– విఫలమైన ‘సావరిన్ గోల్డ్ బాండ్’ పథకం
– బంగారం ధరల పెరుగుదలపై తప్పిన అంచనా
– ప్రభుత్వంపై రూ.2.2 లక్షల కోట్ల ఆర్థిక భారం
– మోడీ సర్కారు అనాలోచిత నిర్ణయాలు
– తర్వాత వచ్చే ప్రభుత్వాలపై పడనున్న భారాలు
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎలాంటి ముందు చూపూ లేకుండా తీసుకొచ్చిన సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్‌జీబీ) పథకం పూర్తిగా విఫలమైంది. బంగారం ధరల పెరుగుదలపై తప్పు అంచనాలు, సరైన సమయానికి తగిన మార్పులు చేయకపోవడం వల్ల ఇప్పుడు ఇది ప్రభుత్వానికి పెను ఆర్థిక భారంగా మారింది. ఆ తర్వాత ఇది తదుపరి ప్రభుత్వాలపై పడనుంది. ఈ విషయంపై ఆర్థిక విశ్లేషకులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆదిలోనే ఆదరణ కరువు
2015 నవంబర్‌లో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్‌జీబీ) పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రజలు భౌతిక బంగారం కొనుగోలు చేయకుండా, బదులుగా బాండ్లలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. దీని ద్వారా దేశానికి వచ్చే బంగారం దిగుమతులను తగ్గించడం కూడా దీని ఉద్దేశం. అయితే ప్రారంభంలో ఈ పథకానికి పెద్దగా స్పందన రాలేదు. మొదటి 20 నెలల్లో 14 టన్నుల బంగారానికి సమానమైన రూ.4,769 కోట్లు మాత్రమే ప్రభుత్వం సేకరించగలిగింది. ఇది ప్రభుత్వం నిర్ణయించుకున్న రూ.25 వేల కోట్ల లక్ష్యం కంటే చాలా తక్కువ కావటం గమనార్హం. 2015-2020 మధ్య కేవలం 31 టన్నుల బంగారం సమానంగా మాత్రమే పెట్టుబడులు వచ్చాయి. కానీ 2020 తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. బంగారం ధరలు ఒక్కసారిగా పెరగడంతో… ఎస్‌జీబీలపై పెట్టుబడులు భారీగా పెరిగాయి.
అనూహ్యంగా పెరిగిన బంగారం ధరలు.. కేంద్రంపై భారం
ఈ పథకం ప్రకారం పెట్టుబడిదారులకు బంగారం ధరల పెరుగుదలతోపాటు 2.5 శాతం వడ్డీ కూడా ఇవ్వాలి. కానీ బంగారం ధరలు అనూహ్యంగా పెరగడంతో ప్రభుత్వంపై చెల్లింపుల భారం కూడా పెరిగింది. 2025-26 నాటికి ఈ భారం రూ.2.2 లక్షల కోట్లకు చేరాయి. ఇది ప్రభుత్వానికి భారీ ఆర్థిక ఒత్తిడిగా మారింది.
సమయానికి నిధుల కేటాయింపులేవి?
ఇక భవిష్యత్ చెల్లింపుల కోసం తగిన నిధులు ముందుగానే కేటాయించకపోవడం మరో సమస్య. ‘గోల్డ్ రిజర్వ్ ఫండ్’ అనే నిధికి చాలా తక్కువ మొత్తాలు మాత్రమే కేటాయించడంతో.. వాస్తవ చెల్లింపులకు సరిపడా డబ్బు నిల్వ కాలేదు. గార్గ్ సూచన ప్రకారం.. ప్రభుత్వం సేకరించిన డబ్బుతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వారా నిజమైన బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ ఉంచితే, ఈ సమస్య తగ్గేది. అప్పుడు బంగారం ధరలు పెరిగినా, అదే బంగారాన్ని అమ్మి బాండ్లను చెల్లించవచ్చు.
తదుపరి ప్రభుత్వాలకు తప్పని తిప్పలు
ఈ పథకం వల్ల వచ్చిన ఆర్థిక భారం భవిష్యత్ ప్రభుత్వాలపై పడే అవకాశం ఉంది. ముఖ్యంగా 2029 తర్వాత పెద్ద మొత్తంలో బాండ్ల చెల్లింపులు రావాల్సి ఉంది. సరైన ప్రణాళిక, ముందస్తు అంచనాలు, సమయానికి తగిన మార్పులు లేకపోవడం కారణంగానే ప్రభుత్వానికి పెద్ద ఆర్థిక సవాలుగా మారాయి. భవిష్యత్తులో ఇలాంటి పథకాలను మరింత జాగ్రత్తగా రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
మోడీ సర్కారు నిర్లక్ష్యం
ప్రభుత్వం బంగారం ధరల చరిత్రను సరిగ్గా విశ్లేషించలేదనీ, దాని కారణంగానే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని మాజీ ఆర్థిక కార్యదర్శి గార్గ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో బంగారం ధరలు వేగంగా పెరిగిన సందర్భాలున్నప్పటికీ.. కేంద్రం వాటిని పట్టించుకోకుండా ఈ పథకాన్ని రూపొందించిందని అన్నారు. సమస్యలు కనిపించిన తర్వాత కూడా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోలేదు. 2020 తర్వాత బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ.. ఎస్‌జీబీలను కొనసాగించడం వల్ల చెల్లించాల్సిన మొత్తం చాలా పెరిగింది. చివరకు 2024-25లో ఈ పథకాన్ని కేంద్రం అకస్మాత్తుగా నిలిపివేసింది. అప్పటికి ప్రభుత్వం 147 టన్నుల బంగారంతో సమానమైన రూ.70వేల కోట్ల మొత్తాన్ని ఎస్‌జీబీలో కలెక్ట్ చేసింది.



