సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ఎప్పటికప్పుడు ఎలాంటి తప్పులు లేకుండా ఆన్లైన్ లో నమోదు చేయాలని అదనపు కలెక్టర్ శ్యామల దేవి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్ట్స్, కామర్స్, పాలిటెక్నిక్ కళాశాలలో కొనసాగుతున్న ఆన్లైన్ డాటా ఎంట్రి కేంద్రాలను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా వివరాల నమోదు తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగదా చేపట్టిన సర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా ఆన్లైన్లో పొందుపర్చాలన్నారు. అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతి బా పూలే వసతిగృహాన్ని తనిఖీ చేశారు. వంట గదితో పాటు తరగతి గదులను పరిశీలించి పరిశుభ్రత పాటించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం రుచి కరమైన భోజనం వడ్డించాలన్నారు. ఉపాధ్యాయులు భోజన రుచులను చూడాలని ఆదేశించారు. అంతకు ముందు అదనపు కలెక్టర్ శ్యామల దేవి తన చాంబర్ లో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలను నిర్వహించారు. కార్యాలయ సిబ్బందితో కలిసి రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడుతామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది ఉన్నారు.