నవతెలంగాణ – మోపాల్
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం చెందిన ఎన్ డీసీసీ బ్యాంక్ డైరెక్టర్ మరియు క్రిబ్కో డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, బాడ్సి సొసైటీ చైర్మన్ నిమ్మల మోహన్ రెడ్డి తో కలిపి పదిమంది సొసైటీ చైర్మన్లు మంగళవారం రోజున రూరల్ నియోజకవర్గం క్యాంప్ ఆఫీస్ లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముప్ప గంగిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారెంటీ పథకాలకు ఆకర్షితులై, అలాగే దానిలో ముఖ్యంగా రుణమాఫీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసి తీరుతుందని వారు భావించారని అందుకే స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరారని, వారు చేరడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతం అవుతుందని రానున్న పార్లమెంట్ ఎలక్షన్ లో రూరల్ నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ అభ్యర్థికి మెజార్టీ అందించి గెలిపించుకుంటామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ లో చెప్పిన హామీల మేరకు 6 గ్యారంటీలలో మూడు గ్యారెంటీలు అమలు చేశామని ఇంకొన్ని రోజుల్లో మిగతా గ్యారంటీ పథకాలను కూడా అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చెప్పిందే చేస్తుంది చేసేదే చెప్తుందని, గత తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత మన రాష్ట్ర ప్రజలకు నిజమైన స్వాతంత్రం వచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వంలో సంపూర్ణ స్వేచ్ఛ ప్రజలకుంటుందని కుటుంబ పాలన ఉండదని, దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన తెలిపారు. అలాగే గత ప్రభుత్వం పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే రూరల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలలో నీటి ఇబ్బందులు ప్రారంభమయ్యాయి అని గత ప్రభుత్వం మాటల్లో తప్ప చేతల్లో చేసింది ఏమీ లేదని అన్ని నియోజకవర్గాల్లో ఒక్కరు ఎమ్మెల్యే ఉంటే మన రూరల్ నియోజకవర్గంలో తండ్రి కొడుకులు ఇద్దరు ఎమ్మెల్యేగా వ్యవహరించే వారిని, ఎంతసేపు వాళ్ళ స్వలాభం తప్ప ప్రజల గురించి ఈరోజు ఆలోచించలేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయదని పార్టీలతో ఇక్కడున్న బాజిరెడ్డి గోవర్ధన్ మరియు కవిత, అరవింద్ లాంటి నాయకుల తో పోరాడుతమే తప్ప ప్రజలతో కాదని ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అన్ని పార్టీలకతీతంగా ప్రజలకు అందించి తీరుతామని ఆయన తెలిపారు. అలాగే రుణమాఫీ కూడా అతి త్వరలో చేస్తామని ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్యాంకర్లతో మాట్లాడుతున్నాడని అది కొలిక్కి వచ్చిన వెంటనే రుణమాఫీ చేసి తీరుతామని గత బిఆర్ఎస్ ప్రభుత్వం లాగా రుణమాఫీ చేయకుండా ప్రజలను మోసగించబోమని ఆయన తెలిపారు. అలాగే రైతులకు పంట బీమా కూడా కల్పించి తీరుతామని వరదల వల్ల కానీ నీటి కొరత వల్ల గాని వ్యవసాయానికి ఇబ్బంది కలిగినప్పుడు రైతన్నలు నష్టపోకుండా పంట బీమా సదుపాయం కల్పించి రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలను ఆదుకుంటుందని ఆయన తెలిపాడు. అలాగే సహకార సంఘం గురించి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి రైతులకు వారధిగ సహకార సంఘాలు ఉంటాయని వాటి బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి కచ్చితంగా వారికి కావాల్సిన సదుపాయాలు వచ్చే విధంగా చూస్తానని ఆయన తెలిపారు. ముఖ్యంగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 800 కోట్లతో మొదలుపెడితే గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.3000 కోట్లకు పెంచి సొంత లాభార్జన కొరకు ప్రాజెక్టుల రీ డిజైన్ చేస్తూ ప్రజల జీవితాలతో ఆడుకున్నాడని ఆయన విమర్శించాడు. ముఖ్యంగా మంచిప్ప ప్రాజెక్టు విషయంలో అక్కడున్న రైతులకు తీవ్ర అన్యాయం చేశారని కానీ మన ప్రభుత్వం అలా చేయదని, మన ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని ఆయన తెలుపుతూ మన ప్రభుత్వం రైతు సంక్షేమంకే మొదటి ప్రాధాన్యత ఇస్తుందని” ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతన్న ఏడ్చిన రాష్ట్రం”బాగు పడినట్టు చరిత్రలో లేదని ఆయన తెలిపాడు. పాడి సెంటర్లలో ధాన్యాన్ని రైస్ మిల్లు కి తరలించేటప్పుడు రైస్ మిల్లర్ల క్వింటాలకు 10 కిలోలు 7 కిలోలు అంటూ కర్త చేయటం వల్ల ఇటు రైతులకు అటు రైస్ మిల్లర్లకు మధ్యన చైర్మన్లు బాగా సతమతమయ్యారని ఆ సమయం లో వారి బాధ ఆగమ్య గోచరమని మన ప్రభుత్వంలో అటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవని ఆయన అక్కడ ఉన్న సొసైటీ చైర్మన్ లకు భరోసా కల్పించాడు. ఈ కార్యక్రమంలో ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, మోపాల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాయి రెడ్డి, శేఖర్ గౌడ్, భాస్కర్ రెడ్డి, సడక్ శేఖర్ రెడ్డి, అనిల్, రాధా కిషన్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.