విశ్వవిద్యాలయాల రక్షణ  ప్రభుత్వానిదే..

The protection of universities belongs to the government.నవతెలంగాణ – హైదరాబాద్: పాలక ప్రభుత్వాల పనితీరు చూస్తుంటే కంచే చేను మేసిన చందంగా మారింది. ఆరు దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఆకాంక్షలు “మా భూములు, మానీళ్లు మా ఉద్యోగాలు, మా నిధులు  మావే”.ఈ ఉద్యమాలకు ఊపిరిలూదింది విద్యార్థులే. కేవలం తెలంగాణకే పరిమితం కాదు, యావత్ భారతదేశంలో  ప్రజాస్వామిక ఉద్యమాలన్నింటికి తోడుగా నిలిచింది ప్రభుత్వ విశ్వవిద్యాలయాలే… ప్రశ్నించే గొంతుకలను నిలువరించేందుకే పాలక ప్రభుత్వాలు విద్యా సంస్థల, యూనివర్సిటీలను ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపడం. అందులో భాగంగానే యూనివర్సిటీ భూముల అమ్మకాలు/ పరాయీకరణ. తాజాగా హైదరాబాదులోని కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయు ) కు చెందిన 400 ఎకరాల భూమిని TGIIC కి రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టింది. దీనిని నిరసిస్తూ ఉద్యమించిన విద్యార్థిని, విద్యార్థులపై లాటీ ఛార్జ్ చేయడం, అక్రమంగా నిర్భందించి కేసులు బనాయించడం నిత్యకృత్యమైంది. కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థుల నిరసనకు, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు గొంతు కలిపాయి. ఇదిలా ఉండగానే  ప్రభుత్వం మాకు 400 ఎకరాల భూమి కేటాయించిందని చెప్పి TGIIC రాత్రికి రాత్రి బుల్డోజర్ లను  పంపి చెట్లను తొలగించి చదును చేస్తున్నది. దీనికి యూనివర్సిటీ అధికారుల నుండి అనుమతులు లేకుండానే బుల్డోజర్లను యూనివర్సిటీ కాంపౌండ్ లోకి అక్రమంగా పంపడం దురాక్రమణే అవుతుంది. భూమి హద్దులు కూడా ఇంతవరకు ప్రభుత్వంగానీ, యూనివర్సిటీ గాని నిర్ధారించలేదు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ నుండి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సర్టిఫికెట్ వచ్చిన తరువాత మాత్రమే సేకరించిన భూమిలో పనులు మొదలు పెట్టాలి. TGIIC చేస్తున్న పని రాజ్యాంగ / చట్ట విరుద్ధమైనది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వాదనలు హాస్యాస్పదంగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమకు మాట్లాడే, నిరసించే కనీస ప్రజాస్వామిక హక్కులు ( ప్రభుత్వ ఏడవ హామీ ) రక్షించబడతాయని భావించిన  ఉద్యమకారుల కల పగటికలే అయింది.
 జై తెలంగాణ ఉద్యమం 1969 నుండి  ఉవ్వెత్తున ఎగిసి పడింది. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు, ఆరు సూత్రాల పథకంలో భాగంగా, ఉపశమనం కోసం 1974లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ హైదరాబాద్ లోని కంచ గచ్చిబౌలిలో 2300 ఎకరాల భూమిని ( సర్వే నెంబర్ 25 ) కేటాయించి పరిశోధనలకు, విద్యా బోధనకు  కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ల్యాండ్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ గా ఖ్యాతి గడించి, ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలను అందించిన విశ్వవిద్యాలయంగా  పేరుగాంచి ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్లో 100 వ స్థానాన్ని, భారత్ అక్రిడిటేషన్లో 10 వ స్థానాన్ని పొందింది. ఈ విశ్వ విద్యాలయానికి కేటాయించిన స్థలాన్ని కేవలం విద్యారంగ అభివృద్ధికి, పురోగతికి, పరిశోధనలకు మాత్రమే వినియోగించాలని ఇతరములకు కేటాయించరాదని నాటి ప్రభుత్వ ఉత్తర్వులలో స్పష్టంగా  పేర్కొన్నది. ఇంత స్పష్టంగా ఆదేశాలిచ్చినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జవహర్ నవోదయ స్కూల్ కు, ఏపీఎస్ఆర్టీసీ కి, స్పోర్ట్స్ అథారిటీకి, రంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్స్ కు, మండల రెవెన్యూ ఆఫీసుకు, స్టాటిస్టికల్ సెర్చ్ కు, ఏపీ ఎన్జీవోస్ కి అంటూ పలు విభాగాలకు 2004 వరకే 680 ఎకరాల భూమిని కేటాయింపులు చేశారు.  ఇప్పుడు TGIIC కి ఇచ్చిన 400 ఎకరాల భూమిని, వివిధ ప్రైవేట్ కంపెనీలకు కేటాయించారు. ఈ భూమి మొత్తంగా యూనివర్సిటీ కాంపౌండ్ లోనే ఉంది. దీనిని ప్రభుత్వ భూమి అనడం/ ప్రకటించడం ఏ మేరకు సమంజసం.
అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు,  విశ్వవిద్యాలయాల, విద్యాలయాల భూములను  అన్యాక్రాంతం చేయడం  ఆనవాయితీగా వస్తోంది. పర్యావరణాన్ని దెబ్బతీయడమే కాకుండా, నగరాలకు ఆక్సిజన్ అందించే  వృక్షాలను ధ్వంసం చేయడం, వీటితో మనుగడ సాగిస్తున్న  పశు పక్ష్యాదులను అంతమొందించడం, జాతి నిర్మాణానికి ఉపయోగపడే, పరిశోధనలకు అవకాశం లేకుండా చేయడం శోచనీయం. ఇది పూర్తిగా రాజ్యంగ వ్యతిరేక చర్య. కేవలం కాంక్రీట్ బిల్డింగులకు పరిమితం చేయడం అంటే  విద్యారంగాన్ని శాస్త్రీయత లేని యాంత్రీకరణ చేయడమే కాగలదు. విధ్వంసం ఎప్పటికీ అభివృద్ధి కాజాలదు. చారిత్రాత్మక  ఉస్మానియా యూనివర్సిటీకి 2400 ఎకరాల భూమిని కేటాయించగా ఇప్పుడు అది 1600 ఎకరాలకు పరిమితమైంది. కాకతీయ విశ్వవిద్యాలయాన్ని 640 ఎకరాల భూమిలో స్థాపించగా అనేక అక్రమాలకు గురైంది. ఇటీవల అగ్రికల్చర్ యూనివర్సిటీలోని 100 ఎకరాల స్థలాన్ని  హైకోర్టు నిర్మాణానికి కేటాయించారు. ప్రపంచ దేశాలలో యూనివర్సిటీలను ముందుచూపుతో  (200 లేక 300 సంవత్సరాలు) భూములు కేటాయించి  కాపాడుతుండగా తెలంగాణలో, దేశంలో మాత్రం తాత్కాలికంగా ఆలోచిస్తూ భూములను అన్యాక్రాంతం చేస్తున్నారు.
విద్యాలయాలు ఆధునిక దేవాలయాలు. దేశం పలు రంగాల్లో అభివృద్ధి సాధించడానికి  ఇవి దోహదకారులు. భావి తరాలలో చైతన్యాన్ని, శాస్త్రీయ అవగాహనను పెంపొందించడానికి సుక్షితులైన బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడే కేంద్రాలు విశ్వవిద్యాలయాలు. ఇప్పటికే కాంట్రాక్టు ఉద్యోగులతో, అరకొర వసతులతో  అల్లాడుతున్న విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం ఆపేసి,  ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు భారీగా అనుమతులు మంజూరు చేస్తున్నారు. వేలాదిమంది  విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. వందలాదిమంది బోధన, బోధ నేతర సిబ్బంది మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నారు. పచ్చని చెట్లు, పక్షుల కిలకిలా రావాలను కనిపించకుండా వినిపించకుండా, కుందేళ్లు దుప్పులు, అడవి పందుల పరుగులు  వినపడకుండా, జలాశయాల ఉనికి లేకుండా  చేస్తున్నారు. బఫెల్లో లేక్, పీకాక్ లేకులు లేవంటున్నారు. అసలది అటవీ భూమి కాదని వితండవాదం చేస్తున్నారు. బయో లైఫ్ ను రూపం లేకుండా చెరిపి వేస్తున్నారు. జంట నగరాలు ఆక్సిజన్ అందిస్తున్న  ఊపిరితిత్తుల వంటి అడవిని నాశనం చేసి వాతావరణం కలుషితం చేస్తున్నారు. పర్యావరణ శాస్త్ర వేత్తలు పరిశీలించి నిజాలు నిగ్గుతేల్చాలి.  మానవాళి మనుగడకు పర్యావర్ణ రక్షణ ప్రాధాన్యతను చాటి చెప్పాల్సిన సందర్భం కూడా! పురాతన చరిత్రకు ఆనవాళ్లుగా మిగిలిన మాఘ్రమ్ రాక్స్ ప్రాంతాన్ని కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారు. విద్యార్థుల నిరసనను పక్కదారి పట్టిస్తూ, మద్దతుగా నిలిచిన బుద్ధి జీవులు మేధావులపై  రెచ్చగొడుతున్నారనే అపవాదు మోపుతున్నారు. ప్రశ్నించడం అంటే ప్రజల కోసం, సత్యం కోసం, ప్రగతిశీల అభివృద్ధి కోసం నిలబడటమే. రెండున్నర దశాబ్ధాల పాటు బోధన చేయడంతో ఆత్మీయ అనుబంధం పెనవేసుకున్న, పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ వంటి పెద్దల అభిప్రాయాన్ని గౌరవించైనా  కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్సీయు భూముల కేటాయింపు ప్రక్రియను/ ఆలోచనను  తక్షణం ఉపసంహరించుకోవాలి. ఈ విషయంలో విజ్ఞతతో నిర్ణయం తీసుకోవడం పాలకుల బాధ్యత. ఈ ప్రత్యేక సందర్భంలో ఆపార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణా ఆత్మ గౌరవ రక్షణ కోసం చొరవ చూపడం ఎంతైనాఅవసరం.అనివార్యం కూడా!
Spread the love