పొగాకు సాగు వ్యయం పెరుగుతున్న దృష్ట్యా వచ్చే వ్యవసాయ సీజన్ కు పొగాకు సాగుకు ఇచ్చే ఋణ పరిమితిని రూ.9 లక్షలకు పెంచాలని పొగాకు రైతు సంఘం నాయకులు యూనియన్ బ్యాంక్ మేనేజర్ రాజేష్ తో పాటు పలు బ్యాంక్ ల మేనేజర్ లకు పొగాకు సాగు దారులు శుక్రవారం వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా పొగాకు రైతుసంఘం నాయకులు మాట్లాడుతూ ఉత్తర ప్రాంత తేలిక నేలలలో పొగాకు బోర్డు (భారత ప్రభుత్వం) అనుమతితో 14 వేల బ్యారెన్ లను నిర్మించి 40 వేల హెక్టార్లలో పంట సాగు చేస్తున్నామని, వీటిలో సుమారు 600 బ్యారెన్ లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయన్నారు.ప్రస్తుతం పొగాకు కు సరాసరి కేజీ ధర రూ.354 వద్ద ఉందని పొగాకు ఉత్పత్తి వ్యయం కూడా పెరుగుతుందని అది దృష్టిలో పెట్టుకొని ఒక్కో బ్యారెన్ కి రూ.9 లక్షలు రుణ సదుపాయం కల్పించాలని, బ్యాంకు ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పొగాకు రైతు సంఘం నాయకులు సత్రం వెంకటరావు, వీవీఎస్ ప్రకాష్ రావు, సుంకవల్లి వీరభద్రరావు,కోడూరి నాగేశ్వరరావు,సుంకవల్లి శంకర్ బాబు,వాగు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.