కార్పొరేట్‌, మతోన్మాదానికి విరుగుడు.. సామాజిక, ఆర్థిక పోరాటాలే

The antidote to corporate and sectarianism is social and economic struggles.భూస్వామ్య, పితృస్వామిక వ్యవస్థకు మూలాధారమైన తిరోగామి హిందూత్వ విధానంపై ఆధారపడిన సమాజంలో నేడు మనమున్నాం. ఆ వ్యవస్థకు గుర్తులుగా ఉన్న అన్నిరకాల రుగ్మతలను, వివక్షలను, అసమానతలను పాలకవర్గాలు తమ రాజ కీయ ప్రయోజనాలకు, ఆర్ధిక దోపిడీకి వాడుకుంటున్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని కుల వ్యవస్థ మన దేశంలోనే ఉన్నది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో పురోభివద్ధి సాధించినప్పటికీ సాటి మనిషిని, మనిషిలాగా చూడలేని దుర్మార్గపు స్థితి నేటికీ కొనసాగడం అమానుషం. కులం, మతం, ప్రాంతం, లింగ బేధం లాంటి సామాజిక రుగ్మతలు మన దేశంలో ప్రజల్ని, కార్మిక వర్గాన్ని ఐక్యం కానివ్వకుండా దారికడ్డంగా, ముండ్ల కంచెలా ఉన్నాయి. దోపిడీ వర్గాల ప్రయోజనాల కోసం పాలక వర్గాలు కార్మికవర్గంలో సున్నితమైన ఈ అంశాలను ముందుకు తెస్తున్నారు. దాంతో కార్మికవర్గ ఐక్యతను విచ్ఛిన్నం చేసి దోపిడీ వర్గాలు తమ ప్రయోజనాలను కాపాడుకుంటున్నాయి. సమాజంలో అన్నిరకాల దోపిడీ, అణచివేత, వివక్షలకు వ్యతిరేకంగా పోరాడి వీటి నుండి శ్రామిక వర్గాన్ని విముక్తి చేసి, పెట్టుబడిదారీ సమాజానికి ప్రత్యామ్నాయంగా కార్మికవర్గ రాజ్యాన్ని స్ధాపించాలనే లక్ష్యంతో సీఐటీయూ తన ఆవిర్భావం నుంచి పని చేస్తున్నది. సామాజిక అణచివేత, వివక్ష, దోపిడీలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలతో శ్రామికవర్గ ఐక్యత కోసం కృషి చేస్తున్నది.
రాష్ట్రంలో నేటికీ పరిశ్రమల్లో, విద్యాలయాల్లో, పని ప్రదేశాల్లో చాపకింద నీరులా కులవివక్ష కొనసాగుతున్నది. దళితులు, గిరిజనులు, మహిళలు, మైనార్టీ ఉద్యోగులూ వివక్ష, దాడులకు గురవుతూనే ఉన్నారు. సమాజంలో ఉన్న వివక్ష, సహచర ఉద్యోగులు, కార్మికులు పాటిస్తున్న వివక్ష ఈ రెండింటినీ వారు అనుభవించాల్సి వస్తున్నది. ప్రమోషన్లలో రిజర్వేషన్ల అమలులో జరుగుతున్న లోపం వల్ల పదోన్నతులు దక్కడం లేదు. దళిత ఉద్యోగుల ఎడల రిజర్వేషన్‌ కేటగిరీ అంటూ చిన్నచూపు చూస్తున్నారు. డ్యూటీ చేస్తున్న పని ప్రదేశాలు మధ్యాహ్నం లంచ్‌ చేసే దగ్గర కూడా వివక్ష కొనసాగుతున్నది. ప్రత్యేకంగా కార్మికుడి సామర్థ్యం, హోదా నుండి కాకుండా వారి కులం ఆధారంగా గౌరవిస్తున్న అమానుష స్థితి ఉంది. 77 సం||లు స్వాతం త్య్రానంతరం కూడా పట్టణ ప్రాంతాల్లో దళిత ఉద్యోగ, కార్మికులకు ఇండ్లు అద్దెకు ఇవ్వకపోవడం శోచనీయం. దళితులకు గుడి ప్రవేశం లేని గ్రామాలు, దళితులకు క్షవరం చేయని స్థితి, దసరా పండుగ సందర్భంగా దళితులను జమ్మి ఆకు తెంప నీయకపోవడం, బతుకమ్మ ఆడనీయని ప్రాంతాలు, హోటళ్లలో రెండు గ్లాసుల పద్ధతి, రచ్చబండపై వీరిని కూర్చోనీయకపోవడం, పాఠశాలల్లో దళితులు మధ్యాహ్న భోజనం వంట చేస్తే అగ్రవర్ణ విద్యార్థులు తినకపోవడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. కుల వివక్ష, అంటరానితనం, కుల దురహంకార హత్యలు, సాంఘిక బహిష్కరణలు నిత్యకృత్యం. తెలంగాణ రాష్ట్రంలో దళితులపై 128 కులదురంహకార హత్యలు జరిగాయి. భువనగిరిలో అంబోజీ నరేష్‌ను హతమార్చారు. మంథనిలో మధుకర్‌ను కుల దురహంకారంతో అమానుషంగా అంతమొందించారు. నిజామాబాద్‌ జిల్లా కోటగిరిలో ఉపాధ్యాయుడు మల్లిఖార్జున్‌పై దాడి చేసి ఊరేగించి అవమానపర్చారు. తుక్కుగూడ దళిత హెడ్‌మాస్టర్‌ రాములుపై మతోన్మాదులు రెచ్చిపోయి దాడి చేసి అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్ధి కాళ్లు మొక్కించారు. ఇలా చెప్పుకుంటూ పోతే మతపరమైన దాడులు, విద్వేషపు అల్లర్లు కోకొల్లలు.
వేల సంవత్సరాల నాటి బూజు పట్టిన మనువాద సిద్ధాంతాన్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం అమలు చేయాలని తీవ్రంగా ప్రయ త్నిస్తున్నది. దేశ భక్తి ముసుగులో మతం పేరుతో శ్రామిక ప్రజలు, కార్మికుల్లో చిచ్చు పెడుతున్నది. దళితులు, గిరిజనులు, మహిళలపై విచ్చలవిడిగా దాడులు చేస్తున్నది. రాజ్యాంగ స్ఫూర్తిని భగం చేస్తున్నది. 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో 400 సీట్లు సాధిస్తే అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ అగ్ర నాయకత్వమే బహిరంగంగా ప్రకటించింది. అంబేద్కర్‌ అధ్యక్షతన భారత రాజ్యాంగానికి రూపకల్పన చేసే సమయంలోనే బీజేపీ మాతసంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్‌) రాజ్యాంగం, అంబేద్కర్‌ పట్ల తీవ్ర అసంతప్తిని వ్యక్తం చేసింది. వారు అత్యంత ప్రామాణికంగా భావించే మనుస్మతికి భారత రాజ్యాంగంలో స్థానం లేకుండా పోయిందని స్వయంగా గోల్వాల్కర్‌ తమ ‘ఆర్గనైజర్‌’ పత్రికలో పలు వ్యాసాలు రాశారు. మన దేశానికి ప్రస్తుత రాజ్యాంగం పనికిరాదన్నారు. ఇప్పుడు ఆరెస్సెస్‌ కనుసన్నల్లో పాలన చేస్తున్న బీజేపీ అదును చూసి రాజ్యాంగంపై దాడి చేస్తున్నది. ఈ ప్రమాదాలను కార్మికవర్గం ప్రతిఘటించాలి! రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి!!
భారత రాజ్యాంగం ఆర్టికల్‌-14, 16, 19 (1) (సి), 23, 24, 38, 41ల ద్వారా కార్మిక హక్కులకు అత్యంత ప్రాధాన్యత కల్పించింది. కార్మికుల సంక్షేమం, హక్కులు, బాధ్యతలు రాజ్యాంగంలో పొందుపర్చింది. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ప్రభుత్వరంగ సంస్థలను ఆధునిక దేవాలయాలతో పోల్చింది నాయకగణం. కానీ నేడు కేంద్రంలో బీజేపీి అధికారంలోకి వచ్చిన నాటి నుండి వాటిని సమాధి చేస్తున్నది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరించడం, మూసివేయడం, వాటి ఆస్తులను నేషనల్‌ మానైటేజేషన్‌ పైప్‌లైన్‌ ద్వారా తెగనమ్మడం, ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం, బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయకపోవడం వంటి నిర్ణయాల వల్ల దళిత, గిరిజన, బలహీన, పీడిత వర్గాలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను నీరుగారుస్తున్నది. పేదలకు రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులను కాలరాస్తున్నది. రిజర్వేషన్లకు పాతరేస్తున్నది. ఆర్టికల్‌-14కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. చట్టం ముందు అందరూ సమానమేననే భావనలకు తిలోదాకాలిచ్చింది. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్‌ కోడ్‌లను అమల్లోకి తెచ్చి కార్మిక హక్కులను హరించచూస్తున్నది. యూనియన్‌ ఏర్పాటు చేసుకునే హక్కు, సంఘటిత శక్తి, బేరసారాల హక్కులపై దాడి చేస్తూ కార్పొరేట్ల లాభాలకు కార్మికవర్గాన్ని బలి చేస్తున్నది. ఓ వైపు నయా ఉదారవాద ఆర్ధిక విధానాలు, మరోవైపు మనువాద మతోన్మాద విధానాలను ఏకకాలంలో అమలు చేస్తూ సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తున్నది.
జాతీయోద్యమ కాలంలోనూ, స్వాతంత్య్రానంతర కాలంలోనూ భారతదేశంలో కొనసాగుతున్న కుల వివక్ష, అంటరానితనం, అణచివేత, మూఢనమ్మకాలు, స్త్రీల హక్కులు, ఆర్థిక, సామాజిక దోపిడీ, పీడనల నుండి విముక్తి కోసం దళితులు, గిరిజనులు, మహిళలు, మైనార్టీలతో పాటు వెనుకబడిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం ఎందరో మహనీయులు అశేష త్యాగాలు చేశారు. వారు నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పోరాడారు. వారి పోరాటాలు, త్యాగాలు, వారు చేసిన కషి ఫలితంగానే, నేడు ఆయా తరగతులకు కొన్ని హక్కులు, చట్టాలు, సౌకర్యాలు లభించాయి. ప్రజలను వారి స్పూర్తితో ఆర్థిక, సామాజిక రంగాల్లో అనేక విప్లవాత్మక మార్పులు సంభవించాయి. ఆ మహనీయులను స్మరించుకోవడానికి ప్రతి ఏడాది ఏప్రిల్‌ నెల ఓ ప్రత్యేకత చాటుతున్నది. అంటరానితనం, అణచివేత, దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంఘ సంస్కర్తలు, సామాజికవేత్తలు, విప్లవకారులు, దోపిడీ రహిత సమసమాజ స్థాపనను కాంక్షించే కార్మికోద్యమ నేతల వర్థంతులు, జయంతులు వరుసగా ఈ నెలలోనే రావడం విశేషం. అన్నిరకాల వివక్షలకు వ్యతిరేకంగా పోరాడి జీవితాంతం సమసమాజ స్థాపన లక్ష్యానికి కట్టుబడిన కార్మికోద్యమ నేత బిటి రణధివె వర్థంతి ఏప్రిల్‌ 6న, ఏప్రిల్‌ 10 భారత మహిళా కార్మికోద్యమ నేత కా|| విమలా రణదివె జయంతి, ఏప్రిల్‌ 11న కుల వ్యవస్థ నిర్మూలనలతో పాటు మహిళా ఉద్ధరణ, హక్కుల కోసం కషి చేసిన జ్యోతిరావ్‌ ఫూలే జయంతి, ఏప్రిల్‌ 14న రాజ్యాంగ నిర్మాత, అంటరానితనం, బానిసత్వంపై పదునైన ఆయుధాన్ని ఎక్కుపెట్టిన డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ జయంతి. ఈ మహానుభావులను స్మరించుకుంటూ, వారి స్పూర్తితో ఆర్థిక, సామాజిక ఉద్యమాలను ఉధతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 6 నుంచి 14 వరకు సామాజిక న్యాయ వారోత్సవాలను నిర్వహించాలని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. గత మూడేండ్లుగా ఈ ఒరవడి కొనసాగుతోంది. మనువాదానికి వ్యతిరేకంగా, కుల వివక్షను అంతం చేయడం, మతోన్మాద, విచ్ఛిన్నకర శక్తులను ప్రతిఘటించడం, సామాజిక న్యాయం కోసం కార్మికవర్గ ఐక్యతను చాటడం వంటి మౌలిక లక్ష్యాలుగా ఈ సామాజిక సామాజిక న్యాయ వారోత్సవాన్ని నిర్వహించాలని కార్మికులకు నిర్దేశిస్తున్నది.
సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలపై హింస రెట్టింపు స్థాయిలో పెరిగింది. అనేక కేసుల్లో బాధితులపై హత్యలు, లైంగికదాడుల ఘటనల తీవ్రత ఆందోళన కలిగిస్తున్నది. దేశంలో రోజుకు 86కు పైగా లైంగికదాడులు, లైంగికదాడియత్నం కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ప్రతి గంటకు 49 అమానుష ఘటనలు జరుగుతున్నాయి. వీటిల్లో అత్యధికం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే చోటు చేసుకోవడం గమనార్హం. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించినప్పటికీ దాని అమలును వాయిదా వేసి మోడీ ప్రభుత్వం మహిళలకు ద్రోహం చేసింది. దేశంలో ముస్లిం, క్రిస్టియన్‌ మైనార్టీలను బీజేపీ ప్రభుత్వం ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణిస్తున్నది. మైనార్టీలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఘర్షణలు పెంచుతున్నది. ముస్లింల ఇండ్ల కూల్చివేతలు ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభమై మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఢిల్లీలతో పాటు తెలంగాణ వరకు బుల్డోజర్లను ఉపయోగించింది. ఇటీవల మేడారం ఆదివాసుల జాతరలో మాంసం విక్రయాల్లో హలాల్‌ వివాదం సంఫ్‌ు పరివార్‌ శక్తులు ముందుకు తెచ్చింది. మెదక్‌ జిల్లాలో మత ఘర్షణల్లో స్వయంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు లాఠీ పట్టుకొని స్వైర విహారం చేస్తూ మైనార్టీ హోటల్స్‌, హాస్పిటల్స్‌, దుకాణాలను ధ్వంసం చేశారు.
బీజేపీ అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలు, కార్పొరేట్‌ – మతోన్మాదానికి వ్యతిరేకంగా నికరంగా పోరాడకుండా సామాజిక న్యాయం సాధించలేము. ఆర్థిక – సామాజిక ఉద్యమాల ద్వారానే కార్పొరేట్‌, మతోన్మాద విధానాలను తిప్పికొట్టగలం. ఈ లక్ష్యసాధన కోసం సీఐటీయూ బ్యానర్‌తో అణచివేత, దోపిడీ, వివక్ష ఏ రూపంలో ఉన్నా వాటిని అంతం చేయాలనే సంక ల్పంతో కార్మికవర్గం పోరాడాలి. రాష్ట్రంలో జరుగుతున్న సామాజికోద్యమాలకు కార్మికవర్గం బాసటగా నిలవాలి.
(ఏప్రిల్‌ 6 -14 వరకు సీఐటీయూ సామాజిక న్యాయ సాధన క్యాంపెయిన్‌ )
పాలడుగు భాస్కర్‌
9490098033

Spread the love