– చెన్నైలోని స్వగృహంలో స్వామినాథన్ కన్నుమూత
– పలువురు ప్రముఖుల సంతాపం
చెన్నై: హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త, జన్యు శాస్త్ర నిపుణుడు ఎంఎస్. స్వామినాథన్ (98) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం 11.20 గంటలకు చెన్నైలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆహార రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు, ఆకలిని, పేదరికాన్ని పారద్రోలేందుకు ఆయన ఎన్నో పరిశోధనలు చేశారు. అధిక దిగుబడిని అందించే వరి, గోధుమ వంగడాలను అందించి దేశానికి ఎంతో మేలు చేకూర్చారు. స్వామినాథన్ మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. స్వామినాథన్ 1925 ఆగస్ట్ 7న తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు. ప్రాథమిక విద్య, మెట్రిక్యులేషన్‌ను అక్కడే పూర్తి చేశారు. తండ్రి వైద్యుడు కావడంతో ఆయన కూడా వైద్య విద్యలోనే ప్రవేశించారు. అయితే 1943లో బెంగాల్‌లో సంభవించిన కరవు కాటకాలను చూసి చలించిపోయి వైద్య విద్యకు స్వస్తి చెప్పి, వ్యవసాయ రంగం వైపు అడుగులు వేశారు. త్రివేండ్రంలోని మహారాజా కళాశాలలో జువాలజీ కోర్సులో చేరి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత మద్రాసు వ్యవసాయ కళాశాలలో చేరి డిగ్రీ చదివారు. 1949లో ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ నుండి సైటో జెనెటిక్స్‌లో పీజీ చేశారు. ఆ తర్వాత నెదర్లాండ్స్ వెళ్లి అక్కడి వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బంగాళదుంపల జన్యువులపై పరిశోధనలు చేశారు. 1950లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన ప్లాంట్ బ్రీడింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి పీహెచ్‌డీ చేశారు. అంతేకాదు…విస్కాన్సిన్ వర్సిటీలోని జెనెటిక్స్ విభాగంలో పోస్ట్ డాక్టరల్ పరిశోధన చేశారు. 1954లో స్వదేశానికి తిరిగి వచ్చి భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో శాస్త్రవేత్తగా చేరారు. వ్యవసాయ పరిశోధనలకు సంబంధించి పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు ఆయన నేతృత్వం వహించారు. వాటి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలో జెనెటిక్స్ విభాగాన్ని, అణు పరిశోధనా ప్రయోగశాలను ఆయనే ఏర్పాటు చేశారు. ఫిలిప్పీన్స్‌లో అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ అధిపతిగా పనిచేశారు. దేశంలోని ఉష్ణ మండల ప్రాంతాల కోసం అంతర్జాతీయ పంటల పరిశోధనా కేంద్రం ఏర్పాటులో భాగస్వామి అయ్యారు. ఇటలీలో మొక్కల జన్యు వనరులకు సంబంధించి అంతర్జాతీయ బోర్డు ఏర్పాటులో, కెన్యాలో వ్యవసాయ-అటవీ భూములకు సంబంధించి అంతర్జాతీయ పరిశోధనా మండలి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. వరి, గోధుమ పంటలపై ఆయన చేసిన పరిశోధనల కారణంగా దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. తద్వారా దేశం హరిత విప్లవాన్ని సాధించింది. స్వామినాథన్ ఎన్నో పదవులను చేపట్టి వాటికి వన్నె తెచ్చారు. మరెన్నో పురస్కారాలు ఆయన్ని వరించాయి. 1972-1979 మధ్యకాలంలో భారత వ్యవసాయ పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్‌గా, 1979-1980లో కేంద్ర వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శిగా, 1982-1988 మధ్య అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. 2019-22 మధ్యకాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేశారు. 20వ దశాబ్దంలో ఆసియా ప్రజలను అధికంగా ప్రభావితం చేసిన వారితో టైమ్స్ పత్రిక రూపొందించిన జాబితాలో స్వామినాథన్ పేరును చేర్చారు. స్వామినాథన్ 1987లో చెన్నైలో తన పేరిట రిసెర్చ్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. 1967లో పద్మశ్రీ, 1972లో పద్మభూషణ్, 1989లో పద్మవిభూషణ్ అవార్డులు పొందారు. 1971లో రామన్ మెగసెసే అవార్డును, 1986లో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ప్రపంచ సైన్స్ అవార్డును అందుకున్నారు. 1987లో వ్యవసాయ పరిశోధనలో అత్యున్నత పురస్కారం ప్రపంచ ఫుడ్ అవార్డు ఆయనను వరించింది. 1989లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి, 2013లో ఇందిరాగాంధీ సమైక్యతా పురస్కారం లభించాయి. స్వామినాథన్‌కు ముగ్గురు కుమార్తెలు..సౌమ్య, మధుర, నిత్య…ఉన్నారు. ఆయన భార్య, విద్యావేత్త మీనా స్వామినాథన్ గత సంవత్సరమే కన్నుమూశారు.
ప్రముఖుల సంతాపం
స్వామినాథన్ మరణం తనను ఎంతగానో కలచివేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఆహార భద్రత కోసం ఆయన అలుపెరుగని కృషి చేశారని కొనియాడారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయంసమృద్ధి సాధించడంలో ఆయన పాత్ర మరువలేనిదని అన్నారు. స్వామినాథన్ మరణం పట్ల ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. దేశం క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు వ్యవసాయ రంగంలో ఆయన చేసిన కృషి లక్షలాది మంది జీవితాలను మార్చిందని, దేశానికి ఆహార భద్రతను కల్పించిందని కొనియాడారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వామినాథన్ మరణం పట్ల సంతాపం తెలిపారు. స్వామినాథన్ మృతి వ్యవసాయ రంగానికి తీరని లోటని రైతు సంఘాల నేతలు అన్నారు.
వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయింది : సీఎం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భారత హరిత విప్లవ పితామహుడు, ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, ఎంఎస్ స్వామినాథన్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఆయన మరణంతో దేశ వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయాధారిత దేశంలో మెజారిటీ ప్రజల జీవనాధారం, ప్రజల సాంస్కృతిక జీవన విధానం వ్యవసాయ రంగంతో ముడివడి ఉన్నదనే దార్శనికతతో, సాంప్రదాయ పద్దతిలో సాగుతున్న దేశీయ వ్యవసాయాన్ని స్వామినాథన్ వినూత్న పద్దతుల్లో గుణాత్మక దశకు చేర్చారని తెలిపారు. ఆహారాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించిందంటే అది ఆయన కృషితోనే సాధ్యమైందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశ ప్రజల ప్రధాన ఆహార వనరులైన వరి, గోధుమ తదితర పంటలపై స్వామినాథన్ చేసిన గొప్ప ప్రయోగాలతో దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించిందని తెలిపారు. స్వామినాథన్ కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మెన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు కె తారకరామారావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీష్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్‌కుమార్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజరు తదితరులు స్వామినాథన్ మరణం పట్ల తమ సంతాపాన్ని ప్రకటి ంచారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
దేశానికి తీరనిలోటు : సీపీఐ(ఎం)
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
భారత హరిత విప్లవ సారథి, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ (98) మరణం పట్ల సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సంతాపాన్ని ప్రకటించింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 1965 నుంచి 1985 వరకు భారతదేశంలో హరిత విప్లవాన్ని కొనసాగించి ఆహార ఉత్పత్తిలో దేశాన్ని స్వయంసమృద్ధం చేసిన శాస్త్రవేత్తగా స్వామినాథన్ పేరొందారని గుర్తు చేశారు. 1965లో స్వామినాథన్ ఆధ్వర్యంలో హరిత విప్లవం ప్రారంభించారని తెలిపారు. వరి, గోధుమల అధికోత్పత్తి వంగడాల వినియోగం ద్వారా విత్తనరంగంలో పెనుమార్పులు తెచ్చారని పేర్కొన్నారు. భూసంస్కరణల అమలుకు కృషి చేశారని వివరించారు. ఆహారధాన్యాల లోటుతో ఉన్న భారత్ 1985 నాటికి ఎగుమతుల దేశంగా మారిందని తెలిపారు. ఆహారధాన్యాలు ఎగుమతులు చేసే స్థితికి చేరామని పేర్కొన్నారు. హార్టికల్చర్ ఉత్పత్తులు కూడా ఎగుమతులు చేయగలిగామని వివరించారు. 1988లో ఎంఎస్ స్వామినాథన్ పరిశోధనా సంస్థ ప్రారంభించారని తెలిపారు. స్వామినాథన్ చైర్మెన్‌గా భారత ప్రభుత్వం 2004లో జాతీయ రైతుల కమిషన్‌ను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఆ కమిషన్ 2006లో నివేదిక సమర్పించిందని వివరించారు. ఆ నివేదిక ప్రకారం రైతుల పంటలకు ఉత్పత్తి వ్యయంపై 50 శాతం అదనంగా ధర నిర్ణయించాలనీ, వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించాలని సిఫారసులు చేసిందని తెలిపారు. కార్పొరేట్‌ల లాభాల కోసం బీజేపీ- ఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వం ఆ నివేదికను తొక్కిపెట్టిందని విమర్శించారు. వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చి, దేశ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని అహర్నిశలూ కృషి చేసిన శాస్త్రవేత్త స్వామినాధన్‌కు నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు.
వ్యవసాయ రంగానికి తీరనిలోటు : సీపీఐ
హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ మరణం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం వ్యవసాయ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆహారం కోసం ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి నుంచి భారతదేశం స్వావలంబన సాధించేందుకు ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు. వ్యవసాయ రంగ బలోపేతానికి, రైతు తన కాళ్లపై నిలబడేందుకు స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫారసులు ఎంతో ఉపయుక్తమైనవని పేర్కొన్నారు. వాటిని యథాతదంగా అమలు చేయడమే స్వామినాథన్‌కు ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు.