Friday, June 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రొఫెసర్‌ కె నాగేశ్వర్‌‌పై విద్వేష దాడి సరికాదు

ప్రొఫెసర్‌ కె నాగేశ్వర్‌‌పై విద్వేష దాడి సరికాదు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రొఫెసర్‌ ‌కె.నాగేశ్వర్‌ ‌తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నా ఆయనపై సోషల్‌‌మీడియా వేదికగా, రాజకీయంగా విద్వేషపూరిత దాడి చేయడం, కేసులు పెట్టించడం సబబు కాదనీ, ఈ వివాదానికి ఇక్కడితో ముగింపు పలకాలని పలువురు వక్తలు కోరారు. భావప్రకటనా స్వేచ్ఛను పరిరక్ష‍ించాలనీ, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య సామరస్య వాతావరణం పరిఢవిల్లాలని ఆకాంక్ష‍ించారు. గురువారం హైదరాబాద్‌‌లోని బషీర్‌‌బాగ్‌ ‌ప్రెస్‌‌క్లబ్‌‌లో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌‌టేబుల్‌ ‌సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్ష‍తన జరిగిన ఈ రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ‌బి.సుదర్శన్‌‌రెడ్డి మాట్లాడుతూ.. అందరితోనూ రాజ్యాంగ పీఠికను చదివించారు. భావప్రకటనా స్వేచ్ఛ లేకపోతే ప్రజాస్వామ్య మనుగడే సాధ్యం కాదని చెప్పారు. ప్రజాస్వామ్యం ఎప్పుడూ భిన్నాభిప్రాయాలను ప్రోత్సహిస్తుందనీ. అభిప్రాయాన్ని చెప్పే హక్కును కాపాడటం సమాజం బాధ్యత అని స్పష్టం చేశారు. పత్రికలకు, విశ్లేషకులకు అందే సమాచారాన్ని విశ్లేషించే హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)(ఎ) కల్పించిందనీ, ‘ఎవరు చెప్పారు?‘ అని అడగడానికి ఎవరికీ హక్కు లేదని తెలిపారు. ఎవరూ ప్రశ్నించకుండా చేయాలనే ఉద్దేశంతోనే నాగేశ్వర్‌‌పై కేసులు పెట్టినట్టు ఉందని విమర్శించారు.

సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య మాట్లాడుతూ..ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ అంశం ఆంధ్రా-తెలంగాణ పంచాయితీ కాదనీ, మీడియా స్వేచ్ఛకు సంబంధించిన విషయమని తెలిపారు. ప్రాంతీయ విభేదాలను మళ్లీ రగల్చడం ద్వారా ఇక్కడి ఓట్లను చీల్చి రాజకీయ లబ్ధి పొందాలనే బీజేపీ ఎత్తుగడ దీని వెనుక ఉన్నట్టు కనిపిస్తోందనీ, ఆ ఎజెండాలో పవన్‌‌కళ్యాణ్‌ ఒక పాచికగా మారారని విమర్శించారు. ఒక రాష్ర్టానికి డిప్యూటీ సీఎం అయి ఉందని నీ అయ్య జాగీరా అనే పదం వాడొచ్చా? అని ప్రశ్నించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒక విజ్ఞాన ఖని లాంటివారనీ, ప్రజా గొంతుకైన ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సాంబశివరావు చెప్పారు. పవన్‌‌కళ్యాణ్‌ కమ్యూనిస్టులపై విమర్శలు చేయడం తగదన్నారు. తెలంగాణ సమాజం అందరినీ ప్రేమిస్తుందనీ, ఇక్కడి అస్థిత్వంపై దాడి చేస్తే ఊరుకోదని హెచ్చరించారు.

ఎమ్మెల్సీ, ప్రొఫెసర్‌, టీజేఎస్‌ అధ్యక్ష‍ులు ఎం. ‌కోదండరామ్‌ మాట్లాడుతూ..భావప్రకటనా స్వేచ్ఛను గౌరవించడం ప్రజాస్వామ్య సమాజానికి అత్యవసరమన్నారు. నాగేశ్వర్‌ ‌వ్యాఖ్యలపై అభిప్రాయ భేదాల పేరుతో దాడులకు దిగడం అన్యాయం, అనాగరికం అని విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ..పవన్‌ కళ్యాణ్‌ తెలంగాణకు రావడాన్ని ఎవరూ వ్యతిరేకించడంలేదనీ, అయితే తెలంగాణ ఉద్యమకారుల మనోభావాలను గౌరవించడం ఆయన బాధ్యత అని ‌చెప్పారు. నాగేశ్వర్‌ అంశాన్ని అడ్డంపెట్టుకుని రాజకీయ ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు ప్రేమ, సహనానికి ప్రతీకలని, ద్వేష రాజకీయాలకు తావివ్వకూడదని అన్నారు. జనసేనతో సహా అన్ని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య పద్ధతుల్లో రాజకీయాలు చేయాలని సూచించారు. వివాదాస్పద వ్యాఖ్యలు, పరస్పర ఆరోపణలకు ముగింపు పలకాలని కోరారు. సీనియర్‌ ‌జర్నలిస్టు కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ..ప్రాంతీయవాదాన్ని జాతీయ భద్రతా సమస్యగా ఉగ్రవాదంతో పోల్చుతూ పవన్‌‌కళ్యాణ్‌ వ్యాఖ్యలు ‌చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ప్రజల మధ్య అనవసర వైరుధ్యాలను సృష్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రాజకీయ విశ్లేషకులు, జర్నలిస్టులను రాజకీయ ప్రత్యర్థులుగా భావించి లక్ష్యంగా చేసుకోవడం ప్రమాదకర ధోరణి సరిగాదన్నారు. ప్రొఫెసర్‌ ‌కె.నాగేశ్వర్‌ ‌మాట్లాడుతూ.. ప్రజాసమస్యలను పక్కనబెట్టి తన చుట్టూ టీవీ ఛానళ్లు చర్చ పెట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టులు కొట్టేసిన సెక్షన్లను తనపై ప్రయోగించారని ఆవేదన వ్యక్తం చేశారు. పదవుల కోసమో, ప్రలోభాల కోసమో మాట్లాడే వ్యక్తిని కాదనీ, తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు, పెన్నులో సిరా ఇంకే వరకు ప్రజల పక్ష‍ాన మాట్లాడటం, రాయటం చేస్తూనే ఉంటానని నొక్కి చెప్పారు. సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు సాధినేని వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎంఎల్‌) మాస్‌ లైన్‌ నాయకులు రమ మాట్లాడుతూ నాగేశ్వర్‌పై పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్య వాతావరణాన్ని కాపాడుకోవడానికి, రాజ్యాంగ పరిరక్షణకు తెలుగు నేలపై అందరూ కలిసికట్టుగా ఉద్యమించాలని కోరారు. సమావేశంలో సీపీఐ కేంద్ర కమిటీ సభ్యులు పశ్యపద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శులు టి.శ్రీనివాసరావు, ఈ.టి.నరసింహా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వీ.ఎస్‌.బోస్‌, సీపీఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి బి.స్టాలిన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -