ప్రతి గాయాన్ని గేయంగ
పురాణ గానాలుగ
మౌన వ్రతాలుగ
అప్పగింతల వంతనలుగ
కూడా పాడుకునే
స్త్రీలు కదూ
సహనంలో మిమ్ము
మించి లేరెవరు మరి !!
శారీరక బలాన్ని మించిన
మనోధైర్యంతో సాగి
నాడు వనారణ్యంలో
నేడు నాగరికతారణ్యంలో
అన్నింటా మేమే నంటూ
పరిగెత్తే మహిళలు కదూ
పురుషుని కంటే ఎక్కువ కాక
ఏమవుతారు మరి !!
ఎన్ని తరాలు కన్నారు
ఎన్నెన్ని వంశాలు పెంచారు
ఐనా మీకు ఇంటిపేరు ఎందుకని
అంతకుమించిన ప్రకృతివని
ప్రత్యేకంగ నిలిపిన
మాతలు కదూ
వికృతి కంటే ప్రకృతి ఎక్కువ
కాక ఏమవుతుంది మరి !!
జ్ఞానమనే దీపాన్ని ఆర్పుకొని
కొవ్వొత్తిలా కరిగిపోయే మీకు
మనోపూర్వక అనుభవాలు ఎందుకని
భౌతిక అలంకారానికి మాత్రం మిగిలిన
తనూలతలు కదూ
మకరందాన్ని, మాధుర్యాన్ని
అందించక
మీకు సాటి రాని వారి గురించి
పోటీ ఎందుకు
మీరెప్పుడూ ఎక్కువే మరి !!
మానం తీసేదొకరు
పరువు పోతుందని
ప్రాణం తీసేదొకరు
చివరకు మీ బొమ్మను చూపక
ప్రతిష్ట కాపాడేదొకరు
ఇన్ని యుద్ధాలు, వ్యాపారాలు
స్త్రీల గురించే జరిగాయంటూ
కితాబిచ్చేదొకరు ఐనా మీరు
స్థిర చిత్తంతో ఉండక
మీ ఉనికిని నిలబెట్టే
స్త్రీత్వాన్ని మరిచిపోయి కయ్యానికి
కాలు దువ్వడమెందుకు
నిరూపణ అవసరమే
లేని మీరు
ఎప్పటికీ ఎక్కువే మరి !!
దేశ కాలమాన వృద్దిలో
మిమ్ము సమిధను చేసి
కొలమానం లేని
సామర్థ్యం మీదని
ఏ జీతమిచ్చినా తక్కువేనని
కరణేషు మంత్రిగ పొగిడి
ఆదివారం కూడా సెలవెరుగని
కార్యేషు దాసిగ గణతికెక్కిన మీరు
వర్ణించలేనంత ఎక్కువే మరి !!
– మృదుల, 7093470828