Tuesday, June 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‌తెలంగాణ వారినే జడ్జీలను చేయాలి

‌తెలంగాణ వారినే జడ్జీలను చేయాలి

- Advertisement -

హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్ర హైకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను రాష్ట్రానికి చెందిన అర్హులైన న్యాయవాదులు, న్యాయాధికారులతోనే భర్తీ చేయాలని తెలంగాణ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు అసోసియేషన్‌ కార్యదర్శి కె నిరంజన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. న్యాయమూర్తుల నియామకాల్లో తెలంగాణ మూలాలున్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు సామాజిక న్యాయ సూత్రాలకు అనుగుణంగా అన్ని వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించా లని కోరుతూ సోమవారం అసాధారణ సర్వసభ్య సమావేశం లో తీర్మానం ఆమోదించింది. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎస్‌ సురేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో న్యాయ మూర్తుల నియామకాల కోసం కొలీజియం పరిశీలిస్తున్న ప్రతిపాదనలపై చర్చించారు. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు కొలీజియం సభ్యులు, కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులకు వినతిపత్రాలను అందజేయాలని నిర్ణయించారు. డిమాండ్ల సాధన కోసం బుధ వారం మధ్యాహ్నం 1.45 గంటలకు హైకోర్టు ప్రాంగణం లో నిరసన కార్యక్రమం నిర్వహించాలని తీర్మానం చేసింది.

జీవీకే గౌతమి పవర్‌ పిటిషన్‌ డిస్మిస్‌
విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ప్రకారం ఆదాయపు పన్ను శాఖకు చెల్లించిన రూ.24.39 కోట్ల మినిమమ్‌ ఆల్టర్నేట్‌ ట్యాక్స్‌ (ఎంఏటీ)ను వడ్డీతో సహా తిరిగి చెల్లించేలా ఏపీ ట్రాన్స్‌కోను ఆదేశించాలని కోరుతూ జీవీకే గౌతమి పవర్‌ లిమిటెడ్‌ (ప్రస్తుతం ఆర్‌ఎస్‌పీఎల్‌) దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు సోమవారం కొట్టేసింది. పిటిషన్‌ విచారణార్హం కాదని పేర్కొంటూ రూ.లక్ష జరిమానా విధించింది. అంతేకాకుండా లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌ఓసీ)ల ద్వారా ఉత్పత్తి సామర్ధ్యానికి మించి తీసుకున్నట్టు ఆరోపణలున్న రూ.1,109 కోట్ల బకాయిల వసూళ్ల విషయంలో విద్యుత్‌ సంస్థల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై దర్యాప్తు చేపట్టాలని ఏపీ, తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీలను ఆదేశించింది. పీపీఏ నిబంధనల ప్రకారం చెల్లించిన ఎంఏటీ మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని కోరుతూ జీవీకే గౌతమి పవర్‌ 2016లో హైకోర్టును ఆశ్రయించింది. అనంతరం దివాళా పరిష్కార ప్రక్రియలో కంపెనీని ఆర్‌ఎస్‌పీఎల్‌ స్వాధీనం చేసుకోవడంతో, పిటిషన్‌లో జీవీకే గౌతమి పవర్‌ స్థానంలో ఆర్‌ఎస్‌పీఎల్‌ పేరు నమోదు అయ్యింది. పన్ను చెల్లించాలన్న పిటిషన్‌పై జస్టిస్‌ నగేశ్‌ భీమపాక చెప్పిన తీర్పులో ఏపీఈఆర్‌సీ ఉత్తర్వుల అమలుకు చట్టపరమైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయడం సరికాదన్నారు. ఏపీకి చెందిన కేసును తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేయడం పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పిటిషన్‌ను రూ.లక్ష జరిమానాతో కొట్టేశారు. జీవీకే పవర్‌ దివాళా ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కూడా రూ.1,109 కోట్ల బకాయిల వసూళ్ల కోసం రెజల్యూషన్‌ ప్రొఫెషనల్‌ ఎదుట క్లెయిమ్‌ దాఖలు చేయని అధికారుల పాత్రపై అనుమానాలు ఉన్నందున దీనిపై విచారణ చేపట్టాలని ఏపీ, తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీలను ఆదేశిస్తూ తీర్పు చెప్పారు

నిషేధిత జాబితా నుంచి భూమి తొలగింపు ఆదేశాలివ్వండి
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం గుబ్బడిలోని తమ 4.30 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చడాన్ని సవాలు చేస్తూ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, ఆయన సోదరుడు అశోక్‌కుమార్‌ షావిలి సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. తమ భూమిని నిషేధిత జాబితాలో చేర్చుతూ జిల్లా కలెక్టర్‌ గతేడాది నవంబరు ఆరున జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. 1980లో అసలు పట్టాదారుల నుంచి ఈ భూమిని కొనుగోలు చేశామనీ, అప్పటి నుంచి తమ స్వాధీనంలోనే ఉందని పిటిషనర్లు తెలిపారు. రెవెన్యూ రికార్డుల్లో విక్రయదారుల పూర్వీకుల పేర్లు నమోదై ఉన్నప్పటికీ, ఎలాంటి ఆధారాలు లేకుండా రికార్డులకు విరుద్ధంగా నిషేధిత జాబితాలో చేర్చారన్నారు. ఈ అంశం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పరిధికి చెందినదని పేర్కొంటూ సంబంధిత న్యాయమూర్తి ముందుకు మంగళవారం విచారణకు ఉంచాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -