తల్లికి తెలియకుండా రూ1.5 లక్షలకు విక్రయం
బిడ్డ మృతిచెందినట్టు చెప్పిన నర్సులు
మెదక్ కేర్ ఆస్పత్రిలో దారుణ ఘటన
నలుగురికి రిమాండ్.. ఆస్పత్రి సీజ్
నవతెలంగాణ- మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్లిన ఓ మహిళకు ఆడశిశువు జన్మించగా.. తల్లికి తెలియకుండా పసికందును అమ్మేశారు. బిడ్డ మృతిచెందిందని నర్సులు మాయమాటలు చెప్పి విక్రయించిన ఘటన మెదక్ జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెదక్ పట్టణ సీఐ మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. పాపన్నపేట మండలం లక్ష్మీనగర్ తండాకు చెందిన నస్రా ఫాతిమా సికింద్రాబాద్‌లోని మౌలాలిలో నివాసం ఉంటున్నారు. ఈమె 7 నెలల గర్భిణి కాగా, గత నెల 12న తల్లిగారింటికి వెళ్లేందుకు మెదక్ వచ్చారు. ఆ సమయంలో చేతిలో చిప్స్ ప్యాకెట్ ఉండటంతో కోతులు ఆమెపై దాడి చేయగా, కింద పడటంతో రక్తస్రావమైంది. దాంతో ఫాతిమా తన వెంట ఉన్న స్నేహితురాలు పర్వీన్‌బేగం సాయంతో స్థానిక మార్కెట్ యార్డు కమాన్‌కు ఎదురుగా ఉన్న కేర్ ఆస్పత్రిలో చేరింది. మరుసటి రోజు ఆస్పత్రిలో వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స చేయగా, 2.4 కిలోల బరువున్న ఆడపిల్ల పుట్టింది.
అయితే, ఆ పసికందును తల్లికి తెలియకుండానే గుట్టు చప్పుడు కాకుండా విక్రయించారు. బిడ్డ కడుపులోనే మృతిచెందినట్టు నర్సులు నమ్మించారు. ఆ తర్వాత ఆస్పత్రి సిబ్బంది ద్వారా పుట్టిన బిడ్డ బతికే ఉన్నట్టు తెలుసుకున్న తల్లిదండ్రులు యాజమాన్యాన్ని నిలదీశారు. పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో శిశువిక్రయ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సు నౌసిన్ ఉన్నీస మెడికల్ చెకప్ పేరిట నిలోఫర్ ఆస్పత్రికి బిడ్డను తీసుకెళ్లి మళ్లీ తీసుకు రాలేదు. పసికందును సిద్దిపేటకు చెందిన మహమ్మద్ ఇక్బాల్- అక్తరి బేగంకు రూ.1.50 వేలకు విక్రయించింది. ఆ తర్వాత ఆస్పత్రికి వచ్చిన నర్సు.. బాధితులతో ప్రసవానికి ముందు బ్లీడింగ్ ఎక్కువగా కావడం వల్ల పుట్టిన బిడ్డ మృతిచెందినట్టు నమ్మించింది. విషయం బయటపడటంతో పోలీసులు విచారణ చేపట్టారు. బిడ్డను కొనుగోలు చేసిన వారితోపాటు నర్సులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పసికందును తల్లికి అప్పగించారు. ఆస్పత్రిలో శిశు విక్రయం ఘటనను జిల్లా కలెక్టర్ సీరియస్‌గా తీసుకున్నట్టు తెలిసింది. పోలీస్‌లు కేవలం నలుగురిపై కేసు నమోదు చేసినట్టు తెలియడంతో వెంటనే జిల్లా వైద్యాధికారితో ఆస్పత్రిని సీజ్ చేయించారు.
ప్రసవానికి వస్తే పుట్టిన శిశువును అమ్మేశారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



