నవతెలంగాణ – తంగళ్ళపల్లి
మన దేశానికి ఎనలేని సేవలందించిన ఎందరో మహనీయుల పట్ల అధికారులు నిర్లక్ష్యం వాయిస్తున్నారు. సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తంగళ్ళపల్లి, పద్మ నగర్, ఓబులాపూర్, పాపయ్య పల్లె గ్రామపంచాయతీ కార్యాలయాల్లో పంచాయతీ కార్యదర్శులు హాజరు కాకపోవడంతో తంగళ్ళపల్లి ఇంచార్జ్ అధికారి ఎంపీ ఓ, పద్మనగర్, ఓబులాపూర్, పాపయ్య పల్లె గ్రామాల్లో కారోబర్లు గ్రామస్తులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అలాగే మండల వ్యవసాయ కార్యాలయంలోని అధికారులు అంబేద్కర్ జయంతిని మర్చిపోయారు. వ్యవసాయ శాఖకు సంబంధించిన మండలంలోని 5 క్లస్టర్లలో ఏ ఒక్క క్లస్టర్ లో కూడా అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించలేదని విమర్శలు వెల్లువెత్తాయి.ఒక్క అంబేద్కర్ జయంతి కే కాదు ఇలా మన దేశానికి ఎనలేని సేవలందించి అమరులైన మహనీయుల జయంతిలకు, వర్ధంతి లకు ఇటు గ్రామస్థాయి అధికారులు అటు మండల స్థాయి అధికారులు కూడా హాజరు కాకుండా తమ కిందిస్థాయి అధికారుల చే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మహనీయుల జయంతి రోజున సెలవు దినం కావడంతో అధికారులు వారి వారి కార్యాలయాలకు రాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇలా మహనీయుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.