మారింది ప్రభుత్వమే.. విధానాలు కాదు!

The government has changed.. not the policies!”ప్రభుత్వాలను చూసి ప్రజలు భయపడకూడదు. ప్రజల్ని చూసి ప్రభుత్వాలు భయపడాలని” ఒక రచయిత చెప్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాత్రం ప్రభుత్వాన్ని చూసి ప్రజలు, కార్మికులు, ఉద్యమకారులు ఎవరైనా సరే, భయపడాల్సిందేనన్న తీరుగా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, పట్టించుకోకపోతే నిరసనలు తెలపడం ప్రజల కనీస హక్కు. ఈ హక్కును గత సర్కార్‌ అణిచివేసిందనే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. కానీ, గత పదిహేను నెలలుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాల్ని చూస్తే చెప్పిన నీతులకు, చేతలకు పొంతనేలేదని నిరూపితమైంది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన ధర్నాచౌక్‌ ఘటనలే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు,మేనిఫెస్టో అంశాల్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆశా, అంగన్‌వాడీ, గ్రామ పంచాయతీ, హమాలీ, ట్రాన్స్‌పోర్ట్‌, బీడీ, భవన నిర్మాణ, విద్యుత్‌ ఆర్టిజన్స్‌, మున్సిపల్‌, విఆర్‌ఏలు ఉద్యమబాట పట్టారు. అసెంబ్లీలో తమ సమస్యలపై చర్చకు వస్తే, దానికో పరిష్కారమార్గం దొరుకుతుందని ఆశపడ్డారు. కానీ ధర్నాలు, నిరసనలపై గత ప్రభుత్వంవలే రేవంత్‌ సర్కార్‌ కూడా ఉక్కుపాదం మోపడం ప్రజాస్వామ్య పునరుద్ధరణగా ఇచ్చిన ‘ఏడోగ్యారంటీ’ ప్రశ్నార్థకంగా మారింది.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. పనిప్రదేశంలో ఆరోగ్యకరమైన పరిస్థితులు కల్పించడం, ఉద్యోగ భద్రత, పనికి తగ్గ వేతనాలు చెల్లించడం, అక్రమ తొలగింపులు తదితర అంశాలపై కార్మిక చట్టాలు ఏర్పాటు చేసి హక్కులను పరిరక్షించేందుకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉంటుందని, మరింత మెరుగైన సేవలందించి కార్మికుల పక్షాన నిలుస్తుందని పదకొండవ అంశంగా స్పష్టంగా పేర్కొంది. దీంతో పాటు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అన్ని రంగాల్లో ఉన్న కార్మికులకు సమాన పనికి – సమాన వేతనం వచ్చేలా చర్యలు తీసుకుని, శ్రమ దోపిడీకి గురికాకుండా చర్యలు చేపడతామని చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగస్తులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జీతాలు చెల్లిస్తామని, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తామని హామీనిచ్చింది. అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం లాంటి స్కీమ్‌ వర్కర్లను కార్మికులుగా గుర్తిస్తామని, మున్సిపల్‌, గ్రామ పంచాయతీ, యూనివర్సిటీ, వైద్య ఆరోగ్య రంగాల్లో పనిచేసే వారికి వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని పేర్కొంది. భవన నిర్మాణ కార్మికుల బోర్డును పటిష్టం చేసి సామాజిక భద్రత కల్పిస్తామని, ఓనర్‌ కం డ్రైవర్‌ స్వయం ఉపాధి కోసం పని చేస్తున్న ఆటో డ్రైవర్‌కు రూ.50 వేలు వరకు, ఓనర్‌ కం డ్రైవర్‌ క్యాబ్‌ డ్రైవర్లకు రూ. లక్ష వరకు రుణమాఫీ చేస్తామని చెప్పింది. ఆటో అండ్‌ ప్రయివేటు డ్రైవర్స్‌ అండ్‌ వర్కర్స్‌ రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, హమాలీ కార్మికులకు సమగ్ర చట్టం రూపొందిస్తామని, బీడీ కార్మికులందరికీ రూ.2 వేల పెన్షన్‌ ఇస్తామని వివరించింది. బీడీ కార్మికులను ఈఎస్‌ఐ పరిధిలోకి తీసుకువస్తామని, ఎన్‌ఎంఆర్‌ డైలీవేజ్‌ కన్సాలిడేటెడ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు సమాన పనికి సమాన వేతనంతో సహా ఇతర చట్టబద్ధ హక్కులను అమలు చేస్తామని, ఇప్పటికే పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్‌ చేస్తామని పేర్కొంది. అసంఘటితరంగ కార్మికులకు నగరాల్లో, పట్టణాల్లో నివాస వసతి, వారు నివసిస్తున్న కాలనీల్లో, బస్తీల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించి వాటిని తక్షణం ప్రాధాన్యం ప్రాతి పదికన పూర్తి చేస్తామని పేర్కొంది. ఉద్యోగుల ఉద్యోగ భద్రత కోసం కొత్త చట్టాలు తెస్తామని, మహిళా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులను సాధ్యమైనంత వరకు నైట్‌ షిఫ్ట్‌లలో పనిచేయకుండా నియంత్రించాలని యాజమాన్యాలపై ఒత్తిడి తెస్తామని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ పీపుల్స్‌ మేనిఫెస్టోలో పేర్కొంది.
ఏడోగ్యారంటీపైనే ఉక్కుపాదం!
కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 15 నెలల కాలం గడిచింది. ఎన్నికల సందర్భంగా వారిచ్చిన హామీలు కాగితాలకే పరిమిత మయ్యాయి. ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు ఈ కాలంలో వివిధ రంగాల కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులిచ్చారు. ముఖ్యమంత్రి, మంత్రులకు దండాలు పెట్టారు. అయినా వారికి ఫలితం దక్కలేదు. వారి సమస్యల పరిష్కారానికి పోరాట మార్గాన్నే ఎంచుకున్నారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమం చేపట్టారు. ఆ ఆందోళనలను బాధ్యతాయుతంగా పరిశీలించి వారి డిమాండ్లను పరిష్కరిం చాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించింది. ఎన్నికల సందర్భంగా సోనియా గాంధీ ఆరు గ్యారంటీలకు హామీనిస్తే, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం వంటి ఏడో గ్యారంటీకి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హామీనిస్తున్నానని స్వయంగా ప్రకటించారు. 2023 డిసెంబర్‌ 7న ఒకవైపు ప్రమాణ స్వీకారం చేస్తూనే మరోవైపు ప్రగతి భవన్‌కు గత ప్రభుత్వం వేసిన ముండ్లకంచెలను కూలగొట్టిస్తూ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ప్రారంభమైందని ప్రకటించుకున్నారు. ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే అవి ఆదిలోనే అంతమైనట్లు కన్పిస్తున్నవి. 2025 మార్చి 21న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా హమాలీ, బీడీ, భవన నిర్మాణం, ప్రయి వేటు మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ తదితర అసంఘటితరంగ కార్మికులు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఈ ధర్నాకు అనుమతిస్తామని చెబుతూనే చివరి నిమిషంలో నిరాకరించారు. ఆరోజు రాత్రి రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు కార్మికుల ఇండ్లపై పడి అర్ధరాత్రి బలవంతంగా పోలీస్‌ స్టేషన్‌లకు లాక్కెళ్లారు. హైదరాబాద్‌ చేరుకున్న కొద్దిమందిని భయభ్రాంతులకు గురిచేశారు. ఇది అత్యంత అప్రజాస్వామిక చర్య. ఇది కార్మికుల హక్కులపై జరుగుతున్న దాడికి నిదర్శనం. ఈ ఘటన ముఖ్యమంత్రి గారు ఇటీవల రవీంద్రభారతిలో మీడియా సాక్షిగా మాట్లా డుతూ తమ పాలనలో ఉద్యోగులకు, కార్మికులకు, ప్రజలకు తమ సమస్యలను ప్రభుత్వానికి చెప్పుకునే హక్కును, స్వేచ్ఛను ఇచ్చామని, నాయకుల ఇండ్లకు వెళ్లి తలుపులు బద్దలు కొట్టి అరెస్టులు చేయడం తమ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకమని” చెప్పి ఒక్కరోజు కూడా గడవక ముందే జరగడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
అనుమతిలిస్తూ..అరెస్టులు చేస్తూ…
ఈ ఒక్క ఘటనే కాదు, ఇలాంటి ఘటనలు తెలంగాణలో అనేకం చోటుచేసుకున్నాయి. 2024 డిసెంబర్‌ 17న గ్రామ పంచాయతీ కార్మికులు ఇందిరా పార్కు వద్ద ధర్నా చేసుకునేందుకు పోలీసులు అనుమతిచ్చారు. కానీ ఇచ్చిన అనుమతిని అర్ధరాత్రి రద్దు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది పంచాయతీ కార్మికులను అక్రమంగా ముందస్తు అరెస్టులు చేశారు. రైతు సమస్యల మీద ఆందోళన చేసేందుకు అనుమతి కోరిన రైతు సంఘాలకు కార్యక్రమం నిర్వహణకు ముందు రోజు రాత్రి పొద్దుపోయిన తర్వాత అనుమతిచ్చారు. అప్పటికే రైతులను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లలో నిర్భంధించారు. విఆర్‌ఏలు ధర్నా చేసుకునేందుకు అనుమతి సైతం నిరాకరించారు. 2025 మార్చి 22న కేంద్ర కార్మిక సంఘాలు బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఇందిరా పార్కులో ధర్నాకు పిలుపునిచ్చిచ్చాయి. ఆ ధర్నాకు హైదరాబాద్‌లో అనుమతిచ్చి కొత్తగూడెం, ఇల్లందు, సంగారెడ్డి ప్రాంతాల్లో కార్మికులను అరెస్టులు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని, తమ గోడు ప్రభుత్వానికి విన్నవించుకోడానికి వచ్చిన ఆశాలను హైదరాబాద్‌ నడిరోడ్డుపై కర్కశంగా అణచివేశారు. పోలీసుల తోపులాటలో స్పృహ తప్పిపోయిన మహిళా కార్మికులకు వైద్య చికిత్స కూడా అందించలేదు. మార్చి 24న మధ్యాహ్న భోజనం కార్మికుల ధర్నాకు అనుమతిచ్చారు. కానీ ముందు రోజు మధ్యాహ్నం నుండే జిల్లాల్లో అరెస్టుల పర్వం కొనసాగించారు. రాష్ట్రంలో సీఎం ఏ జిల్లా పర్యటనకు వెళ్లినా అక్కడ సీఐటీయూ నాయకులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. రాష్ట్రమంతా అసెంబ్లీ జరిగిన వారం,పది రోజుల పాటు సీఐటీయూ నాయకులతో పాటు కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్టులు, గృహ నిర్భంధాలు చేశారు. రాష్ట్రమంతా అన్ని జిల్లాల్లో పోలీస్‌ యాక్ట్‌-30ని అమలు చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో సైతం ధర్నాలు, నిరసనలు నిషేధిస్తూ వైస్‌ చాన్స్‌లర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశాలన్నీ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
గతం నుంచి గుణపాఠం నేర్వరా?
గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి భిన్నంగా ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగిస్తానని చెప్పిన కాంగ్రెస్‌ ఆచరణలో గత ప్రభుత్వం లాగే కార్మిక పోరాటాలు, ఆందోళనలపై నిర్భంధం, ఆంక్షలు విధించడం దుర్మార్గం. రాజ్యాంగం ప్రకారం నిరసన తెలిపే హక్కు పౌరులుగా కార్మికవర్గానికి ఉంది. ప్రజాస్వామ్య హక్కులను గౌరవించడం ప్రభుత్వ బాధ్యత. ఈ విషయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కార్మికవర్గ పోరాటాల పట్ల వ్యవహరిస్తున్న తీరు మార్చుకోవాలి. ప్రస్తుతం కొనసాగుతున్న నిర్భంధాన్ని, ఆంక్షలను ఎత్తివేయాలి. గతంలో అంగన్‌వాడీ పోరాటాన్ని అణచివేసి, గుర్రాలతో తొక్కించి, లాఠీఛార్జీ చేయించిన టీడీపీ ప్రభుత్వాన్ని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపి నియంతృత్వ పాలన సాగించిన బీఆర్‌ఎస్‌ను కార్మికవర్గం గడగడలాడించి గద్దె దించిన చరిత్ర కార్మికవర్గ పోరాటాలకు ఉంది. ఈ చరిత్రను తెలుసుకోవాలి. గత పాలకుల నుండి గుణపాఠం నేర్చుకోవాలి. ప్రజా, కార్మికోద్యమాలను గౌరవించి సమస్యల్ని పరిష్కరించాలి. రేవంత్‌రెడ్డి సర్కార్‌ ఇకకైనా తీరు మార్చుకోవాలి. లేకపోతే కార్మికవర్గం ప్రభుత్వాన్నే మార్చగలదు. తస్మాత్‌ జాగ్రత్త!
పాలడుగు భాస్కర్‌
9490098033

Spread the love