అరవై ఏండ్లు దగ్గరపడితే చాలు చాలా మంది ఇక అన్నింటికీ సెలవు ప్రకటించి హాయిగా విశ్రాంతి తీసుకోవాలని భావిస్తారు. కుటుంబ సభ్యులు, పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లతో ఆనందంగా కాలం గడపాలని కోరుకుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే వయసును కూడా లెక్క చేయకుండా ఏదైనా సాధించాలని కలలు కంటారు. ఆ కలలు నిజం చేసుకునేందుకు తపించేవారు మరీ తక్కువ ఉంటారు. అలాంటి వారిలో ఒకరే వసంతి చెరువువీట్టిల్. ఆరు పదులు దగ్గర పడిన తర్వాత ఎవరెస్టు బేస్ క్యాంప్ సోలో ట్రెక్ పూర్తి చేసి చరిత్ర సృష్టించిన ఆమె పరిచయం నేటి మానవిలో…
కేరళలోని కన్నూర్ జిల్లాలోని తాలిపరంబాకు చెందిన వసంతి 59 ఏండ్ల వయసులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆమె నిర్ణయాన్ని మొదట కుటుంబ సభ్యులు, బంధువులు వ్యతిరేకించారు. ఈ వయసులో ట్రెక్కింగ్ ప్రమాదమని కొందరంటే, ఈ వయసులో ఇలాంటివి అవసరమా అంటూ మరికొందరు నిరుత్సాహపరిచారు. అయినా తన కలను నిజం చేసుకోవాలని ఆమె బలంగా భావించారు. అయితే గతంలో ట్రెక్కింగ్‌లో ఎలాంటి అనుభవం లేదు. కనీసం శిక్షణ కూడా తీసుకోలేదు. కేవలం యూట్యూబ్ వీడియోలు చూసి మెళకువలు నేర్చుకొని వసంతి విజయవంతంగా తన ట్రెక్కింగ్‌ని పూర్తి చేశారు. అందులో భాగంగానే ఏడాది కిందట వసంతి థాయిలాండ్‌కు తన మొదటి సోలో ట్రిప్ చేయడానికి ధైర్యం చేశారు. ఆ ట్రిప్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆ 59 ఏండ్ల దర్జీ తన దృష్టిని మరింత ఉన్నతంగా ఉంచుకోవాలని నిర్ణయించుకున్నారు. యూట్యూబ్ ఎంతో ఆసక్తిగా చూసే ఆమె ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు ట్రెక్కింగ్ చేసే వ్యక్తుల వీడియోలను అందులో చూసి ప్రేరణ పొందారు.
స్వీయ శిక్షణతో…
‘మేము చిన్నతనంలో ఎవరెస్ట్ పర్వతాన్ని ఎత్తైన శిఖరం అని పిలుచుకునేవాళ్లం. కానీ అక్కడికి ఎలా చేరుకోవాలో, దాని ప్రక్రియ గురించి నాకు ఎటువంటి అవగాహన లేదు. నేను థాయిలాండ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత మరింత వృద్ధాప్యంలోకి అంటే అసలు నడవలేని స్థితికి రాకముందే ‘ప్రమాదకరమైన’ ప్రదేశాలను త్వరగా ఎలా జయించాలో ఆలోచించాను’ అంటూ వసంతి ఎంతో ఉత్సాహంగా ఓ వెబ్‌సైట్‌తో పంచుకున్నారు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు ట్రెక్కింగ్ చేయడానికి ముందు తాను శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని వసంతికి అర్థమైంది. దీని కోసం ఆమె తనని తాను సిద్దం చేసుకున్నారు. నాలుగు నెలల పాటు ప్రతిరోజూ 4-6 కి.మీ నడిచారు. ఆమె నివసించే ప్రదేశం కొండ ప్రాంతం కాబట్టి ఎత్తుపల్లాలపై నడవడం ఆమె శక్తిని పెంచుకోవడానికి సహాయపడింది. ఆమె కొన్ని వ్యాయామాలు చేయడం కోసం యూట్యూబ్ వీడియోలను కూడా చూశారు. అవి తన ట్రెక్కింగ్‌లో సహాయపడతాయని ఆమె భావించారు. నెల రోజుల కిందటే ఆమె ట్రెక్కింగ్ బూట్లతో నడవడం ప్రారంభించారు. అయితే వీడియోలు చూసినంత సేపు బాగానే ఉంది.
సవాళ్లు మొదలయ్యాయి
ట్రిక్కింగ్ మొదలైన తర్వాతే ఆమెకు అసలు సవాళ్లు ఎదురయ్యాయి. ఫిబ్రవరిలో తూర్పు నేపాల్‌లోని సాగర్‌మాత నేషనల్ పార్క్ వద్ద ఉన్న ఒక చిన్న పర్వత పట్టణం లూకాకు విమానంలో ప్రయాణించడానికి ఆమె ఖాట్మండుకు బయలుదేరింది. అక్కడ ఆమె ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు తన ట్రెక్కింగ్‌ను ప్రారంభించింది. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా విమానం రద్దు చేయబడింది. తర్వాత ఏమి చేయాలో ఆలోచిస్తూ, విమానాశ్రయంలో ఉన్న ఒక జర్మన్ జంటతో ఆమె స్నేహం చేసింది. ‘వాతావరణం అస్సలు బాగోలేదని, రాబోయే కొన్ని రోజులు విమానాలు ఉండవనే సమాచారం అందింది. ‘నేను ఆ జర్మన్ జంటతో కలిసి రోడ్డు మార్గంలో సుర్కేకు మరొక మార్గంలో ప్రయాణించాలని నిర్ణయించు కున్నాను’ అని వసంతి చెప్పారు. జర్మన్ దంపతులు ఆమెకు సుర్కే నుండి ఒక పోర్టర్‌ను నియమించుకోవడానికి సహాయం చేశారు. వారి సహకారంతో ఆమె ఫిబ్రవరి 15న తన ట్రెక్కింగ్ ప్రారంభించారు. వసంతికి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకోవడానికి తొమ్మిది రోజులు పట్టింది.
మధ్యలో ఆపదలచలేదు
‘ప్రారంభంలో వాతావరణం వల్ల పెద్దగా ఇబ్బంది ఏమీ కాలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత వాతావరణం చాలా చల్లగా మారింది. మార్గం మొత్తం ఎత్తుపల్లాలతో నడవడానికి చాలా కష్టంగా ఉంది. కానీ నేను కొనసాగలేనని ఒక్కసారి కూడా నాకు అనిపించలేదు. నెమ్మదిగా నడిచాను, ఎత్తైన ప్రదేశాలు ఎక్కే సమయంలో శ్వాస ఎలా తీసుకోవాలో ముందే ప్రాక్టీస్ చేశాను కాబట్టి అలాగే చేశాను. నడవడానికి నాకు ఎటువంటి సమస్యలూ ఎదురుకాలేదు. నేను ప్రతిరోజూ 4-5 గంటలు నడిచాను’ అని ఆమె పంచుకున్నారు.
సాధ్యం చేసి చూపించారు
ఆమె తన గమ్యస్థానానికి చేరుకున్నప్పుడు ప్రపంచాన్ని జయించినట్టు భావించడమే కాకుండా, తాను అనుకున్నది సాధించగలనని ఆచరణలో నిరూపించినందుకు ఎంతో గర్వపడ్డారు. ఎట్టకేలకు ఎవరెస్ట్ శిఖర అంచులను చేరుకుని ఎంతో మంది అసాధ్యం అన్న తన కలను సాధ్యం చేసి చూపించారు. ఎవరెస్ట్ శిఖరంపై తన కేరళ మూలాలకు చిహ్నంగా భావించే కసవు చీరను ధరించి భారత జెండాను గర్వంగా ఊపారు. ఆ అద్భుతమైన చిత్రం ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వయసు కేవలం ఒక సంఖ్య అని నిరూపించిన మహిళగా వసంతి చరిత్రలో నిలిచిపోతుంది. అయితే ఇంతకంటే ఎక్కువగా ఇంకా భిన్నమైనది చేయాలనే ఆమె సంకల్పానికి ఈ విజయం పునాది వేసింది. ఇలా ఆలోచించే పద్దతే ఆమెను జీవితంలో ఎల్లప్పుడూ ముందుకు నడిపించింది.
ఒక్కసారైనా యాత్ర చేయాల్సిందే
ఎవరెస్టు అధిరోహించేందుకు ఆమెకు సహకరించిన తన ఇద్దరు కొడుకులకు ఆమె కృతజ్ఞతలు చెప్పారు. ‘ఈ ప్రయాణం కోసం నేను నా పొదుపు నుండి కొంత భాగాన్ని ఖర్చు చేశాను. నా కొడుకులు కొంత సహాయం చేసారు. మిగిలిన దాని కోసం నా బంగారాన్ని తాకట్టు పెట్టాను’ అని ఆమె చెప్పారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వసంతి తన కుట్టుపనిని తిరిగి ప్రారంభించారు. ఇప్పుడు ఇతర మహిళలకు చెప్పడానికి ఆమె వద్ద చాలా కథలు ఉన్నాయి. ‘నా వయసులోని ఇతర మహిళలు తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ యాత్ర చేయాలని నేను చెబుతాను. పర్వతాలు ఎంత అందంగా ఉన్నాయో నేను వారికి చెబుతాను’ అని ఆమె అంటున్నారు. ఆమె జాబితాలోని తదుపరి గమ్యస్థానం చైనా గోడ. ఆమె ఇప్పటికే దానిపై పరిశోధన ప్రారంభించారు. మీ కలలు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తాయో దానికి పరిమితులు లేవని వసంతి సాధించిన విజయం మనకు గుర్తు చేస్తోంది.
విజయాలకు వయసు అడ్డుకాదు
11:13 pm