‘పుణ్యం కోసం వెళ్తే ..పాపం ఎదురైందనే’ నానుడి మహా కుంభమేళా యాత్రికులకు సరిగ్గా సరిపోతుంది. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ శనివారం రాత్రి ప్రయాగరాజ్ వెళుతున్న ప్రయాణికుల తొక్కిసలాటలో పద్దెనిమిదిమంది నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. రైల్వేశాఖ ముందస్తు ప్రణాళికలు, భద్రతా ఏర్పాట్లలో విఫలం చెందిందనే విమర్శలు మూటకట్టుకుంది. దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రయాణికులు రైళ్లలో కుంభమేళాకు వెళ్తున్న సంగతి తెలిసిందే. అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన రైల్వే సిబ్బంది పూర్తి నిర్లక్ష్యం వహించింది. అవగాహనా రాహిత్యం, పరస్పర సమాచారం లోపం ఈ దుర్ఘటనకు కారణమైంది. స్టేషన్‌లో సిబ్బంది ప్లాట్‌ఫారం నెంబర్లు మార్చినట్టు ప్రకటనలు చేయడం, ఒకటే పేరుతో రెండు రైళ్లు ప్రయాగరాజ్‌కు వెళ్లడానికి పట్టాలపైకి రావడం, వేలాదిమంది స్టేషన్‌లోపలికి పరిగెత్తుకు రావడం, వారిని నియంత్రించకపోవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని రైల్వేశాఖ ప్రాథమికంగా వెల్లడించింది. ఇంతమంది యాత్రికులు స్టేషన్‌కు వస్తున్నప్పుడు వారి రక్షణకు తగిన సిబ్బందిని ఎందుకు కేటాయించలేదనేది ప్రశ్న? గంట గంటకు పదిహేను వందల జనరల్ టికెట్లు అమ్మి నట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్యాసింజర్ రైళ్లలో రెండు లేదా మూడు జనరల్ బోగీలు ఉంటాయి. ఒక్కో బోగిలో వందమంది చొప్పున అనుకున్నా మూడు వందల మందికి మించరు. ఎంత కిక్కిరిసినా మహా అయితే ఐదు వందలు అందులో ప్రయాణించగల్గుతారు. అలాంటప్పుడు అన్ని టిక్కెట్లు ఎలా అమ్ముతారు?వారిని ఎక్కడ కూర్చోబెడతారు? ఇవి ఏమైనా ఆలోచించారా? ఇది రైల్వే శాఖ లాభాపేక్షనే అనుకోక తప్పదు. టిక్కెట్లు అమ్ముకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రయాణికుల ప్రాణాలను కాపాడటంలో లేదు. దీనికి ఎవరు కారణం, మృతుల కుటుంబాలకు జవాబు చెప్పేదెవరు? ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత రైల్వేశాఖదే. ఇప్పుడు చనిపోయిన వారి కుటుంబాలను కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలి. గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ఉచితంగా వైద్యమందించాలి. వారు కోలుకునే వరకు దగ్గరుండి పర్యవేక్షించాలి. మృతుల కుటుంబాల్లో విద్యార్హతలను బట్టి రైల్వేశాఖలో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించాలి.
– దండంరాజు రాంచందర్ రావు, 9849592958