Friday, June 5, 2026
E-PAPER
Homeజాతీయంసత్యంను మించిన రాజేష్‌ ఎక్స్‌‌పోర్ట్స్‌ స్కాం..

సత్యంను మించిన రాజేష్‌ ఎక్స్‌‌పోర్ట్స్‌ స్కాం..

- Advertisement -

రూ.15 లక్షల కోట్ల మాయాజాలం..
రెవెన్యూలో భారీ అక్రమాలు?
99 శాతం తప్పుడు ఆదాయమే
అవకతవకలపై సెబీ 109 పేజీల నివేదిక

ముంబయి : ప్రముఖ బంగారం, ఆభరణాల తయారీ దిగ్గజం రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్‌ (ఆర్‌ఈఎల్‌) భారత కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద రెవెన్యూ కుంభకోణానికి పాల్పడింది. సత్యం కంప్యూటర్స్‌‌ను మించిన అవకతవకలకు పాల్పడిందని స్పష్టమ వుతోంది. ఆర్‌ఈఎల్‌ ఏకంగా రూ.15.15 లక్షల కోట్ల ఆదాయాన్ని ఎక్కువ చేసి చూపింది. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ రెవెన్యూ మోసాలపై సెబీ విడుదల చేసిన 109 పేజీల నివేదికపై భారత కార్పొరేట్‌ ‌రంగంలో తీవ్ర చర్చకు దారి తీసింది. 2020-21 నుండి 2024-25 ఆర్థిక సంవత్సరాల మధ్య కంపెనీ తన ఏకీకృత ఆదాయాన్ని ఏకంగా రూ.15.15 లక్షల కోట్లు ఎక్కువగా చూపించిందని సెబీ ప్రాథమిక విచారణలో తేల్చింది. కంపెనీ పుస్తకాల్లో నమోదైన మొత్తం గ్రూప్ ఆదాయంలో ఇది దాదాపు 97 శాతం నుంచి 99 శాతం వరకు అధిక రెవెన్యూ ఉండటం గమనార్హం. సత్యం కంప్యూటర్స్ కుంభకోణం తర్వాత.. ఇంత భారీ స్థాయిలో రెవెన్యూను తప్పుగా చూపించడం భారత కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత అసాధారణమైన ఘటనాగా ఆర్థిక విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

స్విస్ అనుబంధ సంస్థతో మాయాజాలం
ఈ ఆదాయాల వ్యత్యాసాల వెనుక ప్రధానంగా ఆర్‌ఈఎల్‌ కంపెనీకి చెందిన విదేశీ అనుబంధ సంస్థల పాత్ర ఉన్నట్లు సెబీ గుర్తించింది. ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ రిఫైనరీ అయిన స్విట్జర్లాండ్‌కు చెందిన వాల్కాంబిని రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ 2015లో కొనుగోలు చేసింది. అయితే.. ఈ స్విస్ సబ్సీడరీ స్వతంత్ర ఆడిట్ నివేదికల్లోని వార్షిక ఆదాయానికి, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ గ్రూప్ లెక్కల్లో చూపించిన ఆదాయానికి మధ్య ఏమాత్రం పొంతన లేదని సెబీ స్పష్టం చేసింది. వందల కోట్ల ఆదాయాన్ని లక్షల కోట్లుగా ఎలా మార్చారనే దానికి.. కస్టమర్ల వివరాలు లేదా ఇన్‌వాయిస్‌ల వంటి ఎలాంటి బలమైన ఆధారాలను కంపెనీ సమర్పించలేకపోయింది.

వ్యక్తిగత ట్రేడింగ్‌లు.. నిధుల మళ్ళింపు
ఆదాయాన్ని పెంచి చూపడమే కాకుండా కంపెనీలో తీవ్రమైన కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు, నిధుల మళ్లింపు జరిగినట్లు సెబీ గుర్తించింది. కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) రాజేష్ మెహతా తన వ్యక్తిగత ఖాతాల ద్వారా దాదాపు రూ.11,487 కోట్ల విక్రయాలు, రూ.11,488 కోట్ల కొనుగోళ్లతో కూడిన డెరివేటివ్ లావాదేవీలను నిర్వహించారు. ఈ భారీ లావాదేవీలను నిబంధనలకు విరుద్ధంగా కంపెనీ బుక్‌లలో బిజినెస్ ట్రేడింగ్‌గా చూపించారు. అలాగే బోర్డు లేదా ఆడిట్ కమిటీ ముందస్తు అనుమతులు లేకుండానే కంపెనీ నిధులను ప్రమోటర్ల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల ద్వారా మళ్లించినట్లు తెలుస్తోంది.

ఒక మెయిల్‌‌లో వెలుగులోకి..
రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ఆర్థిక అక్రమాల వెనుక ఉన్న అసలు రహస్యాలు ఒక సాధారణ ఇన్వెస్టర్ పంపిన ఈ మెయిల్‌తోనే వెలుగులోకి వచ్చాయి. 2025 మార్చి 11న సెబీ ఇన్‌బాక్స్‌కు ఒక సాధారణ వాటాదారు పంపిన ఫిర్యాదులో.. కంపెనీ ఖాతాల్లో కస్టమర్ల నుంచి రావాల్సిన బకాయిలు ఏళ్ల తరబడి ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయనే సాంకేతిక అంశాన్ని లేవనెత్తారు. దీనిపై స్పందించిన సెబీ అక్టోబర్ 2024న దర్యాప్తు అధికారిని, డిసెంబర్ 2024న బిడిఓ ఇండియాను ఫోరెన్సిక్ ఆడిటర్‌గా నియమించింది. ఆడిట్ సంస్థకు కంపెనీ యాజమాన్యం తమ ప్రధాన ఇఆర్‌‌పి సిస్టమ్స్ పరిశీలించడానికి అనుమతించకపోవడంతో పాటు.. రూ.7,000 కోట్లకు పైగా శాంపిల్ లావాదేవీలలో కేవలం చిన్న మొత్తానికి మాత్రమే ఆధారాలు చూపడంతో సెబీ రంగంలోకి దిగింది. 2025 అంతటా వరుస సమన్లు జారీ చేసిన సెబీ తాజాగా బుధవారం తన రిపోర్ట్‌‌ను బయటపెట్టింది. విచారణకు సహకరించని యాజమాన్యం. సంస్థపై వచ్చిన ఆరోపణలపై విచారిం చడానికి రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ సహకరించలేదు. యాజమాన్యం ప్రధాన ఇఆర్‌‌పి అకౌంటింగ్ సిస్టమ్స్‌ను పరిశీలిం చడానికి ఆడిటర్లను అనుమతించలేదని, కీలక పత్రాలను దాచిపెట్టి విచారణకు ఏమాత్రం సహకరించలేదని సెబీ స్పష్టం చేసింది. కీలక ఆర్థిక పత్రాలను దాచిపెట్టి దర్యాప్తును ఉద్దేశపూర్వకంగా అడ్డుకుందని సెబీ తన నివేదికలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

మార్కెట్‌లో ప్రకంపనలు
ఈ తీవ్రమైన ఆర్థిక అవకతవకల నేపథ్యంలో సెబీ తక్షణ చర్యలు చేపట్టింది. కంపెనీ ప్రమోటర్ రాజేష్ మెహతా షేర్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయకుండా నిషేధం విధించింది. అలాగే కంపెనీపై కొత్తగా సమగ్ర ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశించింది. ఈ వార్త వెలువడిన వెంటనే స్టాక్ మార్కెట్‌లో రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ షేర్లు భారీగా పతనమై 5 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. ‌మార్కెట్లో హాట్‌‌టాపిక్‌‌గా మారి ప్రకంపనలు సృష్టించింది. మరోవైపు ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసీకి ఈ కంపెనీలో 10.8 శాతం వాటా ఉండటంతో ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రభుత్వ నిధులు, సాధారణ ఇన్వెస్టర్ల పెట్టుబడుల భద్రతపై మార్కెట్ వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవు తోంది. మరోవైపు ఈ ఆరోపణలను రాజేష్ మెహతా తోసిపుచ్చుతూ తాము త్వరలోనే చట్టపరంగా వివరణ ఇస్తామని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -