పంట వ్యర్థాల కాల్చివేతపై ఉదాసీనత సరికాదు
కోహెడ పండ్ల మార్కెట్ శంకుస్థాపన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి : మంత్రి తుమ్మల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు(ఎల్‌నినో) తలెత్తే అవకాశమున్న నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించి సన్నద్ధం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ..సీఎం ఆదేశాల మేరకు ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించాలని సూచించారు. తక్కువ నీటితో సాగు చేయగల పంటలు, వర్షాభావాన్ని తట్టుకునే పంటలు, ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల నేల సారం దెబ్బతినడంతో పాటు పర్యావరణ కాలుష్యం పెరుగుతుందన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో పంట వ్యర్థాల కాల్చివేతలకు సంబంధించిన శాటిలైట్ చిత్రాల విషయాన్ని ప్రస్తావిస్తూ ఇదే విధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి శాటిలైట్ ఆధారిత నివేదికలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కోహెడలో రూ.2,284.32 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్‌కు ఈ నెల ఆరో తేదీన సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. కోహెడ మార్కెట్ మార్కెటింగ్ రంగానికి మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సభా ఏర్పాట్లను త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖ పరిధిలోని ఖాళీ స్థలాల పరిరక్షణ కోసం నెల వ్యవధిలో ఐఏఎస్ అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలనీ, ఆస్తుల పరిరక్షణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. వాటిని లీజుకిచ్చి ఆదాయ వనరులు సమకూర్చుకునే అవకాశాలను పరిశీలించాలని, అది సాధ్యంకాని చోట్ల విస్తృత స్థాయిలో ప్లాంటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఫెర్టిలైజర్ యాప్ పనితీరును కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ మరోసారి ప్రశంసించిందన్నారు. భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో ఈ యాప్ అమలు దిశగా చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించిందన్నారు. యాప్‌ను సమర్థవంతంగా అమలు చేస్తే రాష్ట్రానికి ప్రోత్సాహకాలు కూడా అందజేస్తామని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ హామీ ఇచ్చిందని తెలిపారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, హార్టికల్చర్ ఎమ్‌డీ యాస్మిన్ బాషా, ఆగ్రోస్ ఎమ్‌డీ రాములు పాల్గొన్నారు.



