జర్నలిస్ట్ విష్ణుప్రసాద్ కవిగా మారి తాను రాసిన కవితలతో ఒక కవితా సంకలనాన్ని తీసుకొచ్చాడు. వంద పేజీలున్న ఈ సంకలనంలో 72 కవితలు ఉన్నాయి. ఇటీవలే సంకలనం నా చేతికి అందింది.
సామాజిక, ఆర్ధిక, రాజకీయ అవగాహనతోనే తన కవితల్ని విష్ణు రాశాడు. తపన, బాధ, స్పందించక ఉండలేని తనం, దుఃఖం, కన్నీళ్లు, జ్ఞాపకాలు నెమరేసుకోవటం, తలుచుకోవటం, ఆవేశం, అలజడి, ఆందోళన, వేదన, ఓదార్పు, ప్రతిఘటన, విశ్వాసం, ఈ లక్షణాలున్నవాడే కవి అవుతారన్న విమర్శకుల మాట నిజం. ఈ లక్షణాలు విష్ణు ప్రసాద్‌లో పుష్కలంగా ఉన్నాయి.
పాలకుల దురాగతాలు, సమాజంలో నిత్యం జరిగే అంశాలే నన్ను కవిత్వం రాసేలా పురిగొల్పాయని ఈ పుస్తక రచయిత విష్ణు ప్రసాదు ‘నా మాట’లో చెప్పుకున్నారు. వత్తిగానో, ప్రవత్తిగానో కవిత్వాన్ని రాయలేదని స్పష్టం చేశాడు.
”కాలం నిన్ను ప్రశ్నిస్తోంది. నువ్వు ప్రజల పక్షాన నిలబడదలిస్తే కలంతో కదిలివచ్చి వాళ్ళ గుండెల మీద ముద్రపడేలా రాయి, వాళ్ళ జీవితాల్ని వాళ్ళ భాషలోనే చెప్పు” అన్న శేషేంద్ర మాటల్ని కవి విష్ణుప్రసాద్ అక్షరాలా నిజం చేశాడన్పించింది ఈ పుస్తకం చదువుతుంటే. తాను అనుభవించిన హదయవేదనను వధా కానివ్వకుండా కవిత్వీకరించిన యువ కవి విష్ణు ప్రసాద్. రెండున్నర దశాబ్దాలుగా ఒక జర్నలిస్ట్‌గా సమాచార చేరవేతలో ఎంత బాధ్యతగా వ్యవహరించాడో, కవిగా తన కవిత్వాన్ని అంతే బాధ్యతగా జనాలకు చేర్చే ప్రయత్నం చేశాడనిపించింది.
జర్నలిస్టుగా తాను అనేక సమూహాల మధ్య, ప్రాంతాలలో తిరుగుతున్నప్పుడు ఒక కవిగా తనకు కావల్సిన అనేక అంశాల్ని ప్రోదిచేసుకునే ప్రయత్నం చేసి అందంతా తన కవితల్లో పెట్టాడు.
పుస్తకంలోని కవితలు చదవడం ప్రారంభించాక నన్ను బాగా ఆకర్షించిన శీర్షిక ‘జనం మారారు’ అన్న కవిత. ఇందులో విష్ణు ప్రసాద్ చాలా నిర్వేదం వ్యక్తం చేస్తాడు.
2019 ఎన్నికల సమయంలో ఒక పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. మల్లన్న సాగర్ నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రజల్ని కూడగట్టి ప్రభుత్వంపై వ్యతిరేకంగా పోరాడిన నాయకులు లాఠీ రుచులను చూశారు, జైలుకు వెళ్ళారు, అనేక నిర్భంధాలను ఎదుర్కొన్నారు. కానీ ప్రజలు మాత్రం అన్ని మరిచిపోయి వ్యవహరించిన తీరుపై ఈ కవితలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. జనంలో స్వార్థం పెరిగిందని, త్యాగాల్ని గుర్తించే స్థితిలో లేరని త్యాగ ఫలితాలని అనుభవిస్తున్నారు తప్ప త్యాగధనుల్ని తలుచుకునే పరిస్థితిలో కూడా లేరని ఆవేదన వ్యక్తం చేస్తాడు.
ఎందుకు పోరాడాలి…? ఎవరి కోసం పోరాడాలి….? అన్నది ఆయన భావన, ఆక్రోశం. అంతలోనే మరలా మరో కవితలో కార్పొరేట్ శక్తుల ఆగడాలను పాలకుల పక్షపాత ధోరణిని ఎండగడుతూ ‘మేరా దేశ్ మహాన్’ కవితలో చాలా ఆవేశంగా నేనైతే వీటన్నిటిని భరించడానికి సిద్ధంగా లేను, పిడికిలి బిగుసుకుంటుంది అన్న భావన వ్యక్తం చేసి ఆశ్చర్యపరుస్తాడు. ఎవరి కోసం పోరాడాలి అన్న నిర్వేదం ఒక్క క్షణమే మిగిలి ఆ తర్వాత ప్రశ్నించడం ఆగొద్దు, పోరాటాన్ని వీడొద్దన్నది ఆయనలో ప్రతి క్షణం రగిలే జ్వాలగా కన్పిస్తుంది.
కసాయి పాలకులకు బలవుతున్న మేకలందరికీ అంకితం అంటూ ‘తెగ మురిసే మేక’ శీర్షికతో ఉన్న కవితలో వివరిస్తాడు. పాలకులు ప్రజల్ని ఎన్ని రకాల మోసాలకు గురిచేసినా వారి స్వభావంలో మార్పు రాకపోవటంపై అతని కోపం ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది.
ఎవరిని నిందించి ఏమి లాభం బానిసలుగా మారుతాం, బలిపశువులమవుతాం అంటూ మా దళితులు తిరోగమిస్తుంటే అంటూ నిందాస్తుతి చేస్తాడు.
ఇక తాను పుట్టి పెరిగిన ప్రాంతంలో పీడనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి మార్కండేయ గురించి ఒక కవిత రాస్తూ, మా ఊరి చేగువేరా అంటూ ఆవేశంతో ఊగిపోతాడు.
మతోన్మాద శక్తుల విధ్వంసంతో సమాజం ఎదుర్కొనే విపత్కర పరిస్థితిని కూడా ప్రశ్నిస్తాడు. ఈ దేశం ఎవరిది …? అన్న పెద్ద ప్రశ్న సంధిస్తాడు. మీరంతా ఎవరు అసలు మూలవాసులకు దేశాన్ని వదిలిపోండి అంటూ గర్జిస్తాడు.
అది సినిమా అయినా, రచనా ప్రక్రియ ఏదైనా చరిత్రను వక్రీకరించే దుర్మార్గం వద్దంటాడు ఖరాఖండిగా. తెలంగాణ మట్టి మనుషుల నేల అంటూ పులకించిపోతాడు.
పాలకులు ప్రజాధనాన్ని మంచినీరులా ఖర్చు చేసి విలాసవంతమైన జీవితాలను అనుభవిస్తూ, ప్రజలు పడే బాధలను విస్మరించడాన్ని నిరసిస్తాడు.
దండకారణ్యంలో ఖనిజ సంపదను దండుకోవాలని చూసే కార్పొరేట్ శక్తులపై ‘లాల్ సలాం’ కవితలో నిప్పులు చెరుగుతాడు. ఇట్లా సమకాలీన సమాజంలో నిత్యం జరిగే అనేక అంశాలపై తను స్పందించి ఈ కవితలను ఒక్కొక్కటి అల్లుకుంటూ వచ్చాడు విష్ణు.
తెలంగాణ సమాజం కవుల, రచయితలపై ఉద్యమ బాధ్యతను కూడా పెట్టిందని ఓ మహానుభావుడు అన్నట్లు ఒకవైపు కలం, ఇంకో వైపు ఉద్యమ గళం రెండింటితో తెలంగాణ కవులు ముందుకు సాగారన్నది కాదనని సత్యం. విష్ణు కూడా తను ఒక విద్యార్థి సంఘం నాయకుడిగా, ఒక జర్నలిస్టుగా, ప్రజా కవిగా పరిణామం చెందుతూ వచ్చాడు.
గుడ్డి మతాభిమానం, శ్రమ దోపిడి, సంపదను కొల్లగొట్టడం, సంపద ఒకే దగ్గర పోగుబడటం, కుల దురహంకారం, అస్థిత్వ ఉద్యమాలు తదితర వాటిపై విస్తతంగా చర్చ పెడతాడు తను.
మనుషుల్ని, సంగతుల్ని నిజాయితీగా కవిత్వీకరించే పనిలో ఉన్నాడు. దిక్కారస్వరాల మధ్యనే పుట్టి పెరిగిన విష్ణు వ్యక్తిత్వాన్ని ఇంతకంటే భిన్నంగా ఎలా చూడగలం. తను ఎటువైపు నిలవాలో తెలుసుకున్నవాడు, తనింకా జనంలో మమేకమవ్వాలని తపిస్తున్నవాడు ఈయన నుంచి మరిన్ని మంచి కవితలు రావాలని కోరుకుందాం.
– పి.వి.రావు, సీనియర్, జర్నలిస్ట్