కాలం మారడం అంటే
క్యాలెండర్ మారడం కానే కాదు
కందాయఫలాల ఆకాశంలో
తేలని గ్రహాలకు రెక్కలు కుడుతూ
పంచాంగపుటలు తిప్పడం కాదు
కాలం మారడం అంటే
గుణాత్మకతను గుర్తించడం
గత ఏడాది చదివిన పద్యాన్నే
పదాలు అటు ఇటుగా మార్చి ఎమార్చి
సానుకూల కవిసమ్మేళనంలో
సాగదీత కావ్యగానం చేయడం కాదు
కాలం మారడం అంటే
పరిణాత్మకత పరిమళించడం
కొత్తగా పూసిన
పాత మామిడిచెట్టు మీద కోకిల
తీసిన రాగాన్నే మళ్ళీ మళ్ళీ
శతి మార్చి కూయడం కాదు
చికాకుల చిరవిషాదం పలికే
కాకులనోళ్ళు మూయడం కాదు
కాలం మారడం అంటే
రాలే ముందు ఎండుటాకులు ఆలపించిన
చివురుల శ్వాసను వినిపించడం పార్టీశాలువా ధారణలో పంచాగకర్తలు
నోటి దగ్గరి సంభావన భావనాలో
రోటి దగ్గరిపాటను
శతిపేయ శ్రావణం చేయడం కాదు
కాలం మారడం అంటే
మతం పులుముకొని పులుమబడి
ఆనవాళ్ళు కోల్పోతున్న మనిషిని
మనస్విగా పునఃస్థాపన చేయడం
కాలం మారడం అంటే
నిన్నను మోస్తూ నేడు రొప్పడం కాదు
మనుషులను మనీషులుగా మార్చడం
రేపటికి అనువుగా ఆలోచనలు తీర్చడం
– షుకూర్