
– తుది జాబితాలో ఉన్న వారి ఓట్లను యధావిధిగా ఉంచాలని నిరసన.
– తెలంగాణ లెక్చరర్ల ఫోరం అధ్యక్షుడు డాక్టర్ బాలు
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలో పనిచేస్తున్న అధ్యాపకుల, ఉపాధ్యాయుల టీచర్ ఎమ్మెల్సీ ఓట్లను తప్పుడు ఫిర్యాదుతో తొలగించడం జరిగిందని, తుది జాబితాలో ఉన్న ఓట్లను ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కేవలం తప్పుడు ఫిర్యాదు ఆధారంగా తొలగించడం సరికాదని తుది జాబితాలో ఉన్న వారందరినీ ఓటు వేయడానికి అనుమతించాలని, ఈ విషయమై కామారెడ్డి జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాలని తెలంగాణ లెక్చరర్ల ఫోరం జిల్లా అధ్యక్షులు డాక్టర్ బాలు అన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ మహేందర్ రెడ్డి పేరుతో తప్పుడు ఫిర్యాదు చేయడం జరిగిందని కొందరు ఎమ్మార్వోలు అవగాహన లోపంతో ప్రైవేటు అధ్యాపకులు ఉపాధ్యాయుల ఓట్లను తొలగించారని, అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు అందజేసి తుది జాబితాలో ఓట్లు వచ్చిన తర్వాత ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు, తప్పుడు ఫిర్యాదు చేసిన వారి పైన చర్యలు తీసుకోవాలని ప్రైవేటు ఉపాధ్యాయులు అధ్యాపకులు తమకు అనుకూలంగా ఓటు వేయరని దురుద్దేశంతో ఒక ఉపాధ్యాయ సంఘం వారు ఈ పనిని చేయడం వారి యొక్క అవివేకానికి నిదర్శనం అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నత విద్యావంతుల ఓట్లను తొలగించడం చాలా బాధాకరమని దీనిపైన జిల్లా అదనపు కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందని అర్హులైన వారందరి ఓట్లను యధాతధంగా ఉంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకుల సంఘం పట్టణ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, బీమా గౌడ్, రవి, శ్రీధర్ లు పాల్గొన్నారు.