ఓట్ల లెక్కింపు ప్రక్రియ జాగ్రత్తగా నిర్వహించాలి

– డేటా ఎంట్రీ పై  సైతం అధికారులు దృష్టి సారించాలి
– 4 హాళ్లలో 96 టేబుల్ ల ఏర్పాటు
– ఉదయం 6 గంటలకు సిబ్బంది లెక్కింపు కేంద్రం వద్ద హాజరు కావాలి
– ఉదయం 8 గంటలకు విధి గా  ఓట్ల లెక్కింపు ప్రారంభం 
– రిటర్నింగ్ అధికారి  హరిచందన దాసరి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
వరంగల్, ఖమ్మం,నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, వరంగల్, ఖమ్మం,నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన అన్నారు. శనివారం ఆమె  జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన 12 జిల్లాల అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, ఏఆర్ఓలకు ఓట్ల లెక్కింపు పై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదటి రౌండు చాలా ముఖ్యమని, ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్ల ఎదురుగా బ్యాలెట్ బాక్స్ ల సీల్ తీయడం, అలాగే అవసరమైన మెటీరియల్ అన్నిటిని ఎన్నికల నిబంధనల ప్రకారం నిర్వహించాలని, ప్రక్రియను ఏజెంట్లకు, అభ్యర్థులకు చూపించి వారి ఎదురుగానే నిర్వహించాలని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోకి అభ్యర్థులు, ఏజెంట్లు ఎలాంటి ఇంకు పెన్నులు, వాటర్ బాటిళ్లు, సెల్ ఫోన్ వంటివి తీసుకురావడానికి వీలులేదని అన్నారు. డేటా ఎంట్రీ పై  సైతం అధికారులు దృష్టి సారించాలని, ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా దుప్పలపల్లి గోదాంలో 4 హాళ్లలో ఓట్ల లెక్కింపును చేపట్టడం జరుగుతున్నదని, ఇందుకుగాను 96 టేబుల్ లు ఏర్పాటు చేయడం జరిగిందని, ఒక్కోహాల్లో 24 టేబుల్ లు ఉంటాయని తెలిపారు.
ఉదయం 6 గంటలకు ఓట్ల లెక్కింపు సిబ్బంది అందరూ లెక్కింపు కేంద్రం వద్ద హాజరు కావాలని,ఉదయం 8 గంటలకు కచ్చితంగా ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రతి హాల్ కు అదనపు కలెక్టర్ ,ఒక ఏఆర్ఓ ఇన్చార్జిగా ఉంటారని, అంతేకాక ఆర్టీవో స్థాయి అధికారులు ఇద్దరు ఉంటారని ,12 టేబుల్ లకు ఒక ఆర్డిఓ చొప్పున ఇన్చార్జిగా వ్యవహరిస్తారని తెలిపారు. కౌంటింగ్ సూపర్వైజర్లకు ఇదివరకే శిక్షణ ఇవ్వడం జరిగిందని, మరోసారి  3 వ తేదీ శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మొదటి రౌండు షిఫ్ట్ డ్యూటీలో ఉన్నవారు  రెండవ స్విఫ్ట్ ఉద్యోగులు వచ్చిన తర్వాతే బయటకు వెళ్ళవలసి ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా టాబులేషన్,ఓట్ల లెక్కింపు, రిపోర్టులు,మొదటి రౌండు కౌంటింగ్ అంశాలపై మాట్లాడారు. ఓట్ల లెక్కింపులో ఎలాంటి తేడా రాకుండా చూసుకోవాలని అన్నారు. మూడు రౌండ్ల వరకు పూర్తిస్థాయిలో బండిల్స్ లెక్కించడం జరుగుతుందని, నాలుగవ రౌండ్  సైతం ఉంటుందని అంచనా వేస్తున్నామని, పోస్టల్ బ్యాలెట్ అన్నింటిని కలుపుకొని బ్యాలెట్ పేపర్ లెక్కించవలసి ఉంటుందని, చెల్లుబాటు ఓట్లు , చెల్లుబాటు కానీ ఓట్లను జాగ్రత్తగా పరిశీలించి లెక్కించాలని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపును సులభంగా తీసుకోవద్దని, ఉద్యోగులకు వారికి కేటాయించిన విధులను నూటికి నూరు శాతం ఎలాంటి పొరపాట్లు జరగకుండా చేయాలని సూచించారు.  ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ కలెక్టర్ జె. శ్రీనివాస్ తో పాటు, అన్ని 12 జిల్లాల అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, జిల్లా అధికారులు, ఏఆర్వోలు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Spread the love