మూడు రోజుల్లో పీఆర్ సీసీ రోడ్డు ఖాలీ చేయాలి 

– లేని పక్షాన చట్టపరమైన చర్యలు 
– ఆళ్ళపల్లి జీపీ కార్యదర్శి వి.శిరీష
నవతెలంగాణ – ఆళ్ళపల్లి 
ఆళ్ళపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ లో పార్టీ గద్దెలకు ఇరుపక్కలా పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించిన రెండు సీసీ రోడ్లలో ఓ సీసీ రోడ్డును పగులగొట్టి, మట్టిపోసి గుడెసె వేసిన కబ్జాదారుడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, పంచాయతీ రాజ్ శాఖ జిల్లా అధికారి చంద్రమౌళి ఆదేశాల మేరకు బుధవారం ఆళ్ళపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి వి.శిరీష మూడు రోజుల్లో రోడ్డు ఖాలీ చేయాలని అధికారికంగా నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ.. ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించే విధంగా పీఆర్ సీసీ రోడ్లను కబ్జా చేయడం సమంజసం కాదన్నారు. పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించిన సీసీ రోడ్డును గడువులోగా ఖాలీ చేయని పక్షంలో సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామ అభివృద్ధికి అడ్డుపడే విధంగా ప్రయత్నించే వారు ఎవరైనా ఉపేక్షించబోమని తెలిపారు. అదేవిధంగా కొత్తగూడెం డీపీఓ చంద్రమౌళి, డీఎల్ పీఓ రమణ సైతం స్వయంగా ఆళ్ళపల్లి బుధవారం సందర్శించి, సదరు వ్యక్తిని కబ్జా చేసిన రోడ్డును వెంటనే ఖాలీ చేయాలని, లేనిపక్షంలో పంచాయతీ రాజ్ శాఖ నియమాల ప్రకారం.. రోడ్డుతో పాటు కట్టిన ఇంటికి ఆళ్ళపల్లి గ్రామ పంచాయతీ అనుమతి పత్రం సైతం లేదని కావున ఇంటిని కూలగొట్టడం జరుగుతుందని హెచ్చరికలు జారీ చేసినట్లు గ్రామస్తుల నుంచి విశ్వసనీయ సమాచారం. అధికారుల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రింట్ మీడియా సాక్షిగా చెప్పిన సదరు వ్యక్తి మాటకు కట్టుబడి ఉంటారా? లేదా అన్నది వేచి చూడాల్సిందే!
Spread the love