వెన్నె‌ల‌లు మ‌న‌కు పంచి గ‌గ‌నానికి ఎగిరిపోయిన చ‌కోరం

The moons are a piece of cake thrown to usఅవధి లేని అందముంది అవనికి నలు దిక్కులా’ అంటారు సీతారామ శాస్త్రి ఓ సినీ గీతంలో! నిజమే, ఉన్న ఎనిమిది గ్రహాల్లో అత్యంత అందమైనది ఈ నీలి గోళమే కదా! ఈ అందాలు రెండు రకాలు.. సముద్ర తీరాలూ, కొండలూ, గుట్టలూ, నదులూ, జలపాతాలూ, ఎడారులూ, వయాసిస్సులూ, ఇంద్ర ధనస్సులూ, నీలి మబ్బులూ, మట్టి దిబ్బలూ..
లాంటి నిర్జీవ రూపాల మనోహరం మొదటిదైతే, ఆ రూపాలకు చైతన్య సుందరత్వాన్ని అద్ది ఈ అపరిమిత సౌందర్యానికి పరిపూర్ణతను సిద్ధింప జేస్తోన్న అనంతకోటి జీవజాతుల జీవావరణం రెండోది. మరి ఇంతటి విశాలమైన ఈ సౌందర్య జగత్తులో జన్మించి, అందులో అందినంతయినా తిలకించి పులకించకుండా తనువు చాలించే మనుషులంత దురదృష్ట జీవులు మరొకరుండరు. చివరి శ్వాస వరకూ పాదాలను చక్రాలుగా మార్చుకొని తిరగ గలిగినంత మేరా తిరిగి, గుండెకు రెక్కలు మొలిపించు కొని ఎగరగలిగినంత మేరా ఎగిరి దర్శించుకొనడమే కాకుండా తాము చూసిన ఆ అందాలను అంతే అందంగా కెమెరాల్లో బంధించి, భద్రపరచి మనందరికీ అందించిన వారంతటి ధన్య జీవులు వేరొకరుండరు. అలాంటి అరుదైన, అపురూప యాత్రికురాలు కంభం పాటి సీత.
సీత, ఆమె భర్త శ్రీనివాస్‌ రావు ఇద్దరూ వరంగల్‌ కళాశాలలో జీవశాస్త్ర, వృక్ష శాస్త్ర అధ్యాపకులుగా పనిచేశారు. ఉద్యోగంలో ఉన్నప్పటినుండి వీరికి ప్రకృతన్నా, దాని సౌందర్యమన్నా ఎంతో మక్కువ. ఆ మక్కువ ఎక్కువవడంతో వీళ్ళు సహజంగానే వీలయినప్పుడల్లా అడవుల్లోకి, కొండల్లోకి, అందమైన మైదానాల్లోకి వెళ్లి ఆనందంగా గడిపి రావడం హాబీగా మార్చుకొన్నారు. ఇంకేముంది, అంతే సహజంగా వీళ్ళ చేతుల్లోకి కెమెరాలు వచ్చి చేరాయి. దాంతో తాము వెళ్ళిన ప్రదేశాల్లోని ప్రతి అందమైన దృశ్యాన్నీ అంతే అందంగా బంధించి ఇంటికి తెచ్చి, వాటిని మరింత అందంగా తీర్చి దిద్ది, పది మందికి చూపించి, భద్రపరచడం అలవాటు చేసుకొన్నారు. చివరికి బలమైన బలహీనతగా మార్చుకొన్నారు. అందులో భాగంగా ఆమె భర్త వెంట మన దేశంలో అడుగు పెట్టని అడవి, సందర్శించని సరస్సు, ఎక్కని కొండ, దిగని కోన, దాటని నది లేదంటే అతిశయోక్తి కాదు. ఒక్క హిమాలయాలకే ముప్పై సార్లు వెళ్ళారంటే అర్థం చేసుకోవచ్చు. మన దేశమే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఐరోపా, కెన్యా, న్యూజిలాండ్‌, భూటాన్‌…ఇలా ఎన్నో ఖండాల్ని, విదేశాల్ని కూడా చుట్టేసి, అక్కడి అందాల్ని కూడా ఒడిసి పట్టేసి తెచ్చేశారంటే వీరి సౌందర్య పిపాస ఎంత తీవ్రమైనదో, వీరి పట్టుదల ఎంత గట్టిదో అర్థమౌతుంది. నలభై ఏండ్లకు పైగా నిరంతరంగా సాగిన అలుపెరుగని ఈ జంట విహంగ విహారానికి గత నెల 30న ఒక్కసారిగా కోలుకోలేని, మేలుకోలేని అంతరాయం.. డెబ్బై ఏండ్ల సీత అనూహ్య మరణం.
ఫొటోగ్రఫీ ప్రయాణం
ఫొటోగ్రఫీలో సీతకు భర్తే గురువు. శ్రీనివాస్‌రావు నుండి మెళకువలు నేర్చుకున్న ఆమె ఫొటోగ్రఫీ ప్రయాణం మొదట landscape photographyతో ప్రారంభమై తర్వాత wildlife photographyగా, మరీ ముఖ్యంగా bird photographyగా పరిణామం చెందుతూ, పరిణతి పొందుతూ పరిఢవిల్లింది. మహానది, ప్రవహించే తన దారిలో కేవలం బండ రాళ్ళను మాత్రమే ఢ కొడుతుందను కోవడం మన అవగాహనా లోపం. అది, అందిన ప్రతి మట్టి రేణువును, రెల్లు పువ్వును, గడ్డి పోచను కూడా తాకుతూ, తడుముతూ, తడుపుతూ, తరిస్తూ పోతుంది. అలాగే ఈమె కూడా తమ దారిలో ఎదురైన మహోన్నత పర్వతాల్నీ, బలీయమైన ఏనుగుల్ని, పులుల్నీ ఎలా కెమెరాల్లో బంధించారో, చిన్ని చిన్ని రంగు రంగుల సీతాకోక చిలుకలను, సుందర సుకుమార సుమాల్ని కూడా అంతే సున్నితంగా కెమెరాల్లోకి ఎక్కించారు! అంటే తమ దారిలో ఎదురైనా ఏ అందాన్నీ వదిలి పెట్టలేదన్నమాట. ఇలా అతి తక్కువ కాలంలోనే సీత గురువును మించిన శిష్యురాలిగా తనని తాను తీర్చిదిద్దుకున్నారు.
చక్కని మూడు పుస్తకాలు
ఇవన్నీ ఓ ఎత్తయితే, ఈ సౌందర్య సముదాయాన్నంతా ఎంతో అందంగా అక్షరీకరించడం మరో ఎత్తు! అవును, ఈమె తన భర్తతో కలిసి తమ అనుభవాల్ని, అనుభూతుల్ని కలబోసి, రంగరించి, రంగు రంగుల ఛాయా చిత్రాల్ని అందులో గుది గుచ్చి, మూడు చక్కని పుస్తకాల్ని ప్రచురించి మనకు అందించారు. వీరు ముద్రించిన మొదటి పుస్తకం ‘విశ్వ విహారం’. ఇది ముఖ్యంగా వీరు దర్శించిన తీర్థ స్థలాలను గూర్చిన వివరణాత్మక పుస్తకం. ఇందులో ఎక్కడా వన్యప్రాణుల ప్రస్తావన లేదు. రెండోది రంగు రంగుల పక్షుల ఫొటోలతో నిండిన ‘Burds Beautiful” అనే పుస్తకం. నాకు వీరితో పరిచ యం ఈ పుస్తకం ద్వారానే జరిగింది. తర్వాత కాలంలో సీత గారికి ఎఫ్‌బీలో మిత్రుడిగా మార డం, వారిని ప్రత్యక్షంగా కలవడం జరిగింది. ఇక వీరు ముద్రించిన మూడో పుస్తకం Call of theWild. ఇది వీరు కెన్యాలోని masai mara అడవుల్లో తీసిన వన్య మృగాల అందమైన ఛాయా చిత్రాల సంపుటి. ఇందులో అన్నీ మృగాలే. గంభీర మైన ఆఫ్రికా ఏనుగులు, సింహాలు, చిరుత పులు లు, అందమైన చీతాలు, అరుదైన ఆఫ్రికా హైనా (దుమ్మలగొండి)లు, రెండు కొమ్ముల ఆఫ్రికా ఖడ్గ మృగాలు, జింకలు, దుప్పి జాతులు.. ఇలా అనేక రకాల వన్య మృగాల్ని వాటి సహజ పరిసరాల్లో, సహజ స్వభావంతో, ఎంతో కష్టపడితే కానీ సాధ్యం కాని చక్కని ఫొటోలతో మన ముందుకు అందమైన అచ్చు రూపంలో తీసుకొచ్చారు.
వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌గా…
మిత్రులారా.. ఫొటోగ్రఫీ ఏముంది, కెమెరాలో నుండీ చూస్తూ క్లిక్‌ మనిపించడమేగా, అని ఎంత సులభంగా కనిపిస్తుందో, అనిపిస్తుందో, నిజానికి అంత కష్టమైన కళా రంగం ఇది. వాస్తవానికి ఏ కళయినా అంతే! అందులోనూ వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రఫీ మరింత కష్టమైందే కాకుండా ఎంతో ముప్పు(రిస్క్‌) తో కూడుకున్నది. ఇది ఓ వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌గా నా అనుభవంతో చెబుతున్న మాట! ఇంతటి కఠినమైన అభిలాషను సీత డెబ్బై ఏండ్ల వయసులో నిర్వహించారంటే ఎవరైనా నివ్వెర పోవాల్సిందే! వీరికి సెల్యూట్‌ కొట్టాల్సిందే! ఇటువంటి సాహస యాత్రలు వీరి జంట గత నలభై ఏండ్లుగా నిర్విరామంగా కొనసాగించారంటే ఎవరైనా నోళ్ళు తెరవాల్సిందే కదా!! దేశ, విదేశాల్లోని ఇలాంటి ఎన్నో పక్షుల, జంతువుల అభయారణ్యాలకు ఆమె భర్త వెంట ఎన్నో పర్యాయాలు పర్యటించారు. ఎన్నో అందమైన ఫొటోలు మనకోసం తీసుకొచ్చారు. అందుకు ఆమె పొందిన ప్రతిఫలం కేవలం సంతృప్తి. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 62 ఏండ్ల వయసులో ఆమె ఈత నేర్చుకోవడమే కాకుండా, ఆ వయసు వారితో ఈతల పోటీల్లో పాల్గొని ఎన్నో బంగారు పతకాలు కూడా సాధించడం! హిమాచల్‌ ప్రదేశ్‌లోని తీర్థన్‌ నదిలో నీళ్ళు అత్యంత శీతలంగా ఉంటాయి. ఎందుకంటే అవి హిమాలయల్లోని మంచు కరిగి ప్రవహిస్తున్నవి గనుక. ఆ నదిలో దిగడానికి స్థానికులు కూడా జంకుతారట. అలాంటి నదిని ఆమె స్థానికులు వారిస్తున్నా వినకుండా అటునుండి ఇటుకు ఈదారంటే ఆవిడ మానసిక, శారీరక స్థైర్యానికి జోహార్లు అర్పించకుండా ఉండలేం.
ఏ పక్షిని చూసినా…
ఆగష్టు నెల 25న హైటెక్‌ సిటీ దగ్గరున్న సీసీఆర్‌టీ హాల్లో ఈ జంటTalk on Bird Photography Travelling అనే అంశం మీద ప్రసంగ కార్యక్రమం జరిగింది. దానికి మేమూ వెళ్లాము. అదే వీరిని మేము చివరిగా కలిసింది. తర్వాత మేము సెప్టెంబర్‌ 4న సొంతంగా కార్‌ డ్రైవ్‌ చేసుకుంటూ 54 రోజులు ఏకధాటిగా ఏడు రాష్ట్రాలు దాటి, 7500 కిమీ ప్రయాణించి తిరిగి అక్టోబర్‌ 29న హైదరాబాద్‌ చేరుకున్నాం. 30వ తేదీ సీత పోయారనే వార్త నన్ను శరాఘాతంలా తాకింది. నా అనుభవాల్ని పంచుకొంటూ, వారిద్దరి నుండి ఎన్నో నేర్చుకొంటూ, ఇంటర్వ్యూ చేయాలన్న నా కోరిక తీరకుండానే పోయింది! ఏ పక్షిని చూసినా.. పులిని గాంచినా.. ఏ పుణ్యక్షేత్రాన్ని స్మరించినా… హిమాలయాలను తలచుకొన్నా సీత గారు స్మరణకు వచ్చి చిరునవ్వులతో మనోఫలకం మీద సాక్షాత్కరిస్తారనడంలో సందేహం లేదు!
– ఎస్‌.ఎస్‌.బి. గేరా, 9492922492

Spread the love