జ్యోతిబాఫూలే తండ్రి గోవిందరావు జ్యోతిబాను మహారాష్ట్రలోని పూణే పాఠశాలలో చేర్చడానికి వెళ్లారు. అక్కడి బ్రాహ్మణ గుమాస్తా జ్యోతిబాకు ప్రవేశం ఇవ్వలేదు. శూద్రులకు చదువు నిషేధమన్నాడు. జ్యోతిబా కాలం బ్రాహ్మణులు తప్ప ఇతర కులాలవారు చదువు సంధ్యలను ఆశించే కాలం కాదు. పంతొమ్మిదవ శతాబ్దం నుండి బ్రాహ్మణ అధ్యాపకులు బ్రాహ్మణేతరుల చదువును కుతంత్ర పద్ధతులతో నిరుత్సాహ పరిచేవారు. వారిని చదువు మాన్పించేవారు. అధికసంఖ్యాక కింది కులాలవారు చదువుకుంటే బ్రాహ్మణుల ఉద్యోగా వకాశాలు తగ్గుతాయని వారి ఉద్దేశం. ఢాక్జి దాదాజి ప్రభు అనే సంప్రదాయవాద నాయకునికి బాంబే నేటివ్ ఎడ్యుకేషన్ సొసైటీలో పలుకుబడి ఉండేది. ఆయన కింది కులాల పిల్లలను బడుల నుండి తొలగించాడు. చదువులు మనిషిని నాస్తికులుగా మారుస్తాయి. తిరగబడేటట్లు చేస్తాయి. అని ప్రచారం చేసేవారు. హిందు పురాణాల ప్రకారం శూద్రులు చదువుకోడం పాపం. బ్రాహ్మణులు తమ పాఠశాలల్లో సొంత కులస్తులకే సంస్కృతంలో చదువు చెప్పేవారు. దేవతల కథలు, పుక్కిటి పురాణాల రాతప్రతులే పుస్తకాలు. వాటిని రాజుల ప్రోత్సాహంతో పురుష బ్రాహ్మణులు రాసేవారు. బ్రాహ్మణులకే ఈ పుస్తకాలను చదివే అర్హత. ఇతరులు చదివితే తీవ్రంగా శిక్షించేవారు. ఉపాధ్యాయుల ఇళ్లలో, గుళ్లలో బడులు నడిపేవారు. భూస్వాములు తమ పిల్లల కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించుకునేవారు. కొందరు పేద పిల్లలను అక్కడ చదువుకోడానికి అనుమతించేవారు. ముస్లిం లకు మరాఠీ, ఆంగ్ల భాషల్లో ఆసక్తి ఉండేది కాదు. తక్కువ సంఖ్యలోనైనా వారికి ఉర్దూ పాఠశాలలుండేవి. దళితుల, వెనుకబడిన కులాలవారి పిల్లలకు ప్రత్యేక పాఠశాలలు లేవు. హిందువుల బడులకు ఈ పిల్లలను రానివ్వరు. అరుదుగా రానిచ్చినా ఈ పిల్లలను వేరుగా కూర్చోబెట్టేవారు. పలు సందర్భాల్లో ఒక తరగతిలో ఒక పిల్లవాడే ఉండేవాడు. పైతరగతి విద్యార్థులు కింది తరగతి పిల్లలకు చదువు చెప్పేవారు.
ఈ నేపథ్యంలో శూద్రుల, అతిశూద్రుల విముక్తికి విద్య ఆయుధమని జ్యోతిబా గుర్తించారు. నిచ్చెనమెట్ల కులవ్యవస్థ, అమాయకత్వ, పేదరికాల నిర్మూలన, సమానత్వ సాధనకు విద్యా వ్యాప్తి ద్వారా కృషిచేశారు. తన శ్రీమతి సావిత్రిబాయికి చదువు చెప్పారు. ఉన్నత చదువులు చెప్పించారు. చదువుల తల్లిగా మార్చారు. సావిత్రిబాయి భారతంలో 17 ఏళ్ల వయసులో ఉపాధ్యాయిని అయిన తొలి స్త్రీ. చిన్న వయసులో ప్రధాన ఉపాధ్యాయురాలయ్యారు.బాలికలకు, స్త్రీలకు పాఠశాల ప్రారంభించిన తొలి భారతీయుడు జ్యోతిరావు. జ్యోతిబా విజయాల వెనుక సావిత్రిబాయి అవిరళ కృషి ఉంది. ఈ పాఠశాలలో, బ్రాహ్మణ బడుల వలె వేదపురాణాలు గాక, పాశ్చాత్య పాఠ్యాంశాలు, గణితం, విజ్ఞాన భౌగోళిక సాంఘిక మానవవికాస శాస్త్రాలు, చరిత్ర, కళలు, వ్యాకరణం, చిత్రలేఖనం బోధించేవారు. విద్యాహక్కు చట్టం, ఉపకార వేతనాలు, మధ్యాహ్న భోజనం తమ నూతన పథకాలుగా నేటి ప్రభుత్వాలు ప్రకటించుకున్నాయి. కానీ 170 ఏండ్ల క్రితమే ఫూలే దంపతులు విద్యా హక్కు గురించి ప్రచారం చేశారు. దాని అమలుకు ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చారు. బడి మానే పిల్లలను తగ్గించడానికి విద్యార్థులకు భోజనవసతి, గృహవసతి కల్పించారు. విద్యార్థి వేతనాలు ఇచ్చారు. పోషకాహార లోపాలను అరికట్టడానికి పిల్లలకు సమతులాహారం అందించారు. ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టారు. బడుల్లో గ్రంథాలయాలను స్థాపించారు. వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ముక్తా సాల్వే అన్న దళిత బాలిక దళిత సాహిత్యం, దళిత స్త్రీవాదం మొదలగు అంశాలపై వ్యాసాలు రాసింది. విద్యా ప్రాముఖ్యత గురించి తల్లిదండ్రులను చైతన్యపరచడానికి, క్రమంతప్పక పిల్లలను బడికి పంపేటట్లు ప్రోత్సహించడానికి తరచుగా తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశాలు జరిపేవారు. సావిత్రిబాయి ఉద్దేశంలో విద్య అంటే అక్షరాలు నేర్పడమే కాదు. పిల్లల మానసిక వికాసంపై దృష్టి కేంద్రీకరించడం. ఆ మేరకు విద్యా బోధనలో జాగ్రత్త వహించేవారు. పగలంతా పనిచేస్తేగాని ఆకలి తీరనివారి కోసం ఫూలే దంపతులు రాత్రి బడులు ప్రారంభించారు. ఆ బళ్లకు ఎక్కువగా దళితులు, వెనుకబడిన తరగతులవారు, వారి పిల్లలు, వ్యవసాయదారులు, కార్మికులు హాజరయ్యేవారు.
1882లో విద్యా కమిషన్ అధ్యక్షులు సర్ విలియం హంటర్‌కు జ్యోతిబా వినతిపత్రం అందజేశారు. అందులోని అంశాలు – ప్రాథమిక విద్యను తప్పనిసరి చేయాలి. విద్యకు బాలికలను ప్రోత్సహించాలి. విద్య భారతీయుల అవసరాల ఆధారిత అంశాలతో ఉపయోగంగా ఉండాలి. అనాథ పిల్లలకు విద్య అందించాలి. భారత వ్యవసాయ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయాన్ని బోధనాంశాల్లో చేర్చాలి. తక్కువ స్థాయివారి పిల్లల విద్యను అడ్డుకుంటున్న ‘వడబోత సిద్ధాంతాన్ని’ జ్యోతిరావు తీవ్రంగా వ్యతిరేకించారు. (బ్రిటిష్ ఇండియా విద్య, న్యాయ శాఖ మంత్రి లార్డ్ మెకాలే 1835 ఫిబ్రవరిలో వడబోత విద్యా సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం తమకు అనుకూలురైన అతి కొద్ది మంది ఉన్నత కులాల వారికి ప్రభుత్వం చదువు చెపుతుంది. వీళ్లు తక్కువ కులాల వారికి విద్య అందిస్తారు.) బడుగుల పిల్లలు బడి మానడానికి వారి సామాజిక పరిస్థితులు, పేదరికం కారణమని జ్యోతిబా వివరించారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి విద్యలో వృత్తి నైపుణ్యతలు బోధించాలి. ఉపాధ్యాయులు సుశిక్షితులయి ఉండాలి. కింది తరగతుల పిల్లలకు సామాజిక విద్య నేర్పడానికి ఉపాధ్యాయులు కింది తరగతివారై ఉండాలి. ఉపాధ్యాయులకు వ్యవసాయం, ఆరోగ్యం, పరిశుభ్రతల గురించి తెలియాలి. గ్రామీణ ఉపాధ్యాయులకు జీతాలతో పాటు విద్యార్థుల ఉత్తీర్ణత, సామర్థ్యాలను బట్టి ప్రత్యేక భత్యం ఇవ్వాలి. వ్యవసాయదారుల పిల్లలకు ఉన్నత విద్యలో రాయితీలివ్వాలి. పేదలు, వెనుకబడ్డ తరగతుల విద్యార్థులకు ఉచిత గృహ వసతి కల్పించాలి. విద్య ప్రభుత్వ అధీనంలో ఉండాలి. ఈ సలహాలు, సూచనలను జ్యోతిబా తాను స్థాపించిన పాఠశాలల్లో అమలుచేశారు. విద్యార్థులకు పద్యగద్యాలలో ఉత్తరాలు రాయడం నేర్పారు. విలువల జీవితం గడపడానికి నీతి, నియమ నిబద్దతల సామాజిక విద్య నేర్పారు. ఆంగ్లభాష ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. వృత్తి నైపుణ్యతలను పెంచి అసహాయులను మేధోపరంగా ఉన్నతీకరించడంలో ఆంగ్లం కీలక పాత్ర పోషించిందని జ్యోతిబా అభిప్రాయం. ఆంగ్లేయ ప్రభుత్వంలో ఉద్యోగాలు సంపాదించడంలో ఆంగ్లవిద్య సహాయపడుతుందని నమ్మకం. అంటరానివారికి పాఠశాలలు నడపడానికి ఫూలే యూరోపియన్ల ఆర్థిక సాయం పొందారు. క్రైస్తవ విద్యా సంస్థలు దళితులకు విద్యా సౌకర్యాలు అందించాయి. ఫూలే ఆంగ్లేయుల విద్యాసేవలను మెచ్చుకున్నారు. ఆయన్ను అపార్థం చేసుకున్న బ్రాహ్మణులు జోతిబా క్రైస్తవం పుచ్చుకున్నారని దుష్ప్రచారం చేశారు.
18వ శతాబ్దంలో, భారత దేశ ఎగుడుదిగుళ్ల విద్యారంగ చరిత్రతో అనుబంధమున్న రాజా రాంమోహన్‌రారు, డేవిడ్ హేర్, విలియం కారేల పక్కన మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే నిలుస్తారు. బాలికల, అంటరానివారి విద్య, దళిత జనోద్ధరణ, మహిళా విముక్తి, సామాజిక విప్లవం మొదలగు రంగాల్లో పనిచేసిన మహాదేవ్ గోవింద రానడే, విష్ణుశాస్త్రి చిప్లున్కర్, గోపాల్ గణేశ్ అగార్కర్, ధొండే కేశవ్ కర్వే, పండిత రమాబాయి, మహాత్మా గాంధీల కంటే ముందు పుట్టినవారు జ్యోతిరావు, సావిత్రిబాయి. దళిత ఉద్ధరణ, దళిత బాలికల, మహిళల విద్య, మహిళా విముక్తి, సామాజిక విప్లవం ఫూలే దంపతుల ప్రత్యేకతలు. దళితుల కోసం ఫూలే దంపతులు సర్వస్వం త్యాగం చేశారు. జీవితాలనే అర్పించారు.
(నేడు జ్యోతిబాఫూలే జయంతి)
– సంగిరెడ్డి హనుమంత రెడ్డి
9490204545