పార్లమెంట్‌ సమావేశాల రోజులు తగ్గినరు

– 17వ లోక్‌సభలో ఏడాదికి సగటున 55 రోజులే
– మొదటి లోక్‌సభలో ఇది 135 రోజులు
– పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసెర్చ్‌ అధ్యయనం
న్యూఢిల్లీ : భారత్‌లో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 17వ లోక్‌సభ రద్దు కావటానికి సమయం దగ్గరపడుతున్నది. 17వ లోక్‌సభ సమావేశాలు శుక్రవారం నాటికి ముగిశాయి. అయితే, మోడీ ప్రధానిగా ఉన్న కాలం నాటి ఈ పార్లమెంటు సమావేశాలు వివిధ అంశాలపై చర్చించటానికి ఏడాదికి సగటున 55 రోజుల మాత్రమే వెచ్చించటం గమనార్హం. ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ సభా నాయకుడిగా ఉన్న మొదటి లోక్‌సభ సగటు వార్షిక సమావేశాలు 135 రోజులు జరగటం గమనార్హం. పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసెర్చ్‌ ద్వారా జూన్‌, 2019 నుంచి ఫిబ్రవరి, 2024 మధ్య పార్లమెంటు గణాంక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
అతి తక్కువ సమావేశాలకు సంబంధించిన వివరణలలో ఒకటి కోవిడ్‌-19 మహమ్మారి. ఒక్కో సెషన్‌ ముందుగానే రద్దు కావటానికి వేర్వేరు కారణాలున్నాయి. ఐదేండ్లలో, పార్లమెంటు 2020లో అత్యల్ప రోజులు (మొత్తం 33) సమావేశమైంది. 17వ లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ లేకుండా తొలిసారిగా పని చేసింది. ఇది రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన స్థానం. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 93 ప్రకారం వీలైనంత త్వరగా లోక్‌సభ స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌లను ఎన్నుకోవాలి. కానీ, అలా జరగకపోవటం గమనార్హం.
మోడీ ప్రభుత్వం ఎలాంటి చర్చా లేకుండానే చాలాసార్లు హడావుడిగా బిల్లులు ఆమోదింపజేసుకుంటున్నదని ప్రతిపక్షాలు తరచూ విమర్శిస్తున్నాయి. గణాంకాలు సైతం ప్రతిపక్షాల వాదనకు మద్దతుగా కనిపిస్తున్నాయి. 58 శాతం బిల్లులు ప్రవేశపెట్టిన రెండు వారాల్లోనే ఆమోదించబడ్డాయి. జమ్మూకాశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు, 2019, మహిళా రిజర్వేషన్‌ బిల్లు, 2023 ప్రవేశపెట్టిన రెండు రోజుల్లోనే ఆమోదించబడ్డాయి. లోక్‌సభలో గంట కంటే తక్కువ చర్చతో 35 శాతం బిల్లులు ఆమోదం పొందాయి.
రాజ్యసభలో ఇది 34 శాతంగా ఉన్నది. 16 శాతం బిల్లులు మాత్రమే పరిశీలన కోసం పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీలకు పంపబడ్డాయి. ఇది మునుపటి మూడు లోక్‌సభలకు సంబంధించిన గణాంకాల కంటే తక్కువ కావటం గమనార్హం.
17వ లోక్‌సభలో 729 ప్రయివేటు బిల్లులు (పీఎంబీ) ప్రవేశపెట్టబడ్డాయి. ఇది 16వ లోక్‌సభ మినహా మునుపటి అన్ని లోక్‌సభల కంటే ఎక్కువ. అయితే వాటిలో రెండు మాత్రమే చర్చకు వచ్చాయి. రాజ్యసభలో 705 పీఎంబీలు ప్రవేశపెట్టబడ్డాయి. ఇందులో 14 చర్చకు వచ్చాయి

Spread the love