కలలు కనడం చాలా సులభం. వాటిని సాకారం చేసుకోవడమే కష్టం. కానీ కొద్దిమందే తమ కలలని సాకారం చేసుకొని.. ప్రగతిబాటలో నడుస్తారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే కేరళకి చెందిన మహ్మద్ యాసిన్. పేపర్ బాయ్ గా జీవితాన్ని ఆరంభించిన యాసిన్ ఆ తరువాత డెలివరీ బాయ్ గా మారాడు. అదే యువకుడు కేరళ జ్యుడిషియల్ సర్వీస్ ఎగ్జామ్‌లో రెండో ర్యాంకు సాధించి మెజిస్ట్రేట్‌గా నియమితుడయ్యాడు. యువతకు మార్గదర్శకుడిగా నిలుస్తున్నాడు. ఈ లక్ష్యం సాధించడం వెనుక ఆయన ఎన్నో అవరోధాలు అధిగమించారు. అవమానాలు భరించారు. అతని గురించి చెప్పుకోవాలంటే ‘విలయూర్ పేపర్ బాయ్’గా అతని జీవితం మొదలైన దగ్గర నుండి తెలుసుకోవాలి.
యాసిన్‌కి మూడేండ్లప్పుడే తండ్రి కుటుంబం నుండి దూరంగా వెళ్లిపోయాడు. తమ్ముడిని, తనని ఆశా వర్కర్ అయిన తల్లే పెంచి, పోషించింది. ఒంటరి తల్లి పెంపకంలో సమాజం అతన్ని చిన్నచూపు చూసింది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. తల్లి కష్టం చూడలేని యాసిన్ కుటుంబం కోసం ఏడేళ్ల నుండే పనులకు వెళ్లేవాడు. సౌకర్యాలు పొందడం, లగ్జరీగా ఉండడం చిన్నారి యాసిన్‌కి అస్సలు తెలియదు. పేపర్‌బాయ్ గా, పాలబ్బాయిగా, నిర్మాణరంగ కూలీగా, పెయింటర్‌గా, ఫుడ్ డెలివరీ బాయ్ గా ఏ పని ఉంటే ఆపనికి వెళ్లడం అతని దినచర్యగా ఉండేది.
‘అమ్మ మమ్మల్ని చాలా కష్టాలు పడి పెంచింది. కానీ అందరూ మమ్మల్ని చులకనగా చూసేవారు. సరిగ్గా పెరగడం లేదని అవమానించేవారు. మా ప్రతి కదలికను ఎగతాళి చేసేవారు. అవమానాలే నా పెట్టుబడి. పేదరికం కారణంగా స్కూల్లో కూడా అవమానాలు ఎదుర్కొన్నాను. సరిగ్గా చదవడం లేదని చాలాసార్లు తరగతి గది నుండి బయటికి పంపేశారు. నా వ్యక్తిగత పరిస్థితులు నా చుట్టూ ఎన్నో విషమపరిస్థితులను తీసుకొచ్చాయి’ అంటాడు యాసిన్. మొదట్లో సాధారణ విద్యార్థిగా ఉన్న యాసిన్ నెమ్మదిగా చదువుపై దష్టిపెట్టాడు. ఇతరుల నుంచి పాత పుస్తకాలు సేకరించి చదువుకునేవాడు. అలాగే ఇతరులిచ్చే పాత దుస్తులు ధరించేవాడు. రోజులో ఏది దొరికితే దానిని తిని కడుపునింపుకునేవాడు. ఇలా పనిచేస్తూనే 12వ తరగతి పూర్తిచేసిన యాసిన్ ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా కోర్సులో చేరేందుకు షోరనూర్‌లోని పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్ తీసుకున్నాడు. ఈ కోర్సు పూర్తయ్యాక స్టేట్ లా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గురించి విని, దానికి ప్రిపేర్ కావాలని నిర్ణయించుకున్నాడు. యాసిన్ 46వ ర్యాంక్‌తో కేరళలోని ఎర్నాకులంలోని ప్రతిష్టాత్మక ప్రభుత్వ న్యాయ కళాశాలలో ప్రవేశం పొందాడు. ఈ సమయంలో రాత్రి 2 గంటల వరకు ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేశాడు. ప్రతికూలతలనే సానుకూలతలుగా మలచుకుని యాసిన్ విద్యాభ్యాసం పూర్తిచేశారు.
లా మొదటి సంవత్సరం కంటే రెండో ఏడాది నుండి మెరుగైన ప్రతిభతో రాణించారు. యూనివర్శిటీ టాపర్లలో ఒకరిగా నిలిచారు. ఎల్‌ఎల్‌బి పూర్తిచేసిన తరువాత 2023 నుండి లాయర్‌గా అద్భుత ప్రదర్శన కనబరిచారు. ‘అవుట్ స్టాండింగ్ లాయర్’ అవార్డు అందుకునేంతగా ఆయన పనితీరు ఉండేది.
‘నా ఉన్నత చదువంతా సెకండ్ హ్యాండ్ బుక్స్‌తోనే సాగింది. ఇతరులు వాడేసిన బట్టలనే కట్టుకునేవాడిని. మసీదు వాళ్లు దానం చేసిన బియ్యం, పప్పులతోనే మా రోజు గడిచేది. ఇలాంటి పరిస్థితుల్లో నాకు సాయంగా నిలబడిన ప్రతి ఒక్కరికీ నేను రుణపడి ఉంటాను. నా సీనియర్ అడ్వకేట్ సాహుల్ హమీద్ ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోను. ఆయన తన ఆఫీసులో నాకు చోటిచ్చారు. ఆ వెసులుబాటు నాకు ఎన్నో మెట్లు పైకి ఎదగడానికి సాయం చేసింది’ అని తన ప్రయాణంలో చేయూతనిచ్చిన ప్రతిఒక్కరినీ యాసిన్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. లాయర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టిన రెండో ఏడాదే మెజిస్ట్రేట్‌గా నియమితులవ్వడం సాధారణ విషయం కాదు. ఎంతో కఠోరదీక్ష కావాలి. ఈ కల చాలామందికి ఉంటుంది. కానీ యాసిన్ లాంటి వారు మాత్రమే దాన్ని చేరుకుంటారు. అయితే ఈ విజయం పట్ల యాసిన్ ఏమనుకుంటున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ‘ఇక్కడితో నా గమ్యం పూర్తవ్వలేదు. జీవితం ఎన్నో సవాళ్లని మన ముందుంచుతుంది. అయితే నేను బలంగా ఒక్కటి నమ్ముతాను. నిన్నటి కంటే ఈ రోజు చాలా బాగుంటుంది’ అంటున్న యాసిన్ ‘అణగారిన వర్గాల కోసం పనిచేస్తాన’ని ప్రతిజ్ఞ చేశారు. ‘ఎన్నో సవాళ్ల మధ్య జీవించిన నేను వారి బాగు కోసం నిరంతరం కష్టపడతాను’ అంటున్నారు.
యాసిన్ మీడియాతో మాట్లాడుతూ ‘నేను 12వ తరగతిలో ఫెయిల్ అయి, చదువు మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా పట్టుదల వీడక 12వ తరగతి పాస్ అయ్యాను. నేను మలయాళం మీడియం స్కూల్‌లో చదవడంతో ఇంగ్లీషులో చదవడం ఇబ్బందిగా అనిపించేంది. పట్టుదలతో ఈ సమస్యను కూడా అధిగమించాను’ అని తెలిపారు. యాసిన్ 2023 మార్చిలో న్యాయవాదిగా బార్ కౌన్సిల్‌లో తన పేరు నమోదు చేయించుకున్నారు. తరువాత పట్టాంబి మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో న్యాయవాది షాహుల్ హమీద్ దగ్గర పని చేశారు. ఈ సమయంలోనూ యాసిన్ వార్తాపత్రికలు విక్రయించడం, డెలివరీ బారుగా పనిచేయడాన్ని మానలేదు. యాసిన్ తనకు 29 ఏళ్ల వయసు వచ్చే వరకూ జీవితంతో పోరాడుతూనే వచ్చాడు. అయితే ఇదే సమయంలో తాను జడ్జి కావాలనుకున్న కలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ వచ్చాడు. ఎట్టకేలకు యాసిన్ తాను అనుకున్న విధంగా జడ్జిగా మారి, పదిమందికి స్ఫూర్తిగా నిలిచారు.
– అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417