Tuesday, June 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపంటల కొనుగోళ్లలో కేంద్రం తీరు ఆక్ష‍ేపణీయం

పంటల కొనుగోళ్లలో కేంద్రం తీరు ఆక్ష‍ేపణీయం

- Advertisement -

అన్ని పంటలనూ కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే
రైతు సమస్యలపై కేంద్రానికి మంత్రుల బృందం
పంటల మార్పిడిపై విస్తృత అవగాహన కల్పిస్తున్నాం : మంత్రి తుమ్మల
‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కేంద్ర అవలంబిస్తున్న విధానాలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయనీ, పంటల కొనుగోళ్ల విషయంలో కేంద్రం తీరు ఆక్ష‍ేపణీయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని మార్క్‌ఫెడ్ కార్యాలయంలో మంత్రి తుమ్మల మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌పీ ప్రకటించి చేతులు దులిపేసుకుంటున్న తీరును ఎండగట్టారు. దీంతో పంటల కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వాలకు భారంగా మారిందన్నారు. కేంద్రం పూర్తిస్థాయిలో పంటలను కొనుగోలు చేయకున్నా రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొంటున్నదని తెలిపారు. 15 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న, రెండు లక్షల మెట్రిక్ టన్నుల జొన్నలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి మార్క్‌ఫెడ్ రూ. 4,800 కోట్ల అప్పులుంటే ఈ రెండేండ్లలో మరో రూ. 1,800 కోట్లు పెరిగిందని తెలిపారు. మొత్తంగా మార్క్‌‌ఫెడ్‌ ‌రూ.6 వేల కోట్ల నష్టాల్లో ఉందని వెల్లడించారు. దేశంలో అన్ని రకాల పంటలు కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. పంటలను దేశంలోని వివిధ రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఎగుమతి చేసే వ్యవస్థ కేంద్రం చేతిలో ఉంటుందనీ, ఎంఎస్‌పీకి పంటలు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా తరలించుకోవచ్చని, ఈ క్రమంలో రాష్ట్రంపై వివక్షను పక్కన పెట్టి అన్ని పంటలు ఎంఎస్‌‌పీకి పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం నిల్వకు అవసరమైన గిడ్డంగులు కూడా కేంద్రం ఆధీనంలో ఉన్నాయనీ, రాష్ట్రంలో అత్యధిక పంటల దిగుమతి జరుగుతుండంతో అందుకు అనుగుణంగా గోదాముల నిర్మాణాలు చేపట్టాలని కోరినా కేంద్రం స్పందించలేదని విమర్శించారు. గిడ్డంగులు లేకపోవడంతో పంట దిగుమతులు ఎండకు ఎండిపోయి, వర్షానికి తడిచిపోయి అటు రైతులకు, మరోవైపు కొనుగోలు చేసిన ప్రభుత్వానికి నాణ్యత లేకుండాపోతుందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వేర్ హౌస్ గోడౌన్స్ కొత్తవి నిర్మాణం చేయాలని డిమాండ్‌ ‌చేశారు. రైతుల సమస్యలపై త్వరలో రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలవనున్నట్లు చెప్పారు. దేశంలో అత్యధికంగా వరి, మొక్కజొన్న, సోయాబీన్, ఇతర పంటలు కొనుగోలు చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడంతో రాష్ట్రంపై భారం పడుతోందన్నారు. ఎంఎస్‌పీ కేంద్రం బాధ్యత అనీ, దాన్ని తప్పని సరిగా పాటించి తీరాలని డిమాండ్ చేశారు. పంట మార్పిడిపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నామనీ, రైతులు నష్టం లేని ఉద్యానవన పంటల వైపు మారాలని కోరారు. రాష్ట్రంలో ఇప్పటికే సుమారు మూడు లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుతోందని, రాబోయే రెండున్న రేండ్లలో సుమారు ఆరు లక్షల ఎకరాల్లో సాగు చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో మూడు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు పనిచేస్తున్నా యని, మూడు ఫ్యాక్టరీలు నిర్మాణంలో, మరో మూడు ఫ్యాక్టరీలో ప్రారంభ దశలో ఉన్నాయని వివరించారు. రైతుల యూరియా యాప్‌పై విస్తృత అవగాహన కల్పిస్తున్నామని, ఫోన్ లేని వారు సైతం యూరియా బుక్ చేసుకునేలా క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. సమావేశంలో మార్క్‌ఫెడ్ కమిషనర్ రాహుల్ రాజ్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, అధికారులు యాస్మిన్ బాషా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -