వారాల ఆనంద్ ‘కరచాలనం’, పేరుని సార్ధకం చేసుకుంటూ ఇరవయి ఏడుమంది గొప్ప సాహితీవేత్తలతో మనం కూడా కరచాలనం చేసేలా చేస్తుంది. ఇందులో కొన్ని విన్న పేర్లు, కొన్ని తెలిసిన పేర్లు, కొన్ని అసలు తెలియని పేర్లు. విన్నవీ, తెలిసినవీ కూడా ఒక సినిమా డైరెక్టర్ అనో, ఒక నటి అనో, ఒక కవి అనో, ఒక గాయకుడు అనో మాత్రమే తప్ప, ఎవరి గురించీ లోతుగా తెలియదు చాలామందికి. ఈ ‘కరచాలనం’ ఆ పదానికే కొత్త అర్దాన్ని చెబుతూ అందరితోటీ కరచాలనం చేసేలా చేస్తుంది. మనం విన్న, తెలుసు అనుకున్న పేర్ల వెనుక ఇన్ని కథలున్నాయా, ఒక్కొక్కరిలో ఇంత ప్రత్యేకమైన, ఉన్నతమైన వ్యక్తిత్వం ఉంటుందా అనిపించింది ఈ పుస్తకం చదువుతున్నంత సేపు. ఎవరికీ వారే సాటి.
గుల్జార్ తన రచన ‘»Actually I Met Them’ లో చెప్పినట్టు, ఆనంద్ actually met all these personalities he mentioned in his book. ‘కరచాలనం అంటే చేతులు కలపటం మాత్రమే కాదు, కలవటం అనేది వ్యక్తిగతంగానే అవాలనీ లేదు. ఎంతో మంది వ్యక్తుల గురించి వ్యక్తిగతంగా కలువకుండానే మనం వింటూ ఉంటాం. మనకి ఇంట్రెస్టింగా అనిపించిన వారి గురించి తరచి చూసి మరెంతో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. వారి వ్యక్తిత్వానికి సలాం చేస్తాం. మనసులో ముద్రించుకుంటాం కూడా. గుల్జార్ ఇన్‌స్పిరేషనేనేమో తన పుస్తకాన్ని ఆనంద్ గుల్జార్ పరిచయం తోటే ప్రారంభించారు.
అలా తనకి నచ్చిన కవితలను అనువాదం చేస్తూ, అంత గొప్ప కవితలను రాసిన ఆ కవుల గూర్చి మరింత తెలుసుకుంటూ వారితో కరచాలనం చేసారు ఆనంద్. అక్కడితో ఊరుకోకుండా, ఈ పుస్తకం ద్వారా మన అందరితో కూడా కరచాలనం చేపించారు.
సాధారణంగా ఒక్కొక్కరు ఒక్కో రంగంలో నిష్ణాతులై ఉంటారు. ఈ ‘కరచాలనం’లో పేర్కొన్న సాహితీవేత్తలందరు బహుముఖ ప్రజ్ఞాశాలులే. కవనం, కథనం, గానం, దర్శకత్వం, ఇలా ఎన్నో రంగాలలో నిపుణతకలిగినవారు కనపడతారు ఇక్కడ. కొంతమంది సినీ రంగంలో రాణించిన వారయితే, మరి కొంతమంది సాహిత్య రంగంలో రాణించినవారు. మరి కొందరు రెండు రంగాల్లోను పేరు గడించి, వివిధ రూపాలలో తమ సజనను ప్రదర్శిస్తూ తమదైన ముద్ర వేసుకున్న వారు ఈ పుస్తకంలో కనపడతారు.
ఇందులో ఒక్కొక్క సాహితీ వేత్తను గూర్చి చదువుతుంటే భూపేన్ హజారికాను గురించి చదవగానే.. ‘దిల్ హూం హూం’ అనకుండా ఉంటుందా! కవి ప్రదీప్‌ను గురించి చదవగానే.. ‘చల్ చల్ రే నవ్ జవాన్’ అంటూ కాళ్ళు లెఫ్ట్ రైట్ కొట్టకుండా ఉంటాయా! సాహిర్ లుధియాన్వీని గురించి చదవగానే ”మై పల్ దొ పల్ కా షాయిర్ హూ” అని మది పాడకుండా ఉంటుందా!
భూపేన్ హజారికా, కవి ప్రదీప్, సాహిర్ లుధియాన్వీ ఇలా కొంతమందిని గురించి చదివినప్పుడు, ఎక్కడో జ్ఞాపకాలలో మరుగున పడ్డ పాటలు తలపునకు వచ్చి ఆ పాటలు వినాలనిపించింది. అలా ఒక రోజుకి ఒక కవిని మాత్రమే చదవగలిగాను.
అలాగే అమతాప్రీతంను చదివితే… స్త్రీ పురుషుల మధ్య ప్రేమకు కొత్త నిర్వచనం వినపడుతుంది. దీప్తి నావెల్‌ను చదివితే, ఆమె జ్ఞాపకాల చిత్రణలో ఏ మొహమాటాలు లేని తన బాల్యం కనిపిస్తుంది.
మమంగ్ దాయి ని చదివితే, ఒక ట్రైబల్ జాతిలో జన్మించి, ఐ.ఏ.ఎస్ ను వదులుకుని సాహిత్యానికే పెద్ద పీట వేసిన ధీర వనిత కనిపిస్తుంది
‘యుద్ధం వాయిదా వేస్తేనే మంచిది’ అన్న సాహిర్ లుధియాన్వీ కవిత, ‘తల్లి చిత్రం’ అన్న మంగలేష్ దబ్రాల్ కవిత, ఇసుక – నురుగు అన్న ఖలీల్ జిబ్రాన్ కవిత అన్నీ ఆణిముత్యాలే.
వీరి అనువాదాలు నాకు ఇతర భాషా సాహిత్యాలను పరిచయం చేశాయి. ఆంగ్లంలో మంచి ప్రవేశం ఉండి కూడా మాతభాషలోనే రాసిన సీతాకాంత్ మహాపాత్ర ఆశ్చర్యం కలిగిస్తారు. తన మాతభాష డోగ్రీకి అధికారభాషగా గుర్తింపుకి కషి చేసిన పద్మాసచ్ దేవ్ ప్రయత్నం అభినందనీయం. జానపద గేయాలను పాడుతూ ప్రకతి కవిగా పేరుపొందిన హల్దార్ నాగ్, ఒక అద్భుతం. వీరందరిని గురించి తెలుసుకునే అవకాశం ఇచ్చింది ఈ ‘కరచాలనం’.
ఇప్పటికీ కొన్ని కుటుంబాలలో స్త్రీ విద్యకి ప్రాముఖ్యం ఇవ్వకుండా అమ్మాయి పెద్దదైన వెంటనే వివాహం చేసేద్దాం అనుకునే కుటుంబాలు చాలా ఉన్నాయి. అలాటిది, 50, 70, 80వ దశకంలోనే ఉన్నత విద్యను అభ్యసించి, సాహితీ కిరీటాలు ధరించిన అమతా ప్రీతమ్, సుగతకుమారి, దీప్తినావల్ వంటి స్త్రీ మూర్తులూ కనపడతారు ఇక్కడ.
ఇరవయి ఏడుమంది గొప్ప సాహితీవేత్తలతో పాటు ఒడిస్సా వాసుల జీవన విధానం, బోడో జాతి తెగల వైవిధ్య జీవన విధానం, వారి జీవితాల చుట్టూ అల్లుకున్న సాహిత్యం గురించి కూడా ఇక్కడ పరిచయం చేసారు ఆనంద్.
అట్టడుగు వర్గం నుంచి వచ్చి, ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటు కూడా సాహితీ శిఖరాలను చేరుకున్నవారున్నారు. జీవితం అందరికీ ఒక పోరాటమే. మెకానిక్ షాపులో పని చేస్తూ, కిరాయికి పుస్తకాలు తెచ్చుకుని చదువుతూ ఎదిగిన గుల్జార్. మూడవ తరగతి వరకే చదువుకుని, తండ్రిని కోల్పోయి, చిన్నా చితకా పనులు చేస్తూ కూడా తరువాతి కాలంలో ఒరియా నేర్చుకుని, కోసలి భాషలో కవితా సష్టి చేసిన హల్దార్ నాగ్. టి.బి వ్యాధితో ఆప్తులైనవారిని పోగొట్టుకున్న కున్వర్ నారాయణ్. ఇలాంటి చరితలు యువతకి మార్గ దర్శకమవుతాయి, మోటివేషనల్ స్పీకర్స్‌కి మంచి ఉదాహరణలు దొరుకుతాయి. అలా ఈ పుస్తకమొక ఒక మోటివేషనల్ గైడ్‌గా కూడా పని చేస్తుంది అనిపించింది నాకు.
కరచాలనం అన్న పదానికి విస్తతమైన అర్ధాన్ని సూచించిన ఈ పుస్తకం, భారత దేశానికి చెందిన, వివిధ కాలాల, వివిధ ప్రాంతాల భాషా సంస్కతులను, వివిధ సాహితీకారుల వ్యక్తిత్వ చిత్రణనూ మన ముందు ఉంచింది. ఎందరో లివింగ్ లెజెండ్స్‌ని పరిచయం చేసింది.