చిత్రాలు – చరిత్రలు

Pictures - Historiesస్కూలు నుంచి వచ్చీ రావటంతోనే స్కూలు బ్యాగును, టిఫిన్‌ బాక్స్‌ను చెరోపక్క విసిరికొట్టాడు బిట్టు. కోపంగా వెళ్లి సోఫాలో కూలబడ్డాడు. బిట్టూ ఏడవ తరగతి చదువుతున్నాడు. కమల్‌, వాణీల ఏకైక పుత్రుడు. తన ఆలోచనలు, ఆశయాలకు తగ్గట్టు కొడుకు తీర్చిదిద్దాలని కమల్‌ తాపత్రయం. అందుకు బిట్టూని తన వెంట సభలకు తీసుకెళుతుంటాడు. బిట్టూకి ఓ ఐపోన్‌ కూడా ఇప్పించాడు. అంతేకాకుండా అనేక వాట్సప్‌ గ్రూపుల్లో చేర్చించాడు. తన ఆశయాలను బోధించే యూట్యూబ్‌ ఛానళ్లకు సబ్‌స్క్రైబ్‌ కూడా చేయించాడు. వీలు చిక్కినపుడల్లా ”కాశ్మీర్‌ ఫైల్స్‌, కేరళఫైల్స్‌, రజాకార్‌” లాంటి ‘చారిత్రాత్మక’ సినిమాలు కూడా చూయిస్తుంటాడు.
ఇటీవల విడుదలైన ‘ఛావా’ను హిందీలో, తెలుగులో కూడా రెండేసిసార్లు తండ్రీకొడుకులు ఎంతో తన్మ యత్వంతో చూశారు. ఆ సినిమా చూసి వచ్చిన మర్నాడే బిట్టూ స్కూలుకి వెళ్లి వచ్చి.. అన్ని విసిరి కొట్టాడన్న మాట.
”ఏమైందిరా అన్నీ విసిరికొడుతున్నావు?” అన్నది వాణి కోపంగా.
”డాడీ ఎప్పుడు వస్తాడు?” తల్లి మాట పట్టించుకోకుండా ఎదురు ప్రశ్న వేశాడు బిట్టూ.
”అడిగిందానికి సమాధానం చెప్పకుండా ఎదురుప్రశ్న వేస్తావేంట్రా?” మరింత కోపంగా అరిచింది వాణి.
”మమ్మీ ఇంకొక్క ప్రశ్న వేశావంటే నీవు కూడా విలన్‌వే?” అన్నాడు బిట్టూ.
”ప్రశ్నవేస్తే విలన్‌ అవుతానా? మరి స్కూల్‌ బ్యాగ్‌, టిఫిన్‌ బ్యాగ్‌ విసిరికొట్టి నీవు రౌడీవయ్యావు కదరా!” అంటూ బిట్టూ వీపు మీద ఒక్కటిచ్చింది వాణి.
”డాడీ వచ్చింతర్వాత నీ పని చెబుతానుండు!” అంటూ బయటికి పరుగెత్తాడు బిట్టూ.
తల బాదుకుంటూ వంటింట్లోకి వెళ్లింది వాణి.
ఇంతలోనే ఆఫీసు నుండి కమల్‌ వచ్చాడు.
”ఏడీ నా ముద్దుల కొడుకు?” అడిగాడు వాణిని.
”హీరో గారు బయటికి వెళ్లాడు!” అన్నది వాణి విసురుగా.
కమల్‌ నవ్వుకుంటూ బట్టలు మార్చుకుని వచ్చాడు. భార్య తెచ్చిన చాయి తాగుతూ కూర్చున్నాడు.
బయటి నుండి బిట్టూ వచ్చాడు. కషాయ జుబ్బా, ఫైజమా వేసుకున్నాడు. తలకు అదే కలర్‌ హెయిర్‌ బ్యాండు పెట్టుకున్నాడు. నుదుట పొడగాటి తిలకం దిద్దుకున్నాడు. ఆ గెటప్‌లో బిట్టుని చూసి కమల్‌ పొంగిపోయాడు.
”శెభాష్‌! బేటా నా కలలకు ప్రతి రూపంలా ఉన్నావు! ఏంకావాలో కోరుకో!” అన్నాడు కమల్‌ అభయమిస్తూ.
”నన్ను హీరోగా పెట్టి సినిమా తియ్యి డాడీ!” అన్నాడు బిట్టూ ఠీవిగా. కమల్‌ కండ్లు తిరిగాయి. కింద పడబోయి తమాయించుకున్నాడు.
”ఏం మాట్లాడుతున్నావురా! నరాలు కట్‌ అయిపోయినయి!” అన్నాడు కమల్‌ నోరు పెగల్చుకుని ”పోసాని”లా
”నిజమే మాట్లాడుతున్నాను డాడీ! నన్ను హీరోగా పెట్టి సినిమా తియ్యి!” అన్నాడు బిట్టూ మరింత గట్టిగా.
కమల్‌కి ఏం చెప్పాలో అర్థం కాలేదు.
”ఇపుడు సినిమా తియ్యాలంటే కోట్లు ఖర్చు అవుతుందిరా! అంత డబ్బు మన వద్ద లేదు కన్నా!” అన్నాడు నీరసంగా.
”మన అదానీ అంకుల్‌ని అడుగు డాడీ ఇస్తాడు!” అన్నాడు బిట్టూ.
”అదానీ డబ్బులు మనకెందుకు ఇస్తాడ్రా!” అన్నాడు కమల్‌ ఆశ్చర్యంగా.
”అదెంటి డాడీ, అలా అంటావు. డబ్బులు గవర్నమెంటు వద్ద ఉంటే ఫ్రాడ్‌ చేస్తారని, అందుకే అన్నీ అదానీ కిస్తే, అదానీ, అంబానీ అంకుల్స్‌ నిరుద్యోగులకి బోలెడు ఉద్యోగాలు ఇస్తారని మొన్న నీవేకదా చెప్పావు! అంబానీ, అదానీల వద్ద మన డబ్బులు చాలా ఉన్నాయి కదా! అందులో కొన్నే కదా సినిమా తీయడానికి అడిగేది!” అన్నాడు బిట్టూ.
వంటింట్లో నుండి వాణి కిలా కిలా నవ్వింది.
వెంటనే వంటింట్లోకి వెళ్లి అక్కడే ఉన్న కత్తిపీట తీస్కుని వాణిని పొడిచెయ్యాలని అన్పించింది కమల్‌కి. కాని తమాయించుకున్నాడు.
”ఇంతకూ, సినిమా ఎందుకురా? నీవు హీరోగా ఎందుకు?” అడిగాడు కమల్‌.
”నా చరిత్రను రికార్డు చెయ్యడానికి!” అన్నాడు బిట్టూ, కాలు మీద కాలు వేసుకుని.
”నీకేం చరిత్ర ఉందిరా, ఇంకా చదువుతూనే ఉన్నావు కదా!” అన్నాడు కమల్‌ ఆశ్చర్యంగా.
”నేను పుట్టగానే నన్ను నీ చేతిలో పెడితే, నా బరువు నీవు భరించలేక నన్ను మంచంలో పడేస్తే, మంచం ఒంగిపోయినట్లు, నేను పాకుతుంటే బండలు అరిగిపోయినట్లు, నేను దొగ్గాడుతుంటే మూడు తలల నాగుపాము ఎదురొస్తే, దాన్ని పట్టుకుని నా తలకింద పెట్టుకుని నిద్రపోయినట్లు, సినిమాలో చూపించాలి!” అన్నాడు బిట్టు.
”ఒరేయి, నీవు పుట్టినపుడు బరువు తక్కువగా ఉన్నావని, నెలరోజులు ఇంక్యుబిలేటర్‌లో పెట్టారు, నీవు దొగ్గాడుతుంటే, ఆడుకుంటావని నీ ముందు బాల్‌ వేస్తే, గంటసేపు గుక్కపట్టి ఏడ్చావు కదా!” అన్నాడు కమల్‌.
”అదంతా నాకు తెలియదు! అదంతా చూపాల్సిందే. నేను యుకెజిలో స్కూలు ఫస్టు వచ్చినట్లు, ఫస్టు క్లాసులో టౌను ఫస్టు వచ్చినట్టు, ఫిఫ్త్‌ క్లాసులో స్టేట్‌ ఫస్టు వచ్చినట్టు, సెవెంత్‌ క్లాసులో ఆలిండియా ఫస్ట్‌ వచ్చినట్టు వీటిన్నింటికి మోడీ తాత మనింటికి వచ్చి నాకు మెమొంటో ఇచ్చినట్లు కూడా తీయాలి!” అన్నాడు బిట్టు.
బిట్టు స్క్రిప్టుకి కమల్‌ బిత్తరపోయాడు.
”నీవు చెప్పింది బానే ఉందిగాని, నీవు అన్ని క్లాసుల్లో అత్తెసరు మార్కులతోనే పాస్‌ అయ్యావు కదా! పైగా ఏడవ తరగతి ఇంకా చదువుతూనే ఉన్నావు! మరి ఎలా?” అనుమానంగా అడిగాడు కమల్‌.
”అదంతా నాకు అనవసరం! సినిమా చివర్లో నేను ఔరంగజేబు కరాటే ఫైటు చేసినట్లు, ఆ ఫైటింగ్‌లో నేను కొట్టిన దెబ్బలకి, ఔరంగజేబు గుర్రం మీద పారిపోతుంటే, నేను ఛేజ్‌ చేసి, ఔరంగజేబును చంపి నట్లు ఉండాలి! క్లైమాక్స్‌లో శంభాజీని చంపిన ఔరంగజేబును చంపి నేను రివెంజ్‌ తీసుకున్నట్లు చూపాలి!” అన్నాడు బిట్టు కసిగా.
బిట్టు విజివలైజేషన్‌ చూసి కమల్‌కి దిమ్మ తిరిగింది. ”బ్రహ్మండం!” అంటూ చప్పట్లు కొట్టాడు.
మాంఛి స్క్రిప్ట్‌! ఎలాగైనా సినిమా తీయాల్సిందే! ఏ1 సహాయంతో బ్రహ్మాండమైన సినిమా తీద్దాం!” అన్నాడు కమల్‌. తన కొడుకు ఔరంగజేబును చంపడమనే కాన్సెప్ట్‌ బాగా నచ్చింది.
”ఎపుడో చనిపోయిన ఔరంగజేబును, ఇప్పుడెలా చంపుతారు? చరిత్రను అలా వక్రీకరించొద్దు!” అన్నది వాణి నచ్చచెబుతూ.
”ఇప్పుడే డాడీ సినిమా తీస్తానని అన్నాడు! నీవు అడ్డుపడకు మమ్మీ! లేకపోతే ఇదే సినిమాలో నిన్ను కూడా విలన్‌గా పెడతాం!” అన్నాడు బిట్టూ కోపంగా.
”అవున్రా! మీ మమ్మీ చెప్పింది నిజమే. ఔరంగజేబు ఎపుడో చనిపోయాడు కదా!” అన్నాడు కమల్‌.
”ఏ1తో తీస్తానని ఇందాకే చెప్పావు కదా! నా క్కూడా ఓ డౌటు వస్తోంది. నీవు, నాకు చూపించిన కాశ్మీర్‌ ఫైల్స్‌, కేరళ ఫైల్స్‌, రజాకార్‌, చావా సినిమాలు కూడా ఏ1తోనే తీశారా? వాటి స్క్రిప్ట్‌ కూడా నేను తయారు చేసినట్లే చేశారా? చెప్పు డాడీ?” అడిగాడు బిట్టూ.
”ఆ సినిమాల్లో వచ్చినదంతా నిజమే! కావాలంటే వాట్సప్‌ ఎన్నీసార్లైనా చదువుకో!” అన్నాడు నమ్మకంగా కమల్‌.
”మరి నాది స్క్రిప్ట్‌ అంటావెందుకు? నాదీ చరిత్రే కావాలంటే వాట్సప్‌ చూడు!” అంటూ తన ఐఫోన్‌ తండ్రికి ఇచ్చాడు.
కమల్‌ ఐఫోన్‌లో బిట్టు ఫ్రెండ్స్‌ గ్రూప్‌ చూశాడు. అందులో బిట్టు ఇంతకు ముందు తన చిన్నపుడు చేసిన పనులు ఏవైతో చెప్పాడో అవన్నీ, ఫొటోలతో సహా ఉన్నాయి! మోడీతో మెమోంటో తీసుకుంటున్న ఫొటో ఉంది! గుర్రం మీద పారిపోతున్న ఔరంగజేబును బిట్టూ ఛేజ్‌ చేసి, ఔరంగజేబును కిందేసి చంపుతున్న వీడియో కూడా ఉంది!
అవన్నీ చూసి కమల్‌ కండ్లు బైర్లుకమ్మి దభీమని కిందపడిపోయాడు! మొహం మీద ఐసునీళ్లు చల్లినా లేవనే లేదు!

Spread the love