పంటను మిల్లులకు వేగంగా తరలించాలి
లారీల కొరతను తీర్చాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
వనపర్తి వ్యవసాయ మార్కెట్ సందర్శన
నవతెలంగాణ-వనపర్తి
”ఐకేపీ కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కాంటాలు వేయాలి.. ఆ పంటను వెంటనే అక్కడి నుంచి మిల్లులకు తరలించాలి.. ధాన్యం కొనుగోలులో సమస్యలను పరిష్కారం చేసి రైతులను ఆదుకోవాలి” అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. వనపర్తి వ్యవసాయ మార్కెట్‌ను బుధవారం సీపీఐ(ఎం) బృందం పరిశీలించింది. రైతులతో మాట్లాడారు. ధాన్యం కాంటాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు వచ్చి నెల రోజులవుతున్నా తూకం వేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వెంటనే తూకం చేసి మార్కెట్ నుంచి మక్కలు, ధాన్యాన్ని తరలించాలని డిమాండ్ చేశారు.
లారీల కొరత మూలంగా కాంటాలు వేసిన ధాన్యం లిఫ్టు చేయకపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోందన్నారు. రెండు, మూడు కిలోలు తరుగు తీస్తున్నారని, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్లు యజమానులు దిగుమతి చేసుకునే దగ్గర సమస్యలు సృష్టించి రైతాంగాన్ని నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు. ఐకేపీ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవని, సరిపడా గన్నీ బ్యాగులు అందుబాటులో లేవని అన్నారు. ధాన్యం కాంటా వేసే సందర్భంగా జరుగుతున్న మోసాలను అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అకాల వర్షాలు వస్తున్నందున ప్రభుత్వం తక్షణమే పంటల కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరారు.
ఈ సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామని ప్రకటించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడా సమస్యలు లేవని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంటున్నారని, కానీ తమరు ఒక్కసారి వచ్చి చూస్తే సమస్యలు ఉన్నాయో లేవో తెలుస్తుందని సూచించారు. కొనుగోలు కేంద్రంలో సమస్యలపై జాన్‌వెస్లీ ఆర్‌డీఓతో ఫోన్‌లో మాట్లాడి వివరించారు. అందుకు స్పందించిన ఆయన సమస్యను వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.బాల్ రెడ్డి, జీఎస్ గోపి, మండ్ల రాజు, నాయకులు బాల్య నాయక్, ఎం.ఆంజనేయులు, ఉమాలి తదితరులు ఉన్నారు.



