అసెంబ్లీని గవర్నర్‌ వీటో చేయలేరు…

అసెంబ్లీని గవర్నర్‌ వీటో చేయలేరు...– బిల్లు ఆమోదిచకుంటే… తిరిగి అసెంబ్లీకి పంపాలి
–  ఎన్నికైన ప్రతినిధులదే నిజమైన అధికారం
–  రాష్ట్రం చేసే చట్టాన్ని ఆయన అడ్డుకోలేరు : సుప్రీంకోర్టు తీర్పు
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
బిల్లులకు ఆమోదాన్ని నిలిపివేయటం ద్వారా గవర్నర్‌ శాసనసభను వీటో చేయలేరని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒకవేళ బిల్లుకు ఆమోదాన్ని నిలుపుదల చేయాలని గవర్నర్‌ నిర్ణయించుకుంటే, ఆ బిల్లును పునర్విచారణ కోసం శాసనసభకు తిరిగి పంపాల్సి ఉంటుందని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 200 ఒక బిల్లుకు గవర్నర్‌ ఆమోదాన్ని నిలిపివేసిన తర్వాత తదుపరి చర్య ఏమిటనేది స్పష్టంగా పేర్కొనలేదనీ, కాబట్టి దీనిపై కోర్టు స్పష్టీకరణ ముఖ్యమైనదని తెలిపింది.
ఆర్టికల్‌ 200 ప్రకారం, బిల్లులపై గవర్నర్‌కు మూడురకాల చర్యలు ఉంటాయి. ఆమోదించడం, ఆమోదాన్ని నిలిపివేయడం లేదా రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లును రిజర్వ్‌ చేయడం. ఆర్టికల్‌ 200లోని నిబంధన ప్రకారం, గవర్నర్‌ పునర్విచారణ అవసరమయ్యే అంశాల సందేశంతో పాటు.. బిల్లును అసెంబ్లీకి తిరిగి పంపొచ్చు. సవరణలతో లేదా లేకుండా బిల్లును సభ మళ్లీ ఆమోదించినట్లయితే, అప్పుడు గవర్నర్‌ ఆమోదం పొందవలసి ఉంటుంది.
ఒకవేళ ఆమోదం నిలుపుదల చేస్తున్నట్టు ప్రకటిస్తే గవర్నర్‌ బిల్లును తిరిగి అసెంబ్లీకి పంపిస్తారా లేదా అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. తమిళనాడులో ఇటీవల ఈ పరిస్థితి తలెత్తింది. అక్కడ కొన్ని బిల్లులను గవర్నర్‌ ఆమోదం తెలపకుండా నిలిపివేశారు. గవర్నర్‌ ఆ బిల్లులను అసెంబ్లీకి తిరిగి పంపలేదు. బిల్లులపై తమిళనాడు గవర్నర్‌ ఆమోదం తెలపకపోవటంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. గవర్నర్‌ ఆమోదం నిలిపివేసిన తరువాత బిల్లును అసెంబ్లీకి తిరిగి పంపగలరా? లేదా అనే దానిపై సుప్రీంకోర్టు ఆలోచించింది.
పంజాబ్‌ గవర్నర్‌పై ఆ రాష్ట్రం దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు తన తీర్పు నిచ్చింది. ”ఆర్టికల్‌ 200 ప్రకారం ఆమోదాన్ని నిలిపివేయాలని గవర్నర్‌ నిర్ణయించినట్లయితే, బిల్లును పునర్విచారణ కోసం రాష్ట్ర శాసనసభకు పంపే మొదటి నిబంధనలో సూచించిన అంశాన్ని కొనసాగించాలి. మరో మాటలో చెప్పాలంటే, ఆర్టికల్‌ 200లోని మొదటి నిబంధన ప్రకారం గవర్నర్‌ స్వీకరించే చర్యను తప్పనిసరిగా అన్వేషించాలి” అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ జెబి పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం వెలువరించిన తీర్పులో పేర్కొంది. అటువంటి వివరణను స్వీకరించకపోతే, గవర్నర్‌ ఆమోదాన్ని నిలుపుదల చేస్తున్నట్టు చెప్పడం, శాసన ప్రక్రియను నిర్వీర్యం చేసే పరిస్థితి ఏర్పడుతుందని తీర్పు పేర్కొంది.
గవర్నర్‌ సింబాలిక్‌ హెడ్‌ మాత్రమే
గవర్నర్‌ సింబాలిక్‌ హెడ్‌ మాత్రమేనని, ఎన్నికైన ప్రతినిధులదే నిజమైన అధికారమని తీర్పులో పేర్కొంది. గవర్నర్‌ రాష్ట్రానికి ఎన్నుకోబడని అధిపతి అని, రాష్ట్రం చేసే సాధారణ చట్టాన్ని అడ్డుకోవడానికి ఆయన రాజ్యాంగ అధికారాలను ఉపయోగించలేరని కోర్టు పునరుద్ఘాటించింది. ”గవర్నర్‌, రాష్ట్రానికి ఎన్నికకాని అధిపతిగా, కొన్ని రాజ్యాంగపరమైన అధికారాలను అప్పగించారు. అయితే, రాష్ట్ర శాసనసభల సాధారణ చట్టాన్ని అడ్డుకోవడానికి ఈ అధికారాన్ని ఉపయోగించలేరు” అని తీర్పులో పేర్కొంది. ”పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు నిజమైన అధికారం ఉంటుంది. రాష్ట్రాలలో, కేంద్రంలోని ప్రభుత్వాలు రాష్ట్ర శాసనసభ సభ్యులు, సందర్భానుసారంగా పార్లమెంట్‌ సభ్యులను కలిగి ఉంటాయి. మంత్రివర్గం రూపంలో ప్రభుత్వం శాసనసభకు జవాబుదారీగా ఉంటుంది. రాష్ట్రపతి నియమించిన వ్యక్తిగా గవర్నర్‌ నామమాత్రపు రాష్ట్ర అధిపతి” అని తెలిపింది.

Spread the love