కోడ్ ముగిసింది

– సామాన్యులకూ తప్పనున్న అగచాట్లు
– యథావిధిగా ప్రభుత్వ కార్యకలాపాలు
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
లోక్ సభ  ఎన్నికల షెడ్యూల్ మార్చి 16న విడుదల కాగా.. అప్పటి నుంచి ఎన్నికల నియా మవళి(కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి వచ్చింది. ఫలితాలు వెలువడటంతో గురువారం కోడ్ ను  ఎత్తివేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. సరిగ్గా 81 రోజులు కోడ్ అమలు దృష్ట్యా ప్రజా సంబంధ ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోగా.. సామాన్యులు నిబంధనల నడుమ ఉక్కిరిబిక్కిరయ్యారు. కోడ్ ఎత్తివేతతో యథావిధిగా ప్రభుత్వ యంత్రాంగ సేవలు ఊపందుకోనుండగా.. అభి వృద్ధి పనులు పరుగు తీయనున్నాయి. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడ టమే తరువాయి సరిహద్దుల్లో చెకోపోస్టుల ఏర్పాట్లు, పోలీసుల నిరంతర తనిఖీలు ముమ్మర మయ్యాయి. అదే సమయంలో వివాహాల సీజన్ కావడంతో రూ.50 వేలకు మించి నగదు పట్టుబడితే వాటి ఆధారాలు చూపాలని నిబంధనలు విధించడంతో సంబంధీకులు నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అత్యవసర సమయంలో ఆసుపత్రి బిల్లులు కట్టేందుకు నగదు తీసుకెళ్లడం ఇబ్బందికర పరిస్థితిని తెచ్చి పెట్టింది. మరోవైపు ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్న వేళ రైతులు విత్తనాలు, ఎరువుల కోసం నగదు తీసుకెళ్లేందుకు వెనుకడుగు వేయాల్సిన ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది.
పథకాల అమలుకు మార్గం సుగమం..
ప్రభుత్వ పథకాల అమలుకు కోడ్ అడ్డంకిగా మారడంతో ప్రజాపాలన కార్యక్రమం కింద ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకున్న వారికి ప్రయోజనాలు దక్కకుండాపోయాయి. ముఖ్యంగా 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తుకు కొంతమంది దూరమయ్యారు. కొత్త దరఖాస్తులకు అవకాశం లేకుండాపోయింది. ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుకు నోచుకోలేదు. నిధులు మంజూరై ప్రారంభం కాని ప్రగతి పనులూ నిలిచిపోయాయి. కోడ్ ఎత్తివేతతో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు జోరందుకోనుంది. ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చే రిజిస్ట్రే షన్ల శాఖలోనూ లావాదేవీలు మందగించాయంటే నగదు నిబంధనలే కారణంగా నిలిచాయి.
ప్రజావాణి ప్రారంభం..
ఎన్నికల కోడ్ ఎత్తివేతతో కలెక్టరేట్లలో వచ్చే సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం కానుంది. దాదాపు మూడు నెలల పాటు సామాన్యుల నుంచి అర్జీల స్వీకరణ నిలి చిపోవడంతో వారి సమస్యలపై అధికారులు దృష్టి సారించలేపోయారు. ఇదే అదనుగా తహసీల్దార్ కార్యాలయాల్లో రైతుల నుంచి అందిన కాడికి దండుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మామూలు కుల, ఆదాయ, నివాస పత్రాల జారీకి సైతం నిబంధనల సాకుచూపి ఇష్టారీతిన డబ్బులు వసూలు చేశారంటే తహసీల్ కార్యాలయ సిబ్బంది బరితె గింపునకు నిదర్శనంగా నిలిచింది. ఎన్నికల తర్వాత ఎలాగూ బదిలీ అవుతామనే ధీమాతో   సాంకేతిక కారణాలు చూపి రిజి స్టేషన్లకు వచ్చిన రైతుల నుంచి రూ. లక్షల్లో దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి అధికారులపై ఇప్పుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేసే అవకాశం రానుంది. సామాన్యుల అర్జీల స్వీకరణకు ప్రజావాణి కార్యక్రమాలు వేదికగా నిలవనున్నాయి.
Spread the love