
కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ నాయకులు యాసారపు వెంకన్న డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు 50 రూపాయలు పెంచడానికి నిరసనగా సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు గురువారం గుండాల మండల కేంద్రంలోని సాయనపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వై.వెంకన్న, ఆ పార్టీ మండల కార్యదర్శి అర్రెం నరేశ్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరోసారి దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలు అమలుచేస్తూ ప్రజలు నష్టపోయే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. పేద ప్రజలకి అన్ని రకాలుగా ఆదుకుంటున్నామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం మూలిగే నక్క పై తాటి పండు పడ్డ చందంగా వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ పెంచి మధ్యతరగతి ప్రజల పై పెను భారాన్ని మోపిందన్నారు. దేశ ప్రజల శ్రేయస్సు మా శ్రేయస్సని గొప్పలు చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవసాయ కూలీలపై భారాలు మోపుతుందన్నారు. నిత్యవసర వస్తువులు ధరలు సైతం పెంచుతూ ప్రజల్ని ఆర్థికంగా నష్టపరుస్తుందని చెప్పారు. మధ్యతరగతి కుటుంబాలను ఎదగనీయకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షాన భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు పర్శక రవి, ఈసం కృష్ణ, గడ్డం లాలయ్య, బానోతు లాలు, మానాల ఉపేందర్, వజ్జ ఎర్రయ్య, దుగ్గి శేఖర్, ఈసం సుధాకర్, ఈసం రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.