తెగిపడినప్పుడు ప్రజలు వాటిని తాకరాదనీ, వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు లేదా 1912 హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని సంస్త విజ్ఞప్తి చేసింది. నగరవ్యాప్తంగా ప్రజలకు ముందస్తు అవగాహన కల్పిస్తూ, భద్రత, నిరంతరాయ విద్యుత్ సరఫరా లక్ష్యంగా ప్రత్యేక ట్రీ ట్రిమ్మింగ్ (చెట్ల కొమ్మల తొలగింపు) డ్రైవ్‌ను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్నారు. విద్యుత్ లైన్లకు సమీపంలో ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు కార్యక్రమం చేపట్టే ముందు స్థానిక విద్యుత్ అధికారులు సంబంధిత ప్రాంతాల ప్రజలకు ముందస్తు సమాచారం అందిస్తూ, తీసుకోవల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు.



